Abn logo
Sep 26 2021 @ 23:41PM

కార్మికులకు ఈ–శ్రమ్‌

పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతే లక్ష్యం

  జిల్లాలో 12 లక్షల మందికి ప్రయోజనం

ఏలూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కష్టజీవుల వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ– శ్రమ్‌ పోర్టల్‌ను తెచ్చింది. కరోనా కష్ట కాలంలో కార్మికులకు జరిగిన నష్టం నేపథ్యంలో ఈ పోర్టల్‌ అనివార్యంగా మారింది. కొవిడ్‌ విపత్తు కాలంలో కష్టజీవుల సామాజిక భద్రత విషయంలో సుప్రీం కోర్టు సీరియస్‌ కావడం, తక్షణం వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించడంతో కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌ను ముందుకు తెచ్చింది. ఈ పోర్టల్‌ జిల్లాలోని 12 లక్షల పైచిలుకు ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఆగస్టు 28 నుంచి పోర్టల్‌లో కష్టజీవుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 40 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని అఽధికారులు చెబుతున్నారు.    

  వీరే అర్హులు 

అసంఘటిత రంగంలో పని చేస్తున్న నిర్మాణ రంగ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్లాంటేషన్‌ కూలీలు, ఇసుక రీచ్‌లలో పని చేసే వలస కూలీలు, స్టీల్‌ వెండార్స్‌, అంగన్వాడీ కార్యకర్తలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, వీధి పాల వ్యాపారులు, కొరియర్‌ బాయ్స్‌, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, ఇతర చేతి వృత్తుల వారు అర్హులుగా ఉంటారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సభ్యత్వం ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పోర్టల్‌లో పేర్ల నమోదుకు అనర్హులు. వయసు 16 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న కార్మికులకు మాత్రమే ఈ–శ్రమ్‌ వర్తిస్తుంది.

    నమోదు ఇలా.. 

అర్హులైన కార్మికులు ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌, సెల్‌ నెంబరు తీసుకుని వెళ్లి మీ సేవా కేంద్రంలోగానీ, సీఎస్‌సీ సెంటర్‌లోగానీ, పోస్టాఫీస్‌లోగానీ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఈ– శ్రమ్‌ పోర్టల్‌లో పేరు నమోదు ఉచితంగా జరుగుతుంది. మీ సేవా కేంద్రాలు మూత పడడం, పోస్టాఫీసులు స్వల్పంగా ఉండడం, కార్మికుల్లో తగిన అవగాహన లేకపోవడం, కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఈ– శ్రమ్‌ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.


ప్రయోజనాలు.. 

జూ భవిష్యత్తులో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అన్నింటికీ ఈ డేటా బేసే ఆధారం కాబోతోంది. ఈ డేటా బేస్‌లో నమోదైన వారికే సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంటుంది.

 కార్మికుల పేర్లతో బ్యాంకు ఖాతా అనుసంధానమవడంతో ప్రయోజనం పొందే నగదు నేరుగా వారి ఖాతాలకే చేరుతుంది. 

 ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చెల్లించే ప్రీమియం ఒక ఏడాది చెల్లించే పనిలేదు. అయినా ప్రయోజనం వర్తిస్తుంది. 

 ఈ పోర్టల్‌ నమోదు చేసుకున్న కార్మికులకు సామాజిక భద్రత, ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. 

 అసంఘటితరంగ కార్మికులకు ఉపాఽధి, నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఈ డేటా బేసే కీలకం కానుంది.

 వలస కార్మికుల జాడ, వారికి ఉపాఽధి కల్పన ఈ–శ్రమ్‌ పోర్టల్‌ ఎంతో ఉపయోగపడుతుంది.