ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2020-03-12T06:46:44+05:30 IST

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ (ఈ-ట్రాక్టర్‌)ను హైదరాబాద్‌కు చెందిన సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ అభివృద్ధి చేసింది. 3-4 నెలల్లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి...

ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది

  • ధర రూ.5 లక్షలు 
  • అభివృద్ధి చేసిన సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ.. 
  • ఏడాదిలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ (ఈ-ట్రాక్టర్‌)ను హైదరాబాద్‌కు చెందిన సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ అభివృద్ధి చేసింది. 3-4 నెలల్లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయనుంది. 20 హార్స్‌పవర్‌ కలిగిన  ట్రాక్టర్‌కు ఇది సమానమని, మామూలు ట్రాక్టర్‌ చేసే పనులన్నీ చేస్తుందని సెలిస్టియల్‌ ఈ-మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ దురైరాజన్‌ తెలిపారు. ధర దాదాపు రూ.5 లక్షలు ఉంటుంది.


ఒకసారి చార్జీ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం 20 కిలోమీటర్లు. 4-6 గంటల్లో బ్యాటరీ ఛార్జీ కాగలదని, ఒకసారి ఛార్జీ చేస్తే 4-5 గంటలు పనిచేస్తుందని దురైరాజన్‌ తెలిపారు. బ్యాటరీ సామర్థ్యం 150 ఏహెచ్‌. పుల్లింగ్‌ సామర్థ్యం 1.2 టన్నులు. నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ ఉందని, వచ్చే మూడేళ్లలో 8,000 ట్రాక్టర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏడాది కాలంలో 1,200 ట్రాక్టర్లను విక్రయించగలమని కంపెనీ భావిస్తోంది.  డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన సాధారణ ట్రాక్టర్‌ ఒక గంట పని చేయడానికి (రన్నింగ్‌ కాస్ట్‌) దాదాపు రూ.150 ఖర్చవుతుంది. సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ ట్రాక్టర్‌కు ఇది దాదాపు రూ.20-35 ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇంజినీరింగ్‌ డిజైన్‌, అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీ టెక్నాలజీ, కాస్టింగ్‌, ఫ్యాబ్రికేషన్‌, ట్రాక్టర్‌ తయారీ, మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న నలుగురు భాగస్వాములు కలిసి ఈ-ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. 


సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్రాక్టర్‌ అభివృద్ధి

ఏడాదిలో డైవర్‌ లేకుండా నడిచే (సెల్ప్‌ డ్రైవింగ్‌ ) ఈ-ట్రాక్టర్‌ను సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ అభివృద్ధి చేయనుంది. జియో ఫెన్సింగ్‌, అల్గరీథమిక్‌  గ్రాఫింగ్‌ను వినియోగించి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ను అభివృద్ధి చేయనన్నామని.. ఇందుకు అవసరమైన అటానమస్‌ టెక్నాలజీ కోసం సింగపూర్‌కు చెందిన విశ్వవిద్యాలయంతో చేతులు కలిపామని దురైరాజన్‌ తెలిపారు. ఈ ట్రాక్టర్‌ ధర రూ.10 లక్షలు ఉండే వీలుంది. ఈ-ట్రాక్టర్‌ ప్లాట్‌ఫారమ్‌పై లైట్‌ కమర్షియల్‌ ట్రక్‌, బస్‌ మొదలైన వాటిని  కంపెనీ అభివృద్ధి చేయనుంది. లైట్‌ కమర్షియల్‌ వాహనం ప్రోటోటైప్‌ అభివృద్ధిని ఇప్పటికే ప్రారంభించింది. ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ ద్వారా ఆరు నెలల క్రితం రూ.కోటి సమీకరించిన కంపెనీ వచ్చే 6 నెలల్లో ప్రైవేట్‌ ఈక్విటీ ద్వారా 60 లక్షల డాలర్లు (దాదాపు రూ.50 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది.

Updated Date - 2020-03-12T06:46:44+05:30 IST