మేడారం జాతరలా కదలాలి

ABN , First Publish Date - 2021-10-29T05:22:53+05:30 IST

మేడారం జాతరలా కదలాలి

మేడారం జాతరలా కదలాలి
పాలకుర్తిలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

- విజయగర్జన సభ సక్సెస్‌ చేయాలి 

- సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

- పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి, అక్టోబరు 28 : వరంగల్‌లో వచ్చేనెల 15వ తేదీన జరుగనున్న విజయగర్జన సభకు ప్రతీ గ్రామం నుంచి మేడా రం జాతరలా కార్యకర్తలు తరలిరావాలని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులుగా భారీగా తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలో గురువారం పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశానికి విసృత్తస్థాయి సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా హాజ రై మంత్రి మాట్లాడారు.

గత శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ శ్రేణుల సమన్వయంతో విజయదుంధుబీ మోగించామన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మండల, జిల్లా పరిషత్‌, సహకార ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మీ, షాదీముభారక్‌ లాంటి పథకాలను ప్రవేశపెట్టి, దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అలాగే ముఖ్యమంత్రి దళితబంధు పఽథకం కూడా ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరినందునే పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఎదురులేని శక్తిగా ఎదిగిందన్నారు.

కష్టపడేవారికి భవిష్యత్‌లో పదవులు..

 కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు భవిష్యత్తులో పదవు లు లభిస్తాయని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పార్టీపై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎవరైనా విమర్శలు చేస్తే సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ముఖ్యమంత్రులుగా ఉన్న ఎన్టీరామారావు, చంద్రబాబు వద్ద కూడా తాను పని చేశానని, వారికంటే సీఎం కేసీఆర్‌ గొప్ప నాయకుడని కొనియాడారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అభివృద్ధి చేయలేకపోయానని గుర్తు చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ కనుసన్నల్లోనే జరగాలని సూచించారు. కార్యకర్తలకు ముల్లుగుచ్చుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ నాగిరెడ్డి, డీసీసీబీ వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాసరావు, యాకాంతరావు, గాంధీనాయక్‌, బిల్లా సుధీర్‌రెడ్డి, సిందే రామోజీ, తీగల దయాకర్‌, బస్వ మల్లేషం, సత్తెమ్మ, ముస్కు రాంబాబు, బొబ్బాల రమణారెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, మధుసూదన్‌, జ్యోతి తదితరులున్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుట్టపై రూ.15 లక్షలతో ఓ దాత చేపడుతున్న పనులు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్‌ వెంకటయ్య, ఎంపీపీ నాగిరెడ్డి, సర్పంచు యాకాంతరావు ఉన్నారు. అనంతరం మల్లంపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు గర్వందుల వీరస్వామి తల్లిదండ్రులు వెంకటయ్య-సోమలక్ష్మీ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో మంత్రి పరామర్శించారు. 

Updated Date - 2021-10-29T05:22:53+05:30 IST