ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:18:03+05:30 IST

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పోతలపాడు గ్రామానికి చెందిన గాయం సత్యనారాయణరెడ్డి, గానుగపెంట గ్రామానికి చెందిన మూడమంచు రంగయ్య, మార్కాపురం మండలంలోని బొందలపాడు గ్రామానికి చెందిన పవనం అచ్చిరెడ్డి కుటుంబాలను శ్రీనివాసరావుతో పాటు నాయకులు శుక్రవారం పరామర్శించారు.

ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలి
పోతలపాడులో రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

తర్లుపాడు, జనవరి 21: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పోతలపాడు గ్రామానికి చెందిన గాయం సత్యనారాయణరెడ్డి, గానుగపెంట గ్రామానికి చెందిన మూడమంచు రంగయ్య, మార్కాపురం మండలంలోని బొందలపాడు గ్రామానికి చెందిన పవనం అచ్చిరెడ్డి కుటుంబాలను  శ్రీనివాసరావుతో పాటు నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలోని రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నీరు రాకపోవడంతో రైతులు బోర్ల కింద మిర్చి, పత్తి పంటలు సాగుచేసి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారన్నారు. పోతలపాడులో గాయం శ్రీనివాసులరెడ్డి తనకున్న 7 ఎకరాల పొలంతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి వంటి పంటలు సాగుచేయగా నాలుగు సంవత్సరాల నుంచి వరుసగా నష్టపోయి అప్పులు పాలయ్యాడని, అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో విధిలేని పరిస్థితిలో  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గడచిన 15 రోజుల్లోనే జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం రైతు కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షలు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి, పిల్లి తిప్పారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏరువ పాపిరెడ్డి, డి.సోమయ్య, గుమ్మా బాలనాగయ్య, సీఐటీయూ నాయకులు రఫి, ఏనుగుల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 బేస్తవారపేటలో..

బేస్తవారపేట : అప్పుల బాధతట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న  పిటికాయగుళ్ళ గ్రామానికి చెందిన రైతు చిలకల ఈశ్వరరెడ్డి కుటుంబాన్ని శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం చేదోడుగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం పిటికాయగుళ్ళ గ్రామంలో తీవ్ర వర్షాభావంతో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, జిల్లా నాయకులు   పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-22T05:18:03+05:30 IST