ఆర్టీఐ పరిధిలో ఈ–కామర్స్

ABN , First Publish Date - 2021-07-06T06:33:48+05:30 IST

కొవిడ్ ఉపద్రవంలో వినియోగదారులకు ఈ- కామర్స్ ఎంతగానో ఉపకరించింది. వివిధ వస్తువుల ధరలను పోల్చిచూసుకోవడాన్ని సాధ్యం చేసింది....

ఆర్టీఐ పరిధిలో ఈ–కామర్స్

కొవిడ్ ఉపద్రవంలో వినియోగదారులకు ఈ- కామర్స్ ఎంతగానో ఉపకరించింది. వివిధ వస్తువుల ధరలను పోల్చిచూసుకోవడాన్ని సాధ్యం చేసింది. ఉదాహరణకు ఒక ప్రత్యేక బ్రాండ్ మొబైల్ ఫోన్ కోసం వినియోగదారు రెండు లేదా మూడు ఈ–పోర్టల్స్లో అన్వేషించి చౌక అయిన, మన్నికైన మొబైల్‌కు ఆర్డర్ ఇవ్వగలుగతాడు. చెప్పవచ్చిందేమిటంటే ఈ-పోర్టల్స్ అనేవి ఇక శాశ్వత వ్యాపార వేదికలుగా వర్ధిల్లనున్నాయి. అవి ఉండి తీరాలి కూడా. అయితే వాటితో ఉత్పన్నమవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవలిసి ఉంది.


గృహ సంబంధమైన సరుకులను దేశంలోనే ఉత్పత్తి చేయాలని, దిగుమతి అయిన సరుకుల కంటే దేశీయ సరుకులే అధికంగా అమ్ముడుపోవాలని భారత ప్రభుత్వం ప్రగాఢంగా ఆకాంక్షిస్తోంది. అందుకు ఆత్మనిర్భర్ ఆదర్శాన్ని ప్రధాని మోదీ నిర్దేశించారు. ఆదర్శాలు ఊతపదాల స్థాయి నుంచి ఆచరణలోకి రావాలి గదా. ఈ-పోర్టల్స్ తరచు విదేశీ సరుకులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ప్రకటిస్తున్నాయి. విదేశీ వస్తువులతో పాటు దేశీయ ఉత్పత్తులను సైతం ఈ–పోర్టల్స్ తప్పనిసరిగా ప్రదర్శించేలా ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రతిపాదించింది. నిర్దిష్ట సరుకులను ప్రమోట్ చేసే ఫ్లాష్ సేల్స్ (పరిమిత కాలంపాటు రాయితీలపై జరిగే అమ్మకాలు)ను నిషేధించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. 


ఈ తరహా విక్రయాలలో ఈ-పోర్టల్స్ తాము ఎంపిక చేసుకున్న ఉత్పత్తిదారులకే ప్రాధాన్యమిస్తాయి. దీనివల్ల ఇతర విక్రయదారులు నష్టపోతున్నారు. కనుక ఈ విక్రయాలను నిషేధించాలన్న ప్రతిపాదన స్వాగతించి తీరాలి. ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనాఉంది. రెండు నెలలలోగా గడువు తీరిపోతున్న సరుకులను, వాటి విషయాన్ని వినియోగదారులకు వెల్లడించకుండానే, విక్రయించడం ఈ-పోర్టల్స్‌కు పరిపాటిగా ఉంది. ఈ దృష్ట్యా గడువు ముగిసిన తేదీని ఈ-పోర్టల్స్ తప్పనిసరిగా ప్రదర్శించేలా నిబంధన విధించాల్సిన అవసరముంది. తత్ఫలితంగా వినియోగదారులు మెరుగైన అవగాహనతో సరుకులను ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకుంటారు.


ఈ–పోర్టల్స్ వ్యాపారం సక్రమంగా జరిగేందుకు ప్రభుత్వం మరింత ప్రగతి శీలంగా వ్యవహరించాల్సిన అవసరముంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఈ-పోర్టల్స్‌ను తీసుకునిరావాలి. ప్రస్తుత ఆర్టీఐ చట్టం ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తిస్తోంది. ఇక్కడ కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థల వ్యాపార ప్రయోజనాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటే ఎటువంటి సమాచారాన్ని వెల్లడించాల్సిన బాధ్యత ఆ సంస్థలకు ఉండదు. ఒక జలవిద్యుదుత్పాదన ప్రాజెక్టుకు సంబంధించిన భూగర్భ పరిశోధనల నివేదికలను సమకూర్చాలని ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ (జిఎస్‌ఐ)ని అభ్యర్థించాను. ఆ నివేదికలను నాకు అందుబాటులో ఉంచేందుకు జిఎస్‌ఐ తిరస్కరించింది. ఆ సమాచారాన్ని వెల్లడించడం వల్ల తమ వ్యాపార ప్రయోజనాలకు హాని జరుగుతుందని పేర్కొంది. సదరు నివేదికలను ప్రైవేట్ పౌరులకు అందుబాటులో ఉంచితే జల విద్యుదుత్పాదన కంపెనీలు తమకు కాకుండా ఆర్టీఐ పరిధిలోని ప్రైవేట్ పరిశోధనా సంస్థలకు కాంట్రాక్టులు ఇస్తాయని జిఎస్‌ఐ తెలిపింది.


