హైదరాబాద్‌లో ‘ఈ-చేతక్‌’ ప్లాంట్‌?

ABN , First Publish Date - 2020-10-25T09:54:23+05:30 IST

ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌.. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చేతక్‌ కోసం ప్రత్యేకంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది...

హైదరాబాద్‌లో ‘ఈ-చేతక్‌’ ప్లాంట్‌?

  • తెలంగాణా సహా ఆయా రాష్ట్రాల ఈవీ పాలసీలను పరిశీలిస్తున్నాం
  • బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ 

ముంబై: ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌.. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చేతక్‌ కోసం ప్రత్యేకంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చేతక్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల  (ఈవీ) కోసం పూర్తి స్థాయి ప్లాంట్‌ను నెలకొల్పటం తో పాటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు చేర్చాలని చూస్తున్నట్లు బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌.. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్లాంట్‌ ఏర్పా టు కోసం హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు నగరాల ను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ ప్రభుత్వాల ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పాలసీలు ఎంతో ప్రోత్సాహకరం గా ఉండటంతో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఈ నగరాలను మదింపు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చేతక్‌ ‘ఈ స్కూటర్‌’ను చకాన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది.


ఆకర్షిస్తున్న ప్రోత్సాహకాలు 

ఎలక్ట్రిక్‌ వాహన తయారీ ప్లాంట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని సమకూర్చటంతో పాటు భారీగా ప్రోత్సాహకాలను ఆఫర్‌ చేస్తోందని, ఇదే సమయంలో ఈవీ కొనుగోలుదారులకు కూడా పన్ను మినహాయింపులు ఇస్తోందని రాజీవ్‌ పేర్కొన్నారు. మరోవైపు 2025నాటికి 80 శాతం కొత్త ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను పూర్తిగా ఈవీల్లోకి మార్చాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాగా కేంద్రం ప్రకటించిన ఫేమ్‌-2 ప్రోత్సా హకాలతో పాటు మూడేళ్ల పాటు ఇన్సెంటివ్‌ను ఢిల్లీ ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది. కర్నాటక కూడా 20 శాతం వరకు సబ్సిడీ ఇస్తామని ప్రతిపాదించింది.


మరిన్ని కొత్త ఈవీలు

ఈవీ పోర్టుఫోలియోను మరింతగా విస్తరించాలని బజాజ్‌ ఆటో భావిస్తోంది. ప్రస్తుతం చేతక్‌ మోడల్‌ను మాత్రమే కంపెనీ విక్రయిస్తోంది. రానున్న రోజుల్లో చేతక్‌ పోర్టుఫోలియోను విస్తరించటంతో పాటు కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకురావటం ద్వారా గట్టి పట్టును చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ప్రీమియం కేటీఎం, హస్క్‌వర్నా బ్రాండ్స్‌లో కూడా కొత్త మోడళ్లను తీసుకురావాలని యోచిస్తోంది.   ఈ ఏడాది జనవరిలో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌  విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.లక్ష. కరోనా కారణంగా చైనా నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో బుకింగ్స్‌ను నిలిపివేసింది. జూలై నుంచి మళ్లీ బుకింగ్స్‌ ప్రారభించింది. 

Updated Date - 2020-10-25T09:54:23+05:30 IST