Jun 18 2021 @ 17:16PM

ప్రతి తండ్రికి కావాల్సింది కొడుకు కాదు.. కూతురే: డ్వేన్ జాన్సన్‌

రెజ్లింగ్‌ స్టార్‌గా.. ఆ తర్వాత హాలీవుడ్‌ నటుడిగా తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్న డ్వేన్‌ జాన్సన్‌.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌ వేదికగా ఓ వీడియోని షేర్‌ చేశారు. జూన్ 20, ఫాదర్స్‌డేని పురస్కరించుకుని డ్వేన్‌ జాన్సన్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. డ్వేన్‌ జాన్సన్‌కు ముగ్గురు ఆడపిల్లలు (మాజీ భార్యకు ఒకరు, ప్రస్తుత భార్యకు ఇద్దరు). ఈ ముగ్గురిపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ.. డ్వేన్‌ జాన్సన్‌ చేసిన ఈ పోస్ట్‌.. ఆడపిల్లల తండ్రులకు మరింత బూస్ట్‌నిచ్చేలా ఉందంటే నమ్మాలి మరి.


''ప్రతి తండ్రి తనకు కొడుకు కావాలని కోరుకుంటాడు. కానీ ప్రతి తండ్రికి ఓ కూతురు అవసరం. దేవుడికి ధన్యవాదాలు.. ఎందుకంటే మా ఇళ్లంతా అమ్మాయిలతో.. అలాగే ఈస్ట్రోజన్‌తో నిండిపోయింది. నాలాగే కష్టపడే నాతోటి తండ్రులందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.." అని డ్వేన్‌ జాన్సన్‌ తెలుపుతూ.. తన కుమార్తెలతో హాయిగా ఎంజాయ్‌ చేస్తున్న వీడియోని షేర్‌ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 5 మిలియన్‌ వ్యూస్‌ను పొంది.. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్‌డేని సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే.