ఈ క్రాప్‌ గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-08-20T06:57:55+05:30 IST

రైతులకు ధాన్యం సొమ్ములు జమకావాలంటే పంట భూములు ఈ-క్రాప్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ క్రమంలో ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ చేసిన అక్రమాల వల్ల జిల్లాలోని రైతులు ధాన్యం సొమ్ములు జమకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్రాప్‌ గోల్‌మాల్‌

వ్యవసాయేతర భూములు వరి భూములుగా నమోదు

వాటిలో ధాన్యం కొన్నట్టు స్లిప్పులు.. రూ.2.70 కోట్లు స్వాహా

అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నిర్వాకం.. ఆనక విచారించి సస్పెన్షన్‌

కొనసాగుతున్న విచారణ.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఈ తప్పిదాలతో నిలిచిన ధాన్యం సొమ్ముల చెల్లింపు ప్రక్రియ

సుమారు రూ.80 కోట్ల బకాయిలు.. రైతుల గగ్గోలు


(రావులపాలెం రూరల్‌)

రైతులకు ధాన్యం సొమ్ములు జమకావాలంటే పంట భూములు ఈ-క్రాప్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ క్రమంలో ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ చేసిన అక్రమాల వల్ల జిల్లాలోని రైతులు ధాన్యం సొమ్ములు జమకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యవసాయేతర భూములు కొబ్బరి, అరటి తదితర ఉద్యానవన పంటలు సాగుచేసే పంట పొలాలను ఈ-క్రాప్‌లో వరి పంటగా నమోదుచేసి ఏకంగా రూ.2,70,60,672 సొమ్ముల గోల్‌మాల్‌కు కారకుడయ్యా డు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఇలా ఉంది. రావులపాలెం మండలం దేవరపల్లి-2 సచివాలయంలో పనిచేస్తున్న ఎస్‌కే ఇర్సాద్‌ వలీ 2022 రబీ సమయంలో ఈ-క్రాప్‌ నమోదు చేపట్టారు. ఆ సమయంలో వరి పంట సాగు భూములతోపాటు వ్యవసాయేతర భూములు కూడా ఈ-క్రాప్‌ నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. 37 మంది రైతుల పేరిట 31 ఎకరాల వరిపొలం మాత్రమే ఉండగా ఏకంగా 334 ఎకరాల వరి సాగుచేసే భూమి ఉన్నట్టు ఈ- క్రాప్‌లో తప్పుగా నమోదు చేశాడు. దీంతో ధాన్యం తూచినట్టుగా చూపించి 37 మంది రైతులకు రూ.2,70,60,672 సొమ్ములు చెల్లింపు అయ్యేవిధంగా స్లిప్పులు కూడా జారీచేశాడు. ఇందులో కొంతమంది అసలు భూమిలేని రైతులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు రూ.1,49,52,744 ఆయా రైతుల ఖాతాల్లో జమైంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తప్పిదాన్ని గుర్తించి కారకుడైన అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇర్సాద్‌ వలీని సస్పెండ్‌ చేశారు. రైతుల ఖాతాలో జమ అయిన సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు మిగిలిన సొమ్ము ను జమకాకుండా నిలుపుదల చేశారు. కిందిస్థాయి ఉద్యోగి ఈ-క్రాప్‌ నమోదు లో అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయలు దారిమళ్లించేందుకు ప్రయత్నిస్తుంటే మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.


రూ.80 కోట్ల ధాన్యం సొమ్ములు ఎప్పుడిస్తారు..


జిల్లావ్యాప్తంగా ఇంకా రైతుల ఖాతాల్లోకి రూ.80 కోట్ల ధాన్యం సొమ్ములు జమకావాల్సి ఉంది. దేవరపల్లితోపాటు పలుచోట్ల జరిగిన ఈ-క్రాప్‌ నమోదు తప్పిదాల కారణంగా విచారణ పేరిట సొమ్ములు ఆలస్యమవుతున్నట్టు సమాచారం. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అక్రమాల వల్ల పరోక్షంగా రైతులు సొమ్ములు జమకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ అధికారినడిగినా ఈవారం లో జమవుతాయని రైతులకు చెబుతున్నారు. నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో సొమ్ములు మాత్రం జమకావడం లేదు. సచివాలయాలకు వె ళ్లి సిబ్బందిని అడిగినా ప్రయోజనం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. ధాన్యం సొమ్ముల కోసం ఎవరినడగాలో తెలియని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 


విచారణ జరుగుతోంది: జిల్లా వ్యవసాయాధికారిణి


రావులపాలెం మండలం దేవరపల్లిలో ఈ-క్రాప్‌ నమోదు సమయంలో జరిగిన తప్పిదాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని జిల్లా వ్యవసాయాధికారిణి వై ఆనందకుమారి చెప్పారు. ఇప్పటికే అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ ఇర్సాద్‌ వలీని సస్పెండ్‌ చేశామని, వ్యవసాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-08-20T06:57:55+05:30 IST