‘ప్రజా సంక్షేమం’తో ముడివడి ఉన్న దృష్ట్యా ఈ-పోర్టల్స్ విషయంలో సదరు నిబంధనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ-పోర్టల్స్‌ను కూడా ప్రైవేట్ మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలతో సమానంగా పరిగణించి తీరాలి. ఉత్తరాఖండ్‌లో జలవిద్యుదుత్పాన ప్రాజెక్టులను నిర్మిస్తున్న ప్రైవేట్ కంపెనీలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తోంది. అదే విధంగా ఈ–పోర్టల్స్‌ను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అటువంటి వెసులుబాటుతో వినియోగదారులు విక్రయదారులను సరుకుల బాగోగుల విషయమై నిశితంగా ప్రశ్నించగలుగుతారు. ఉదాహరణకు మీ వద్ద నమోదయి ఉన్న ఆవనూనె విక్రయదారుల జాబితాను సమకూర్చి, మీరు వారికి ఏమేరకు లాభావకాశాలను ప్రతిపాదిస్తుందీ తెలపాలని ఈ–పోర్టల్‌ను వినియోగదారులు కోరవచ్చు. అటువంటి సమాచారం అందుబాటులో ఉండడం వల్ల వినియోగదారులు మెరుగైన అవగాహనతో ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలో నిర్ణయించుకుంటారు. ఇటువంటి నిబంధన ఈ–పోర్టల్స్‌కు నిరుత్సాహం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అయితే భారత్ సువిశాల మార్కెట్ కనుక వారు విధిగా అటువంటి నిబంధనను పాటించి తీరుతారు. 


ఒక ఈ–పోర్టల్ ఖాతాదారుల సంఖ్య గరిష్ఠంగా ఎంత ఉండాలో నిర్ణయించాలని కాంపిటీటీవ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను ప్రభుత్వం ఆదేశించాలి. మన దేశంలో ఈ–పోర్టల్స్ ఆధారంగా సరుకుల కొనుగోలు చేస్తున్నవారు పదికోట్ల మంది ఉన్నారనుకోండి. మొత్తం ఈ-ఖాతాదారులలో 33 శాతానికి మించి ఏ ఈ-పోర్టల్ కూడా తన జాబితాలో చేర్చుకోకూడదని సిసిఐ నిర్దేశించాలి. అంత కంటే అధికంగా ఖాతాదారులు ఉన్న ఈ -పోర్టల్‌ను నిర్బంధంగా చిన్నచిన్న స్వతంత్ర ఈ–పోర్టల్స్‌గా విడగొట్టితీరాలి. దీనివల్ల దేశీయ ఈ–పోర్టల్స్ అభివృద్ధికి అవకాశముంటుంది. మరో విషయం ఏమిటంటే ఈ–పోర్టల్స్ మధ్య పోటీ వల్ల వాటి వ్యాపార అక్రమాలు కూడా తగ్గుతాయి. కొన్ని వస్తువులకు మంచి ధర లభించే అవకాశం కూడా ఉంది. కొంత మంది సరఫరాదారులు ఏకకాలంలో తమ సరుకులను వివిధ ఈ–పోర్టల్స్ ద్వారా విక్రయించుకోలేక పోవచ్చు. అదే సమయంలో ఈ-పోర్టల్స్ మధ్య పోటీ వల్ల కొత్త విక్రయదారులకు ఈ–మార్కెట్ మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ–కామర్స్ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలు సరైనవే అయినప్పటికీ అవి సక్రమంగా అమలయ్యేందుకు ఈ-పోర్టల్స్‌ను ప్రభుత్వం తక్షణమే ఆర్టీఐ చట్టం పరిధి తీసుకురావాల్సిన అవసరముంది. పెద్ద ఈ-పోర్టల్స్‌ను విభజించి సమాన అవవకాశాలు కల్పించడం ద్వారా ఆత్మనిర్భర్ వాటిని ప్రమోట్ చేయాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-07-06T06:33:48+05:30 IST