అప్పుకిక.. తిప్పలే!

ABN , First Publish Date - 2021-08-20T05:41:27+05:30 IST

నవరత్నాల మినహా మిగిలిన పథకాలను కనుమరుగుచేసే ప్రక్రియలో భాగంగా ఈసారి పొదుపు సంఘాలపై ప్రభుత్వం దృష్టిపడింది.

అప్పుకిక..  తిప్పలే!

వ్యాపారం చేస్తేనే అతివలకు పరపతి

ఆ యూనిట్లను పర్యవేక్షించే బాధ్యత వలంటీర్లకు 

బ్యాంకుల నుంచి రుణం ఇక కష్టమే..

పొదుపు ఖాతా నుంచే సర్దుబాటు చేసుకోవాలి..

జిల్లాకు రుణ లక్ష్యాల్లోనూ భారీగా కోత

సింగిల్‌విండో విధానం ఇక పటిష్టంగా అమలు 

డ్వాక్రా  సంఘాలు కనుమరుగేనా..?

 

డ్వాక్రా సంఘాలకు రుణాల మంజూరులో ప్రభుత్వం కొత్తగా సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో సంఘ సభ్యులకు బ్యాంకుల నుంచి రుణాలందేవి. మారిన నిబంధనల ప్రకారం రుణం అవసరమైతే వారి పొదుపుఖాతా నుంచే సర్దుబాటు చేసుకోవాలి. పైగా వ్యాపారం చేస్తేనే రుణభాగ్యం కల్పిస్తామని పొదుపు సంఘాలకు మెలిక పెట్టింది.  మహిళలు ఏర్పాటు చేసే వ్యాపార యూనిట్‌లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను కూడా వలంటీర్లుకు అప్పగించింది. అదేమంటే నవరత్నాల లబ్ధిదారుల్లో ఎక్కువమంది పొదుపు సంఘాల్లోని మహిళలే ఉన్నారని.. అందుకే రుణాల మంజూరు విషయంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నామని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

 

గుంటూరు(తూర్పు), ఆగస్టు19: నవరత్నాల మినహా మిగిలిన పథకాలను కనుమరుగుచేసే ప్రక్రియలో భాగంగా ఈసారి పొదుపు సంఘాలపై ప్రభుత్వం దృష్టిపడింది. ఈ క్రమంలోనే పొదుపు సంఘాలే లక్ష్యంగా వారి రుణాలకు భారీగా కత్తెర వేస్తోంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారు స్వశక్తితో ఎదగాలని గత ప్రభుత్వాలు అనేక సంక్షేమాలను ప్రవేశపెడితే.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసేవిధంగా నిర్ణయాలను తీసుకుంటోంది. సాధారణంగా కుటుంబ నిర్వహణ, వ్యక్తిగత అవసరాలకు, మరికొందరు తమకు ఇష్టమైన వ్యాపారం చేసేందుకు స్వయం సంఘాల రుణాలు వినియోగించుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తేనే రుణభాగ్యం కల్పిస్తామని పొదుపు సంఘాలకు మెలిక పెట్టింది. దీంతో స్వయం సంఘాల మహిళలు తీవ్ర నిరాశల్లోకి కూరుకుపోయారు.


పూర్తిగా మారిన నిబంధనలు..

ఆగస్టు ఆరంభం నుంచి స్వయం సహాయక సంఘాలకు రుణాలను మంజూరు చేసే విషయంలో గతంలో ఉన్న నింబంధనలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంది. గతంలో సంఘానికి రూ.6 లక్షల అప్పు అవసరమైతే నేరుగా బ్యాంకు నుంచి పొందేవారు. కానీ ప్రస్తుతం సంఘాలకు బ్యాంకుల నుంచి ఎటువంటి రుణ సదుపాయం  ఇవ్వకూడదు. కొత్త నిబంధనల ప్రకారం రుణం అవసరమైతే వారి పొదుపుఖాతా నుంచే సర్దుబాటు చేసుకోవాలి. ఒకవేళ అక్కడ కూడా తగినంత నిల్వలు లేకపోతే గ్రామసమాఖ్య, సామాజిక పెట్టుబడి, స్త్రీనిధి, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నత్ని సంఘం నుంచి తీసుకోవాలి. ఇక్కడ కూడా సమకూరని పక్షంలో మాత్రమే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లింకేజీల ద్వారా మంజూరు చేస్తారు. 


వేలిముద్రే ప్రామాణికం..

