ఈ పంట.. అంతంతే

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. రాయితీలు పొందాలన్నా.. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు కావాలన్నా.. దిగుబడులు అమ్ముకోవాలన్నా.. ఈ-పంటలో నమోదై ఉండాలి. ఇంతటి కీలకమైన ఈ అంశంలో ఉమ్మడి జిల్లా రైతులు వెనుకబడి ఉన్నారు

ఈ పంట.. అంతంతే
పొలంలో రైతుల వివరాలను ఈ పంటలో నమోదు చేస్తున్న సిబ్బంది

నమోదుకు నేటితో గడువు పూర్తి

పూర్తి స్థాయిలో నమోదుకాని సాగు వివరాలు

వివిధ ప్రయోజనాలకు దూరం కానున్న అన్నదాతలు

సీసీఆర్‌సీ కార్డు మెలికతో నమోదుకు కౌలు రైతులు దూరం

బాపట్ల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. రాయితీలు పొందాలన్నా.. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు కావాలన్నా.. దిగుబడులు అమ్ముకోవాలన్నా.. ఈ-పంటలో నమోదై ఉండాలి. ఇంతటి కీలకమైన ఈ అంశంలో ఉమ్మడి జిల్లా రైతులు వెనుకబడి ఉన్నారు. వందకు వంద శాతం ఈ పాటికి నమోదై ఉండాలి. ఆ దిశగా అధికారులు, సిబ్బంది అన్నదాతల్లో అవగాహన కల్పించాలి. అయితే మాకెందుకులే అన్న ధోరణిలో ఉద్యోగులు ఉండటం.. అవగాహన లేక అన్నదాతలు ఈ - పంటలో వివరాలు నమోదు కాలేదు. ఈ - పంటలో నమోదు కాని వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నా అటు అధికారులు కాని ఇటు రైతులు కాని దీని గురించి ఆలోచించడంలేదు. ఈ- పంట నమోదుకు ప్రభుత్వం  ఇచ్చిన  గడువు శుక్రవారంతో ముగియబోతోంది. యంత్రాంగం నిర్లక్ష్యానికి రైతుల అవగాహనలేమి తోడవడంతో పెద్దసంఖ్యలో రైతులు ఈ- పంటకు దూరంగా ఉన్నారని సమాచారం. రైతుల అవగాహన లేమితో పాటు వెబ్‌ల్యాండ్‌ నిబంధనలు, సాంకేతిక పరమైన అంశాల కారణంగా అనేక మంది రైతులు ఈ-పంటలో నమోదు చేసుకోలేకపోయారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గణనీయ సంఖ్యలో అన్నదాతలకు వివిధ ప్రయోజనాలు అందకుండాపోయే ప్రమాదం ఉంది. 

 జిల్లాలో నమోదు ఇలా...

జిల్లాలో సాధారణ విస్తీర్ణం దాదాపు 3,80,000 ఎకరాలు. ఇప్పటి వరకు 2,90,000 ఎకరాలు సాగు అయినట్లు వ్యవసాయశాఖ అంచనాలు. ఇందులో ఈ పంట యాప్‌లో 2,50,000 ఎకరాలు మాత్రమే నమోదైంది.  అంటే సాగులో ఉన్న 40 వేల ఎకరాలకు చెందిన రైతులతో పాటు అసలు భూ విస్తీర్ణంలోని సుమారు లక్ష ఎకరాలకు చెందిన యజమానులు ఈ - పంటలో నమోదు కాలేదు. మొత్తం మీద జిల్లాలో ఎంతలేదన్నా దాదాపు 25 వేల మందికి పైగా  రైతుల వివరాలు ఈ-పంటలో నమోదు కాలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో వీరందరూ ప్రభుత్వం అందించే వివిధ పథకాలను కోల్పోనున్నారు.

ధాన్యం రైతులపై అధిక ప్రభావం...

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికశాతం రైతులు వరి సాగుపైనే ఆధారపడతారు. మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి. మిగతా పంటలతో పోలిస్తే ధాన్యం ఽధర మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ- పంటలో నమోదు చేసుకోని రైతులకు మద్దతు ధర అందదు. అంటే వీరంతా తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అగత్యం వచ్చే అవకాశాలున్నాయి. మద్దతు ధరకు అమ్ముకుంటేనే పెట్టుబడులు రాక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు ఇంకా తక్కువకు అమ్ముకుంటే తీవ్రనష్టం చవిచూడాల్సిందే. 

ప్రతిబంధకంగా సాంకేతిక సమస్యలు...

రెవెన్యూ, వ్యవసాయశాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో వెబ్‌ల్యాండ్‌ సమస్యతో వేలమంది రైతులు ఈ-పంటకు దూరంగా ఉన్నారు. ఈ-పంట యాప్‌ సర్వర్‌ నెమ్మదిగా ఉంటూ అటు యంత్రాంగం ఇటు రైతుల సహనానికి పరీక్షగా ఉంటోంది. ఒక్కోసారి రోజుల తరబడి కూడా సర్వర్‌ మొరాయించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో గ్రామాలలో ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం సిబ్బందికి కష్టతరమవుతోంది. ఈక్రాప్‌ నమోదుకు రైతు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. గ్రామాల్లోకి అధికారులు వెళ్లిన సమయానికి అన్నదాతలు ఉండకపోవడం కూడా జాప్యానికి కారణంగా ఉంటోంది. అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడాన్ని రైతులు తప్పబడుతున్నారు. సిబ్బంది సరిపడనంత లేకపోవడం వల్ల కూడా నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ప్రతిబంధకంగా నిలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి సమాచారం అధికారుల వద్ద లేకపోవడం వల్ల కూడా ఈ పంట నమోదుకు అడ్డంకిగా ఉంటోంది. ఇంకో వైపు ఈ పంట ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండడం కూడా రైతులకు శాపంగా మారుతోంది.

కౌలు రైతుల పరిస్థితి ఘోరం..

ఖరీఫ్‌ నుంచి సీసీఆర్‌సీ కార్డు ఉన్న కౌలు రైతులకే ఈ పంటలో నమోదు అవకాశం అని ప్రభుత్వం ప్రకటించడంతో వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. ఉపశమన చర్యలుగా భూ యజమాని ఒప్పుకుంటే కల్టివేటర్‌గా ఈ పంటలో నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ భూ యజమాని అలా అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో పాలకుల మాటలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నమోదుకు అవకాశం లేని కౌలు రైతులు, యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈ పంటలో నమోదుకు నోచుకోలేకపోతున్నారు. 

Updated Date - 2022-09-29T05:30:00+05:30 IST