ఆర్టీసీలో ఎంతమందికో..

ABN , First Publish Date - 2020-07-07T10:29:54+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులను కరోనా వణుకు పుట్టిస్తోంది. వరుస మరణాలతో కార్మికులు ఆందోళన చెందుతుంటే ఆదివారం రాత్రి

ఆర్టీసీలో ఎంతమందికో..

మృతి చెందిన ఓ ఉద్యోగికి పాజిటివ్‌ 

అంతకుముందు సహచరుతో విధులు

ప్రయాణికులకూ టికెట్ల జారీ

రిపోర్టుల ఆలస్యమే ప్రమాదంలోకి నెట్టేస్తుందా!?


నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), జూలై 6 : ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులను కరోనా వణుకు పుట్టిస్తోంది. వరుస మరణాలతో కార్మికులు ఆందోళన చెందుతుంటే ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఓ ఉద్యోగికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఉన్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలవగా, సోమవారం అధికారులు అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. 


లక్షణాలు కనిపించకనే..

ఆర్టీసీలో ఓ ఉద్యోగి రెండు రోజుల క్రితం ఎప్పటిలాగే విధులు నిర్వహించాడు. అందరితో సరదాగా ఉండే ఆ వ్యక్తి రాత్రి వరకు విధులు నిర్వహిస్తూ అనారోగ్యంగా ఉండటంతో తోటి ఉద్యోగుల సహకారంతో ఓ ప్రెవేటు వైద్యశాలలో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వెంటలేటర్‌పై చేరడం, వెంటనే మరణించడం అంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది.  ఆ తర్వాత వచ్చిన కరోనా ఫలితాల్లో మృతుడికి పాజిటివ్‌గా తేలింది.


ఎందుకిలా..

ఈ నెల 1వ తేదీన ఆర్టీసీ ఉద్యోగులలో కొందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. కానీ మృతి చెందిన ఉద్యోగికి సంబంధించిన రిపోర్టులు మాత్రం రాలేదు. అయితే, మృతి చెందిన తరువాత జరిపిన పరీక్షల రిపోర్టులు వచ్చాయని, అంతకుముందు పరీక్షల రిపోర్టులు రాలేదని ఆర్టీసీ ఆర్‌ఎం తెలుపుతున్నారు. మరి ఆలస్యంగా రిపోర్టులు రావడంతో ఏ లక్షణాలు కనిపించని ఆ ఉద్యోగితో  సహచరుల ఉద్యోగులతోపాటు ప్రయాణికులు సైతం దగ్గరగా మెలిగినట్లు  తెలుస్తోంది. మరి ఈ నిర్లక్ష్యం ఎంతమందిని కరోనా దరి చేరుస్తుందో అంతుపట్టడం లేదు.


అందరికీ పరీక్షలు నిర్వహిస్తాం

రీజియన్‌లోని ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని వైద్యశాఖను కోరాము. సోమవారం 30 మందికి పరీక్షలు జరిపారు. విఽధుల్లో ఉన్న సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని పదే పదే సూచిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. జాగ్రత్తలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

- శేషగిరిరావు, ఆర్టీసీ ఆర్‌ఎం

Updated Date - 2020-07-07T10:29:54+05:30 IST