నూతన విధానంలో సాంకేతికకు ఆధిక ప్రాధాన్యం కల్పించారు. రుణం కావాల్సిన మహిళలు బయోమెట్రిక్‌ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పైగా అప్పు తీసుకునే సమయంలో.. తిరిగి ప్రతి నెలా కిస్తీలు చెల్లించే సమయంలో కూడా తప్పనిసరిగా వేలిముద్రలు వేయాలి. ఒకవేళ సాంకేతిక సమస్యలు తలెత్తి వేలిముద్రలు పడకపోతే ఐరిష్‌ చేస్తారు. నూతన నిబంధనల ప్రకారం పొదుపు రుణాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటామంటే కుదరదు. గతంలో ఒక సంఘంలో ఎంతమంది మహిళలు ఉంటే అందరూ రుణం పొందే వెసులుబాటు ఉండేది. కానీ ఇక నుంచి వ్యాపార నిమిత్తం అవసరమైన వారికే అప్పు ఇవ్వనున్నారు. వీరికి కూడా అంత సులభంగా అప్పు ఇవ్వరు. ఏ వ్యాపారం కోసం రుణం అడుగుతున్నారో అధికారులకు చెప్పాలి. అప్పుడు అధికారులు సదరు వ్యాపారానికి ఎంత అప్పు అవసరమో అంచనా వేసి, మిగిలిన ప్రక్రియను కూడా పూర్తిచేసి ఆ తరువాత మాత్రమే రుణాన్ని మంజూరు చేస్తారు. ఇప్పటివరకు బ్యాంకు నుంచి అందే రుణాలను సంఘ సహాయకులు(వీవోఏ)లు పర్యవేక్షిస్తారు. ఇక పై వీటిలో గ్రామ, వార్డు వలంటీర్లును భాగస్వామ్యం చేయాలని ఉన్నాతాధికారులు ఆదేశించారు. అంతేగాక రుణం పొందే మహిళలు వారు ఏర్పాటు చేసే వ్యాపార యూనిట్‌లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను కూడా వలంటీర్లుకు అప్పగించింది. 


పటిష్టంగా సింగిల్‌ విండో..

పెద్ద పెద్ద కంపెనీల ఏర్పాటులో అమలయ్యే సింగిల్‌ విండో అనే అస్త్రాన్ని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలపై ఎక్కుపెట్టింది. వాస్తవానికి గత ప్రభుత్వాల హయాంలో కూడా పొదుపు సంఘాలపై ఈ విధానం ఉండేది. కానీ పొదుపు సంఘాల్లో రుణాలు పొందే మహిళలు ఎక్కువమంది కుటుంబ అవసరాలకు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. దీంతో ఈ విధానం అమల్లో ఉన్నా గత ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వ్యవహరించేవి. దీంతో పొదుపుసంఘాల మహిళలు రుణ మంజూరు, వాటిని చెల్లించే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ ప్రస్తుతం తీసుకున్న అప్పునకు సంబంధించి కిస్తీలను ప్రతినెల తప్పనిసరిగా చెల్లించాలి. వీటిలో ఎటువంటి జాప్యం జరిగినా దానికి తగిన కారణాన్ని వలంటీరుకు గానీ, వీవోఏకు గానీ చెప్పాలి.


రుణ లక్ష్యాలు ఏవి..?

గతంలో మాదిరి ఈ ఏడాది ఇంతవరకు జిల్లాలో పొదుపు సంఘాలకు రుణ లక్ష్యాలను ప్రకటించలేదు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ విభాగాల్లోని 75,136 స్వయం సంఘాలకు దాదాపు రూ.751 కోట్ల మేర రుణాలను తొలుత నిర్ధేశించుకున్నారు. దీనికి సంబంధించిన వార్షిక ప్రణాళిక మాత్రం ఇంతవరకు రాలేదు. దీంతో    సగం కూడా పొదుపు సంఘాలకు అందలేదు. మహిళల కోసం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ, జగనన్నతోడు, సామాజిక పెట్టుబడి నిధి, ఉన్నతి, స్ర్తీనిధి వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వీటి ద్వారా అందే ఆర్థిక లబ్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పొదుపు సంఘాల మహిళల్లో అయోమయం నెలకొంది.


నవరత్నాలు అందుతున్నాయిగా..!

నవరత్నాల లబ్ధిదారుల్లో ఎక్కువమంది పొదుపు సంఘాల్లోని మహిళలే ఉన్నారని.. అందుకే రుణాల మంజూరు విషయంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నామని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ రుణాలకు, పథకాలకు లింకేటో అర్ధంగాక పొదుపు సంఘాల మహిళలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా బ్యాంకు నుంచి అప్పులు తీసుకుని వాటిని చెల్లించే వారిలో పొదుపు మహిళలే ముందుంటారని బ్యాంకు అధికారులే చెబుతుంటారు. వారి రుణ విషయంలో ఇటువంటి నిబంధనలు ఎందుకు జారీచేశారు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. పొదుపు సంఘాల సభ్యులు జాబితా ప్రకారం రాష్ట్రంలో జిల్లా 7,61,234 మంది మహిళలతో రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయంతో పొదుపు మహిళలతో పాటు జిల్లా ఆర్థికస్ధితిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

జిల్లాలో స్వయం సహాయక సంఘాలు

 ఎస్సీ సంఘాలు     19,263

ఎస్టీ సంఘాలు      3,644

బీసీ సంఘాలు     25,813

మైనార్టీ సంఘాలు   4,370

ఇతర సంఘాలు    22,046

మొత్తం  75,136 

Updated Date - 2021-08-20T05:41:27+05:30 IST