ఈ-ఆఫీస్‌

ABN , First Publish Date - 2020-07-13T10:47:05+05:30 IST

ఇక మండలాఫీసుల్లో ఈ-ఆఫీస్‌ ద్వారా పనులు జరగనున్నాయి. సోమవారం(నేటి) నుంచి ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ ద్వారా కార్యక్రమాలన్నీ కొనసాగించాలని ..

ఈ-ఆఫీస్‌

నేటి నుంచి మండలస్థాయిలో అమలు

కాగితాలు వాడరు.. ఇక అంతా కంప్యూటర్‌లోనే

అమలు కానున్న కొత్త విధానం


తాండూరు రూరల్‌ : ఇక మండలాఫీసుల్లో ఈ-ఆఫీస్‌ ద్వారా పనులు జరగనున్నాయి. సోమవారం(నేటి) నుంచి ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ ద్వారా కార్యక్రమాలన్నీ కొనసాగించాలని నిర్ణయించింది. ఇక కాగితాలుండవు... ఇంకా అంతా కంప్యూటర్‌లోనే కొనసాగుతుంది. నోట్‌ఫైల్స్‌, ఉత్తర్వులు, ప్రొసీడింగ్‌లు ఇలా అంతా ఈ-ఆఫీస్‌ ద్వారా చేపట్టనున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో డివిజన్‌స్థాయిలో ఆర్డీవో, సబ్‌ ట్రెజరీ, ఏడీఏ వంటి కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఈ-ఆఫీసు నిర్ణయం తీసుకుంది. నిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న శాఖలు సైతం ఈ-ఆఫీసును అమలు చేయనున్నారు. మండల స్థాయిలో ఈ-ఆఫీసు అమలుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నోడల్‌ అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లను కూడా నియమించారు. ఈ-ఆఫీసు ద్వారా అధికారులు కంప్యూటర్‌ స్ర్కీన్‌పై ఫైల్‌ చూసుకుంటూ ఇంటర్‌-కం-ఫోన్‌లో మాట్లాడి సందేహాలు తీర్చుకోవచ్చు.


ఈ-ఆఫీస్‌ పని విధానం ఇలా..

ఈ-ఆఫీస్‌ విధానంలో మొదట  పిటిషన్లు ఇన్‌వర్డ్‌ సెక్షన్‌కు వస్తాయి. అక్కడ రికార్డు అసిస్టెంట్‌ వాటిని స్కానింగ్‌  చేసి పిటిషనర్‌కు నెంబర్‌ ఇచ్చి సంబంధిత సర్క్యూలేషన్‌ ఆఫీస్‌కు ఆన్‌లైన్‌లో పంపుతారు. సర్క్యూలేషన్‌ ఆఫీసర్‌ దానిని సంబంధిత సెక్షన్‌ ఆఫీస్‌కు పంపుతారు. సెక్షన్‌ ఆఫీసర్‌ ఆ ఫైల్‌లోని అంశాన్ని చూసి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. సెక్షన్‌ అధికారి నోట్‌ఫైల్‌ రాసి పైఅధికారికి పంపుతారు. 


ప్రతి ఉద్యోగికి ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్‌

ఈ-ఆఫీస్‌ విధానంలో ప్రతి ఉద్యోగికి ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. సదరు ఉద్యోగి, అధికారి మాస్టర్‌ డాటాకు లింకై ఉంటాయి. దీంతో ఎక్కడ ఆ ఫైల్‌ను దారి తప్పించడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. అలాగే సదరు ఉద్యోగికి నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు ఇంటి వద్ద నుంచైనా పని చేయవచ్చు. ఫైళ్లను ఎక్కడి నుంచైనా తనిఖీ చేయవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో ఫైళ్ల స్థితి గతులను పై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చు. 


జిల్లాలో కూడా ఇదే విధానం..

జిల్లాలో వచ్చిన పిటిషన్‌ కూడా స్కాన్‌ చేసిన తర్వాత తహసీల్దార్‌ నుంచి ఆర్డీవో, అడిషనల్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు వెళుతుంది. వివిధ శాఖలకు చెందిన పిటిషన్లు ఆయా శాఖల అధికారుల ద్వారా కలెక్టర్‌ వరకు చేరుతాయి. కొన్ని నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికే వస్తాయి. అక్కడ ఇన్‌వార్డ్‌ సెక్షన్‌లో స్కానింగ్‌ చేసి సంబంధిత ఆఫీస్‌ సూపరింటెండెంట్‌కు ఫైల్‌ను పంపిస్తారు. సూపరింటెండెంట్‌ సెక్షన్‌ క్లర్క్‌కు పంపించి ఫైల్‌ను పుటప్‌ చేయిస్తారు. ఆ ఫైల్‌ సెక్షన్ల క్లర్క్‌ నుంచి సూపరింటెండెంట్‌కు అక్కడి నుంచి అడిషనల్‌ కలెక్టర్‌కు, ఆపై కలెక్టర్‌కు చేరుతుంది. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

Updated Date - 2020-07-13T10:47:05+05:30 IST