మట్టికోటలో రఫాను జయించి..

ABN , First Publish Date - 2021-06-13T09:55:55+05:30 IST

సెర్బియా సూపర్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రవేశించాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ప్రతీసారి అడ్డంకిగా ఉండే రఫెల్‌ నడాల్‌ను చివరకు జయిస్తూ గతేడాది ఫైనల్‌ ఓటమికి బదులు...

మట్టికోటలో రఫాను జయించి..

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ 
  • సిట్సిపాస్‌తో అమీతుమీ నేడు 
  • పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు
  • జొకోవిచ్‌ X సిట్సిపాస్‌
  • (సా. 6.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో)


ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య పోరంటే.. ఇదిగో ఇలా ఉంటుందనే రీతిలో జొకోవిచ్‌, నడాల్‌ సెమీస్‌ పోరు జరిగింది. ఫ్యాన్స్‌ను నిరాశ పర్చకుండా రెండు కొదమ సింహాల్లా ఎర్ర మట్టి కోటలో  సై అంటూ చెలరేగారు. 4 గంటలా 11 నిమిషాలపాటు సాగిన ఈ సమరం వహ్వా అనేలా సాగింది. ‘క్లాష్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’గా పేర్కొన్న ఈ మ్యాచ్‌లో చివరకు పట్టు వదలని పోరాటంతో ఆకట్టుకున్న వరల్డ్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌దే పైచేయి అయ్యింది. రికార్డు స్థాయిలో 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ఆశించిన స్పెయిన్‌ బుల్‌కు ఈసారి నిరాశే మిగిలింది. 




  • 14 సెమీఫైనల్స్‌లో నడాల్‌కిదే తొలి ఓటమి
  • రొలాండ్‌ గారోస్‌లో ఇప్పటిదాకా నాదల్‌ ఆడిన 108 మ్యాచ్‌ల్లో 
  • అతనికిది మూడో పరాజయం.  ఇందులో రెండుసార్లు జొకోవిచ్‌  చేతిలోనే ఓడాడు.

పారిస్‌: సెర్బియా సూపర్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రవేశించాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ప్రతీసారి అడ్డంకిగా ఉండే రఫెల్‌ నడాల్‌ను చివరకు జయిస్తూ గతేడాది ఫైనల్‌ ఓటమికి బదులు తీర్చుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ జొకో 3-6, 6-3, 7-6 (7/4), 6-2తో నడాల్‌ను ఓడించాడు. దీంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నడాల్‌ను రెండుసార్లు ఓడించిన తొలి ఆటగాడిగా నొవాక్‌ నిలిచాడు. అంతకు ముందు 2015లో క్వార్టర్స్‌లో నడాల్‌పై జొకోవిచ్‌ గెలుపొందాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆరోసారి ఫైనల్‌ చేరిన నొవాక్‌.. గతంలో 2016లో ఇక్కడ విజేతగా నిలిచాడు. కాగా, రెండో టైటిల్‌ కోసం ఆదివారం జరిగే తుది పోరులో గ్రీకు వీరుడు సిట్సిపా్‌సతో జొకో తలపడతాడు. 


మూడో సెట్‌ గంటా 33 నిమిషాలు..

నడాల్‌ను ఎదుర్కొనేందుకు ఈసారి జొకోవిచ్‌ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాడు. సర్వ్‌ రిటర్న్‌ చేసే క్రమంలో బాగా వెనక్కి ఉండేలా ఆడడంతో పాటు నడాల్‌ బ్యాక్‌హ్యాండ్‌ను లక్ష్యంగా చేసుకొని అతను సర్వీస్‌ చేశాడు. ఇది మ్యాచ్‌లో జొకో బాగా ఉపయోగపడింది. సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ఆరేసి ఏస్‌లు సంధించగా.. జొకోవిచ్‌ 8 బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. నడాల్‌ 8 డబుల్‌ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్‌ ఓడిన జొకోవిచ్‌ తర్వాత వరుసగా మూడు సెట్లలో అంచనాలకు మించి రాణించాడు. సుదీర్ఘ ర్యాలీలు, నెట్‌ గేమ్‌లతో అలరించాడు. రెండో సెట్‌లో 22 విన్నర్లు కొట్టిన జొకో ఆ సెట్‌ను 6-3తో నెగ్గాడు. ఇక, మూడో సెట్‌ గంటా 33 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగింది. ఒకరి సర్వీ్‌సను మరొకరు బ్రేక్‌ చేసుకోవడంతో స్కోరు 5-5, 6-6గా వెళ్లింది. టైబ్రేక్‌లో 2-1తో జొకో ఆధిక్యంలో ఉన్నా నడాల్‌ వరుసగా రెండు పాయింట్లు సాధించాడు. అటు నొవాక్‌ వ్యాలీతో స్కోరు 3-3 కావడంతో పాటు చక్కటి ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ సెట్‌ గెలిచాడు. ఆఖరి సెట్‌లో మాత్రం నడాల్‌ తేలిపోయాడు. తొలుత 0-2తో వెనుకబడిన జొకో చెలరేగి వరుసగా ఆరు గేమ్‌లతో మ్యాచ్‌ను ముగించాడు.


కర్ఫ్యూలోనూ అనుమతి

రాత్రి 11 గంటల నుంచి పారి్‌సలో కర్ఫ్యూ ఉండడంతో అప్పటికి మ్యాచ్‌ జరుగుతున్నా  స్టేడియంలోని ప్రేక్షకులను బయటికి పంపుతున్నారు. కానీ ఈ సమయానికి నడాల్‌-జొకోవిచ్‌ మధ్య మూడో సెట్‌ అద్భుతంగా సాగి అప్పుడే ముగిసింది. అయితే, ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. దీంతో ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన నిర్వాహకులు..మ్యాచ్‌ పూర్తయ్యే వరకు ఎవరూ వెళ్లనవసరం లేదని మైక్‌లో ప్రకటించడంతో అంతా హర్షం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-06-13T09:55:55+05:30 IST