భయం అవసరమే

ABN , First Publish Date - 2021-12-18T06:04:29+05:30 IST

జీవిత భయం, భయ జీవితం మనందరికీ అలవాటే. రేపెలా ఉంటుందో అనే భయం. భిక్కటిల్లజేసే పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలమా అనే భయం. ఎదుర్కోలేకపోతే ఏమైపోతామో, ఏ అధఃపాతాళాల్ని చూడాల్సివస్తుందో....

భయం అవసరమే

మరణభయంబు నాకునణు మాత్రము లేదు, మదీయ జీవ సంభరణ భయమ్మె మిక్కుటము

– ‘పాంథశాల’లో దువ్వూరి రామిరెడ్డి


జీవిత భయం, భయ జీవితం మనందరికీ అలవాటే. రేపెలా ఉంటుందో అనే భయం. భిక్కటిల్లజేసే పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలమా అనే భయం. ఎదుర్కోలేకపోతే ఏమైపోతామో, ఏ అధఃపాతాళాల్ని చూడాల్సివస్తుందో అనే భయం. ఒక గండం గట్టెక్కాక మరోటి ఎదురుకాకుండా ఉండాలనుకునే చేసే భయం. ఇలా.. భయం మనిషిని వెన్నంటి ఉంటూనే కనిపించని నీడ.


మానవుడి సహజాతాల్లో ఒకటైన భయాన్ని తప్పించుకునే వాళ్లు ఎవ్వరూ ఉండరు. అది ఈ భూమ్మీద ప్రాణమంత పురాతనమైనది, ప్రాథమికమైనది. జీవితాన్ని గాఢంగా అల్లుకుపోయిన ఒక స్పందన అది. భౌతిక, భావోద్రేక ప్రమాదాలకు అత్యంత కీలకమైన ప్రతిస్పందన కూడా.


భయంలో అతి భయం, మిత భయం రెండూ మనకు అనుభవమే. అతి భయం అనర్థాలను తెచ్చిపెట్టి జీవన క్షణాల్ని స్తంభింపజేసి సజీవమైన నరకాన్ని మన సమక్షాన్ని చేస్తుంది. మిత భయం జాగ్రత్తలు నేర్పుతుంది. సురక్షితంలోకి నడిపిస్తుంది. స్నేహితులతో, కుటుంబంతో, సంఘంతో, ప్రకృతితో బంధాన్ని పెంచుతుంది. జీవితసారాన్ని అనుభవంలోకి తెస్తుంది.


భయం, దాని వల్ల కలిగే ఒత్తిడి పరిమితస్థాయిలో ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి హేతువులవుతాయి. ఆ సందర్భంగా శరీరంలో కొద్ది మోతాదులో విడుదలయ్యే అడ్రినలైన్‌ హార్మోన్‌ రోగనిరోధక వ్యవస్థలోకి చొచ్చుకుపోయి దానిని పటిష్ఠం చేస్తుంది. కండరాలు విచ్చుకునేలా చేస్తుంది. చురుకుదనాన్ని పెంచి ఆలోచనలకు పదును పెడుతుంది. ఇబ్బందికర పరిస్థితులను అధిగమించే మార్గాల అన్వేషణకు తోడ్పడుతుంది. పోరాటపటిమను పెంచి విజయాలకు, కొత్త జీవిత గమనాలకు దారులు పరుస్తుంది. మనలో కొద్దిపాటి భయం కలిగి వెంటనే దాని నుంచి తేరుకున్నప్పుడు శరీరం ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ప్రేమ, ఆహ్లాదం, నమ్మకం, లైంగికం లాంటి భావనలకు ఉద్దీపన కలిగించే హార్మోన్‌ అది. బంధాల్ని పెంచే ఆ భావనల వల్ల మనం మన సన్నిహితుల్ని మరింత అంటిపెట్టుకుని ఉండడానికి పరోక్షంగా దోహదపడుతుంది. అంతే కాదు, మానసికమైన కుంగుబాటు, ఆందోళన, జీర్ణకోశ సమస్యలకు చికిత్సా ఔషధంగా కూడా ఆక్సిటోసిన్‌ ఉపకరిస్తుంది. 


