డ్వామా పైస్థాయి అధికారుల బదిలీలపై సందిగ్ధం

ABN , First Publish Date - 2020-11-29T06:52:56+05:30 IST

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పనిచేస్తున్న పైస్థాయి (ఎం పీడీఓ, క్లస్టర్‌ ఏపీడీ) అధికారుల బదిలీల పై సందిగ్ధం నెలకొంది.

డ్వామా పైస్థాయి అధికారుల బదిలీలపై సందిగ్ధం

అక్టోబరు ఆఖరులోనే రాష్ట్ర శాఖకు జాబితా

నేటికీ స్పందించని వైనం

అయోమయంలో యంత్రాంగం

అనంతపురం వ్యవసాయం, నవంబ రు 28: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పనిచేస్తున్న పైస్థాయి (ఎం పీడీఓ, క్లస్టర్‌ ఏపీడీ) అధికారుల బదిలీల పై సందిగ్ధం నెలకొంది. డ్వామా పీడీ కార్యాలయంలో కొందరు ఎంపీడీఓ స్థాయి అధికారులు మూడేళ్లకుపైగా కొనసాగుతున్నారు. మరికొందరు ఐదు నుంచి పది సంవత్సరాలైనా అక్కడే తిష్ట వేశారు. పరిపాలన సౌలభ్యం కోసమంటూ కొన్నేళ్లుగా పీడీ కార్యాలయంలో ఉంటూ ప్రభుత్వ బదిలీ నిబంధనలను అతిక్రమిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ప్రోత్సాహం అందించినట్లు విమర్శలున్నాయి. పలువురు క్లస్టర్‌ ఏపీడీలను బదిలీ చేయాల్సి ఉంది. డ్వామా పీడీ పరిధిలో ఏపీఓ, ఇతర కింది స్థాయి సిబ్బందిని బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఎంపీడీఓ, ఏపీడీ స్థాయి అధికారుల బదిలీలు ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత నెలాఖరులోనే సదరు అధికారుల జాబితాను రాష్ట్ర శాఖకు ఇక్కడి యంత్రాంగం పంపింది. ఈనెల మొదటి వారంలో జిల్లాలో ఒకే చోట మూడేళ్లు పనిచేసిన ఏపీఓ, ఇతర స్థాయిల్లోని అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. ఇదే క్రమంలో డ్వామాలో మూడేళ్లకుపైగా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓ స్థాయి అధికారుల బదిలీలు ఉంటాయని అందరూ భావించారు. రాష్ట్రస్థాయి అధికారులకు జాబితా పంపించి 25 రోజులు కావస్తున్నా ఇప్పటిదాకా స్పందించకపోవటం గమనార్హం. కొన్నేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతున్న పైస్థాయి అధికారులను ఎందుకు బదిలీ చేయటం లేదన్న ప్రశ్న ఆ శాఖలో తలెత్తుతోంది. గతంలో రాష్ట్ర శాఖలో మేనేజ్‌ చేసుకుని, పాత స్థానాల్లోనే ఉండేలా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది కూడా అలానే చేస్తారా? ఫెవికాల్స్‌కు స్థాన చలనం కలిగించి, పారదర్శక పాలనకు నాంది పలుకుతారా.. అన్న దానిపై అయోమయం నెలకొంది. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.


ఉన్నతాధికారులకు జాబితా పంపించాం: వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ

డ్వామాలో పనిచేస్తున్న కొందరు ఎంపీడీఓ, ఏపీడీ స్థాయి అధికారుల బదిలీల అర్హ త జాబితాలో ఉన్న మాట వాస్తవమే. వారి జాబితాను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఇదివరకే పంపించాం. అక్కడి నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-11-29T06:52:56+05:30 IST