ఈ-పంటకు తంట

ABN , First Publish Date - 2022-09-30T05:20:44+05:30 IST

బందరు మండలంలో పదివేల మంది రైతులు 25 వేల ఎకరాల్లో ప్రతిఏటా వరి సాగు చేస్తున్నారు.

ఈ-పంటకు తంట

అసైన్డ్‌ భూమికి ఈ-క్రాప్‌ చేయవద్దని వ్యవసాయశాఖ అధికారుల అదేశాలు

పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద ంటున్న వ్యవసాయ, రెవెన్యూ అధికారులు

బందరు మినహా అన్ని మండలాల్లో ఈ-క్రాప్‌ నమోదు

ఇక్కడి రైతుల భూములపై బడాబాబుల కన్ను

వారి ఒత్తిడితోనే ఈ-క్రాప్‌ నిలిపివేత

పంటలను ఎలా విక్రయించుకోవాలని రైతుల  కలవరం

 రైతులతో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఆటాడుకుంటున్నారు. ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదుచేయకుండా దోబూచులాడుతున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలంలోని రైతులు సాగుచేసిన పంటలు అధిక శాతం అసైన్డ్‌ భూముల్లోనే ఉన్నాయని, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వులతో ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేయడం కుదరదని అధికారులు మెలిక పెడుతున్నారు. ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు కాకుంటే తాము పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా నగదు కూడా చేతికి అందదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈక్రాప్‌ నమోదు చేయకపోవడం వెనుక బడాబాబుల హస్తం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. 

 ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు మండలంలో పదివేల మంది రైతులు 25 వేల ఎకరాల్లో ప్రతిఏటా వరి సాగు చేస్తున్నారు. తాతలనాటి నుంచి వారసత్వంగా వచ్చిన, లేదా కొనుగోలు చేసిన భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేస్తేనే ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం నిబంధన పెట్టింది. రైతు భరోసాకు, ఈ-క్రాప్‌కు లింకు పెట్టింది. 

అన్ని మండలాల్లో వీఆర్వోల రఽధవీకరణ

సముద్ర తీరం వెంబడి ఉన్న మచిలీపట్నం నియోజకవర్గంలోని మచిలీపట్నం మండలం, అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో, పెడన నియోజకవర్గంలోని పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అధికశాతం అసైన్డ్‌ భూములున్నాయి. ఏళ్ల తరబడి రైతులు వాటిని సాగు చేస్తున్నారు. వీటిలో రైతులు సాగుచేసిన పంట వివరాలను ఆర్‌బీకేలలో పనిచేస్తున్న వ్యవసాయశాఖ అసిస్టెంట్లు నమోదు చేసుకుని వస్తారు. అసైన్డ్‌ భూముల్లో రైతులు పంటలు సాగు చేసినట్లుగా ధ్రువీకరిస్తూ ఆయా రెవెన్యూ గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్వోలు ఆన్‌లైన్‌లో తమ వేలిముద్రలు వేయాల్సి ఉంది. బందరు మండలంలో తప్ప మిగిలిన అన్ని మండలాల్లో ఈ ఏడాది పంట వివరాలు ఈ-క్రాప్‌ నమోదు చేసే సమయంలో అసైన్డ్‌ భూములు రైతులు సాగు చేసినట్లుగా వీఆర్వోలు వేలిముద్రలు వేశారు. 

 బందరు మండలంలో నిలిపివేత

బందరు మండలంలో వ్యవసాయశాఖ అధికారి అసైన్డ్‌ భూములను సాగు చేసిన రైతుల  పంటలు ఈ-క్రాప్‌లో నమోదు చేసే సమయంలో వీఆర్వోలు వేలిముద్రలు వేయవద్దని చెప్పారు. తాము సాగుచేసిన పంటల వివరాలు ఆర్‌బీకేలలో పనిచేసే వ్యవసాయశాఖ అసిస్టెంట్లు నమోదు చేసుకున్నప్పటికీ, వాటిని ధ్రువీకరిస్తూ వీఆర్వోలతో వేలిముద్రలు వేయడం లేదని తెలుసుకుని రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

  రెవెన్యూ కమిషనర్‌ ఆదేశాలతోనే..

 రెవెన్యూ విభాగం కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వీఆర్వోలకు అలా చెప్పామని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. అసైన్డ్‌ భూముల్లో వరిపంట సాగుచేస్తే వీఆర్వోలు వేలిముద్రలు వేయాలని తహసీల్దార్‌ చెప్పినా మూడు రోజులపాటు సంబంధిత సర్వర్‌ పనిచేయదనే మెలిక పెట్టారు. దీంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. 

  రైతులను ఇబ్బందుల పాలు చేస్తారా 

 బందర మండంలో 17,937 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరిసాగు జరిగింది. ఈ వివరాలను ఆర్‌బీకేలలో పనిచేస్తున్న వ్యవసాయశాఖ అసిస్టెంట్లు సేకరించారు. పెదపట్నం, పెదయాదర గ్రామాల్లో 400 ఎకరాల్లో అసైన్డ్‌ భూములకు   ఈక్రాప్‌ నమోదు చేశామని మండల వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. అసైన్డ్‌ భూములు అధికంగా ఉండటంతో వీఆర్వోలతో ధ్రువీకరించకుండా నిలిపివేశారు.

 భూములపై బడాబాబుల కన్ను

 ఇటీవల కాలంలో బందరు మండలంలో అసైన్డ్‌ భూములను స్థానిక ప్రజాప్రతినిధులకు బినామీలుగా ఉన్న బడాబాబులు కొనుగోలు చేయడం అధికమైంది. బందరు మండలంలోని అసైన్డ్‌భూములపై కన్నేసిన కొందరు పెద్దలు, తమ అధికారాన్ని వినియోగించి రైతులను ఇక్కట్లపాలు చేసేందుకు ఈ తరహా వ్యూహం అనుసరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా నిలిపివేస్తే, రైతులు వారంతట వారే కొద్ది కాలానికైనా భూములను విక్రయించేలా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారని రైతులు చెప్పుకుంటున్నారు. 

  సమస్యను పరిష్కరిస్తాం 

 వ్యవసాయశాఖ అధికారి సూచన మేరకే వీఆర్వోలు వేలిముద్రలు వేయలేదు. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరిస్తాం. 

- డి సునీల్‌బాబు, తహసీల్దార్‌, బందరు మండలం  


 

Updated Date - 2022-09-30T05:20:44+05:30 IST