మళ్లీ రేషన్‌ కార్డుదారులకు ఈ-కేవైసీ నమోదు

ABN , First Publish Date - 2020-05-29T11:15:28+05:30 IST

గత ఏడాది రేషన్‌ కార్డుదారులను రెండు నెలలపాటు ముప్పు తిప్పలు పెట్టిన ఈ-కేవైసీ నమోదు ఈ ఏడాది మళ్ళీ చేపట్టారు.

మళ్లీ రేషన్‌ కార్డుదారులకు ఈ-కేవైసీ నమోదు

కలికిరి, మే 28: గత ఏడాది రేషన్‌ కార్డుదారులను రెండు నెలలపాటు ముప్పు తిప్పలు పెట్టిన ఈ-కేవైసీ నమోదు ఈ ఏడాది మళ్ళీ చేపట్టారు. గతంలో కేవలం రేషన్‌ కార్డులో నమోదైన కుటుంబ యజమానికి మాత్రమే ఈ-కేవైసీ నమోదు చేయగా ప్రస్తుతం కుటుంబంలోని సభ్యులందరూ వేలి ముద్రలు వేసి నమోదు చేసుకోవలసి వుంది. గతంలో ఈ-కేవైసీ నమోదుకు ప్రజా సాధికార సర్వేను ముందుగా పూర్తి చేసుకోవలసి వుండటంతో రేషన్‌ కార్డుదారులకు చుక్కలు చూపించారు. అయితే ప్రస్తుతం పీఎ్‌సఎస్‌ సర్వేతో సంబంధం లేకుండా ఈ కేవైసీ నమోదు చేస్తున్నారు. దీంతో గతంలో పడ్డ కష్టాలు లేకుండా ఈ-కేవైసీ నమోదు సాఫీగా సాగిపోతోందని చెబుతున్నారు.


అంతేగాకుండా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు ఈ కేవైసీ నమోదు కోసం రేషన్‌ కార్డుదారుల ఇళ్ళ వద్దకే వెళ్తుండటం కార్డుదారులకు ఊరట కలిగిస్తోందని కూడా చెబుతున్నారు.  రెండ్రోజులుగా జిల్లాలో జరుగుతున్న ఈ-కేవైసీ నమోదులో గురువారం నాటికి కలికిరి మండలం అగ్రస్థానం దక్కించుకుంది. 77 శాతం నమోదు పూర్తి చేసి మొదటి స్థానంలో వుండగా పెద్దపంజాణి, తవణంపల్లె, గుర్రంకొండ మండలాలు తరువాత స్థానాల్లో వున్నాయి. ఇక మరీ అధ్వానంగా 5 శాతంతో ఐరాల, ఆరు శాతంతో ఆర్సీపురం, ఏడు శాతంతో కుప్పం, 14 శాతంతో తిరుపతి అర్బన్‌, 16 శాతం నమోదుతో పాకాల మండలాలున్నాయి.  కలికిరి మండలంలో ఈ కేవైసీ నమోదును 77 శాతం పూర్తి చేసినట్లు తహసీల్దారు సుబ్బయ్య తెలిపారు. 


Updated Date - 2020-05-29T11:15:28+05:30 IST