అతి భయం కమ్మేసినప్పుడు మెదడు ఎక్కువ మొత్తాల్లో విడుదల చేసే అడ్రినలైన్‌, కాట్రిసాల్‌ హార్మోన్లు రోగనిరోధక వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, గుండెపై నిర్దయగా దాడి చేస్తాయి. గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును, కండరాలలో ఒత్తిడిని పెంచి ధమనులు బండబారేలా చేసి హృదయ వ్యవస్థను స్థంభింపజేస్తాయి. శరీరంలో అతి కీలకమైన డిఎన్‌ఏను కూడా అవి ధ్వంసం చేస్తాయి. ఫలితంగా ముందస్తు వృద్ధాప్యం ముంచుకొస్తుంది. కణుతులు, అబార్షన్లు, తట్టుకోలేని దీర్ఘకాలిక మానసిక రుగ్మతలకు, మధుమేహం, కాల్షియం సంబంధిత వ్యాధులకు ఆ హర్మోన్లు కారణమవుతాయి. భయం ఇంకా ఎక్కువైనప్పుడు పూర్తి ఆరోగ్యవంతుల్లో సైతం హఠాత్తుగా గుండె ఆగిపోయి మరణాలు సంభవిస్తాయి.  ఇక అప్పటికే హృదయసంబంధ వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి ఇక చెప్పనవసరమే లేదు. 


ధైర్యాన్ని తొక్కిపడేసి, మనల్ని నొక్కిపడేసే భయం మన మనుగడ మీద నిత్యం వేలాడే కరవాలం. ‘అజ్ఞానమునకు భయమింకొక పేరు’ అని విశ్వనాథ అన్నారు కానీ జ్ఞానం, తెలివిడి, అవగాహన మెండుగా ఉన్న వారినీ భయం దరిచేరలేదా. అవన్నీ ఉన్నా మన ఉనికిని తారుమారు చేయగలిగిన దానిని చూసి, మన స్థితిని, గతిని మార్చగలిగిన దానిని చూసి భయపడతాం. బాధ్యతల్ని మోస్తున్నా, ఎవరినైనా ప్రేమిస్తున్నా, అమితంగా ఆరాధిస్తున్నా, మరేదైనా భౌతిక మానసిక వ్యామోహం కమ్మేసినా వాటన్నిటినీ అంటిపెట్టుకుని ఏదో అకారణమైన, అనుచితమైన భయం ఉంటుంది– అవి పోతాయేమోనని. అంటే ఉండటం భయం, ఉండకపోవడమూ భయమే.


మానవ పరిణామ వికాస క్రమాలకు ఒకరకంగా హేతువైన భయం అదే మానవాళి మొత్తానికి మినహాయింపు లేకుండా ఇటీవలి కాలంలో అనుభవమైనంతగా చరిత్రకు అందిన ఏ కాలంలోనూ అనుభవమైన ధాఖలాలు లేవు. ఏడాదిన్నర కాలం నుంచి ఒక అర్ధకణం తన ఉపరితల పొరల అంచుల మీద మనిషిని సుడులు తిప్పుతూ, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని బలిగొంటూ కుమ్మరించిన భయం ఛాయల్లో ఈ భువనమింకా తడబడని ఊపిరి కోసం కొట్టుమిట్టాడడం చూస్తూనే ఉన్నాం.  ఖండఖండాల్లో.. దేశదేశాల్లో ఇప్పటికే రెండు విడతలుగా విలయం సృష్టించిన కొవిడ్‌ కారణ మరణాల్లో అమిత భయంతో సంభవించినవీ ఎన్నెన్నో ఉన్నాయి. హఠాత్‌ భయం, అతి భయంతో ఆగిపోయిన గుండెలు, విలయ మరణాలను గురించి విన్న ప్రతిసారి మన నిలువెల్లా భయం తారాడిన సందర్భాలెన్నో. జీవితాన్ని దుర్భరం చేసిన ఆ భయాన్ని, అది కలిగించిన అనుభవాన్ని, నేర్పిన గుణపాఠాలను అవగాహన చేసుకునీ అతి నిర్లక్ష్యంతో అన్ని జాగ్రత్తలను గాలికి వదిలేసి భయాన్ని హేళనగా మిగుల్చుతున్న వాళ్లూ; అతి భయంలో కూరుకుపోయి, తేరుకోలేకపోతున్నవాళ్లు మన చుట్టూ ఎందరెందరో. రెండు వ్యాక్సిన్లు వేయించేసుకున్నాం కదా.. మనమిక సురక్షితం అనుకుంటూ వెరపన్నది లేక వ్యవహరిస్తున్న నిర్లక్ష్యరాయుళ్లు మరెందరో.


భయం జాగ్రత్తకు ఒక సున్నితమైన బాహ్య పొర. భయాన్ని జయించడమంటే దానిని నిర్లక్ష్యం చేయడమే కానీ, అలుముకునే విపత్కర పరిస్థితిని అలక్ష్యం చేయడం ఎంతమాత్రం కాదు. ‘రక్షణ కోసం వెతికే అనిశ్చిత స్థితి భయం’ అన్న జిడ్డు కృష్ణమూర్తి మాటల్ని మననం చేసుకుంటూ మసలడం మనందరికీ మేలు.


తడబడే అడుగే నిలబడుతుంది, నిలబెడుతుంది..

అందుకే జీవితానికి ఓ భయమంటూ అవసరం.

Updated Date - 2021-12-18T06:04:29+05:30 IST