కౌలు రైతులకు.. శరాఘాతం!

ABN , First Publish Date - 2022-07-24T05:27:03+05:30 IST

గతంలో సీసీఆర్‌సీ(క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌)తో నిమిత్తం లేకుండా కౌలురైతులను కూడా ఈ క్రాప్‌లో నమోదు చేసేవారు.

కౌలు రైతులకు.. శరాఘాతం!



సీసీఆర్‌సీ కార్డు ఉంటేనే ఈ క్రాప్‌ నమోదు!

ఇప్పటికే అధికారులకు మౌఖికంగా ఆదేశాలు

ఆ దిశగానే రెవెన్యూ, వ్యవసాయశాఖ కసరత్తు

కౌలురైతుల నెత్తిన పిడుగు...! 

 

కౌలు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట కౌలు రైతు ఆత్మహత్య ఘటనలు వింటూనే ఉన్నాం. కౌలుకాడి మోయలేక వదిలేస్తున్న వారు కొందరైతే అప్పుల బాధ తాళలేక లోకాన్నే విడిచివెళ్లిపోతున్న వారు మరికొందరు. ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుపోగా అనూహ్యంగా ఇప్పటికే ఉన్న ఈ క్రాప్‌ నమోదునుంచి కూడా వారిని దూరం చేయనుందని సమాచారం. ఈ ఖరీఫ్‌ సీజన్‌నుంచి సీసీఆర్‌సీ(పంట హక్కు సాగు పత్రం) కార్డులు ఉన్న కౌలురైతులను మాత్రమే ఈ క్రాప్‌లో నమోదు చేయమని సంబంధిత శాఖ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

 

బాపట్ల, జూలై23(ఆంధ్రజ్యోతి): గతంలో సీసీఆర్‌సీ(క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌)తో నిమిత్తం లేకుండా కౌలురైతులను కూడా ఈ క్రాప్‌లో నమోదు చేసేవారు. దీంతో రైతుభరోసా లాంటి పథకం అందకపోయినా రాయితీ విత్తనాలు, ఎరువులు, బీమా పరిహారం లాంటివి అరకొరగానైనా అందుతూ వచ్చేవి. ఈ ఖరీఫ్‌ సీజన్‌నుంచి సీసీఆర్‌సీ కార్డులు ఉన్న కౌలురైతులను మాత్రమే ఈ క్రాప్‌లో నమోదు చేయాలంటూ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా సీసీఆర్‌సీ కార్డులులేని కౌలురైతులకు ఈసారి మొండిచెయ్యేనని తెలుస్తోంది.


గత ఖరీఫ్‌ సీజన్‌లో..

ఉమ్మడి గుంటూరులో గతేడాది దాదాపు 2.75 లక్షల మంది కౌలు రైతులు ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. బాపట్ల జిల్లాలో దాదాపు లక్షా పదివేల మంది రైతులు నమోదు చేసుకున్నారు. గతంలో వీరిలో దాదాపు 80శాతం మందికి సీసీఆర్‌సీ కార్డు లేకపోయినా ఈ క్రాప్‌లో నమోదయ్యారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం వీళ్లందరి ప్రయోజనాలకు గండిపడే అవకాశం ఉంది.


సీసీఆర్‌సీ కార్డుల లక్ష్యం చేరడం గగనమే...

ఏటా సీసీఆర్‌సీ కార్డుల మంజూరుకు ఘనమైన లక్ష్యాలు విధించుకోవడం ముగింపుకొచ్చేసరికి అందులో సగం కూడా చేరకపోవడం మామూలై పోయింది. ఈ ఏడాది 30,000 వరకు జిల్లాలో ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్దేశించుకుంది. ఇప్పటికీ ఇందులో సగం కూడా మంజూరు కాలేదు. అలాంటిది సీసీఆర్‌సీ కార్డులుంటేనే ఈ క్రాప్‌ నమోదుకు అర్హులనే నిబంధన పెట్టడం అంటే కౌలురైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.పల్నాడు జిల్లాలో 1,61 లక్షల మంది కౌలు రైతులు ఉండగా వారిలో 30,492మందికి కార్డులు ఇచ్చారు. 


  రాయితీలు అన్నింటికీ దూరం...

ఈ క్రాప్‌లో నమోదవడం వలన కౌలురైతులు మద్దతు ధర, ఎరువులు, విత్తనాల రాయితీలు, బీమా పరిహారం ఇలాంటి ప్రయోజనాలను స్వల్పంగానైనా పొందుతున్నారు. రైతు భరోసా, బ్యాంకు రుణాల లాంటి వాటికి దూరంగా ఉన్నప్పటికీ ఈ క్రాప్‌లో నమోదు వల్ల కొన్ని ఫలాలైనా అందడం వారికి ఊరటనిస్తోంది. తాజా నిర్ణయంతో వారికీ ఈ ఫలాలు అందడం ప్రశ్నార్థకమే.


ఆదేశాలు వచ్చాయి...!

ఇందుకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయశాఖకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ సన్నాయి నొక్కులు నొక్కుతుండడంతో ఆచరణలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. సీసీఆర్‌సీ ప్రామాణికంగా ఈక్రాప్‌ నమోదు చేపట్టినా కౌలు రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగబోదని యంత్రాంగం మాట దాట వేస్తోంది.  ప్రత్యేకంగా అలాంటి జాబితాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే ఆమోదం వస్తుందని ఒకసారి, భూ యజమానులకు అవగాహన కల్పించి అందరికీ సీసీఆర్‌సీ కార్డులు ఇప్పిస్తామని మరోసారి చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి అందరికీ సీసీఆర్‌సీ కార్డులు ఇవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. గతంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా అపోహలతో యజమానులు కౌలుదారులకు సీసీఆర్‌సీ కార్డులు ఇవ్వడానికి అంగీకారం తెలపలేదు. దీంతో భారీ సంఖ్యలో కౌలు రైతులు ప్రభుత్వం అందించే కొద్దిపాటి ప్రయోజనాలకు దూరం కానున్నారు.


ప్రభుత్వం చిన్నచూపు..

గత కొన్ని నెలలుగా కౌలు రైతుల కడగండ్ల గురంచి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశంమీద క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు అన్ని ప్రయోజనాలు అందిస్తున్నామని బీరాలు పలుకుతోంది. వారి వెతల మీద అన్ని పక్షాలు పోరాడుతున్న వేళ  ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలంటే సీసీఆర్‌సీ కార్డు ఉండాల్సిందేనన్న నిర్ణయం తీసుకోవడమంటే వారి పట్ల పాలక పక్షానికి ఉన్న చిన్నచూపునకు సూచికగా నిలుస్తోంది.

Updated Date - 2022-07-24T05:27:03+05:30 IST