ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-14T05:24:32+05:30 IST

చిన్నతిరుమలేశుని ఆలయంలో జరుగు తున్న దివ్య పవిత్రోత్సవాలు శనివారం విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి,

ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు
పవిత్రావరోహణలో అర్చకులు

 భారీగా కల్యాణాలు.. పోటెత్తిన భక్తులు

 దర్శనానికి మూడు గంటల సమయం

 ఒక్కరోజే రూ.29 లక్షల ఆదాయం

ద్వారకా తిరుమల, ఆగస్టు 13 : చిన్నతిరుమలేశుని ఆలయంలో జరుగు తున్న దివ్య పవిత్రోత్సవాలు శనివారం విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి, తెలియక దొర్లిన తప్పుల ప్రాయః చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు నాలుగు రోజులపాటు ఘనం గా జరిగాయి. శనివారం ఉదయం పవిత్రావరోహణ, శ్రీమహా పూర్ణాహుతి హోమం, శ్రీమహదాశీర్వచనాలను అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూలవిరాట్‌, అలివేలు మంగమ్మ, ఆండాళ్‌ అమ్మ వార్లు, ఉత్సవ మూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేదమం త్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీమహా పూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు.  పవిత్రోత్సవాల సందర్భంగా నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్యార్జిత కల్యాణాలు ఆదివారం నుంచి పునరుద్ధరిస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు.


వందకు పైగా కల్యాణాలు

శ్రావణ మాసం మూడో శనివారం కావడంతో  ఆలయానికి దాదాపు 20 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయవర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచే పాద యాత్రగా యాత్రికులు స్వామివారి క్షేత్రానికి విచ్చేసారు.  తెల్లవారు జాము నుంచే ఆలయానికి భక్తులరాక ప్రారంభమైంది. పలువురు యాత్రికులు కేశ ఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. అన్ని విభాగాలు యాత్రికులతో కిటకిటలాడాయి. శ్రీవారి సాధారణ దర్శనానికి 3గంటల పైబడి సమయం పట్టింది. మరోవైపు క్షేత్రంలో పలు జంటలు మాంగల్య బంధంతో ఒక్కటయ్యాయి. శ్రావణమాసంలో మంచి ముహూర్తం కావడంతో దాదాపు వంద పెళ్లిళ్లు వరకూ జరిగాయి. దీంతో ఆలయ పరిసరాలు పెళ్లి జనాలతో సందడి గా మారింది. ఆలయ అనివేటి మండపం, పాత కల్యాణ మండపంలో పలు వివాహాలు జరిగాయి. కొండపైన ఉన్న దేవస్దానం కల్యాణ మండపాలు, దిగువనున్న ప్రైవేటు కల్యాణ మండపాలలో జోరుగా పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లిళ్ల బాజా భజంత్రీలతో క్షేత్రం మారుమోగింది. పూజలు, కేశఖండన, ప్రసాదాలు, దర్శనం, రూమ్స్‌, అద్దెలు తదితర వాటిపై ఈ ఒక్కరోజే రూ.29 లక్షలు ఆదాయం లభించినట్లు ఈవో త్రినాధరావు తెలిపారు. 





Updated Date - 2022-08-14T05:24:32+05:30 IST