ఈదురుగాలుల బీభత్సం

ABN , First Publish Date - 2022-05-26T06:47:02+05:30 IST

జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి వెంకుపాలెం, సీతానగరం, తగరంపూడి, అచ్చియ్యపేట, మెట్టపాలెం, సుందరయ్యపేట గ్రామాల్లో మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వాటిల్లింది.

ఈదురుగాలుల బీభత్సం
మునగపాకలో కూలిన చెట్టును తొలగిస్తున్న దృశ్యం


నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు 

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి(కొత్తూరు), మే 25:  జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి వెంకుపాలెం, సీతానగరం, తగరంపూడి, అచ్చియ్యపేట, మెట్టపాలెం, సుందరయ్యపేట గ్రామాల్లో మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరెంటు లేకపోవడంతో పంచాయతీల్లో మోటార్లు పనిచేయలేదు. దీంతో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిం చారు. కాగా, తగరంపూడి పంచాయతీ గదపుపేటలో మూడు కరెంటు స్తంభాలు పడిపోగా.. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిందని, గురువారం ఉదయానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.  

తుమ్మపాల: అనకాపల్లి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. అలాగే మాకవరం నుంచి పాపయ్యపాలెం రోడ్డులో కూడా వర్షపునీరు భారీగా నిల్వ ఉండిపోయింది. పట్టణంలోని నరసింగరావుపేటలో రోడ్డుపై చెట్టు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

పరవాడ: పరవాడ, పరసర ప్రాంత గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వాడచీపురపల్లి పంచాయతీ పరిధి ఊటగెడ్డపాలెంలో నాలుగు, పరవాడలో లైటింగ్‌ స్తంభం విద్యుత్‌ వైర్లుపై పడింది. అలాగే పలుచోట్ల హోర్డింగ్‌లు నేలకొరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

రాంబిల్లి: మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వర్షంతో విద్యుత్‌ నిలిచిపోవడంతోపాటు పలు గ్రామాల్లో చెట్లు పడిపోగా, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.  మండలంలో 71.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోద యినట్టు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది తెలిపారు. 

ఎలమంచిలి: ఎలమంచిలిలో బుధవారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఓపక్క ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. ఈదురుగాలులకు పట్టణంతోపాటు మండలంలోని పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు మామిడి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

మునగపాక: మండలంలో మంగళవారం అర్ధరాత్రి  ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రికార్డుస్థాయిలో 92.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేకచోట్ల చెట్లు కూలి విద్యుత్‌ వైర్లపై పడడంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. మునగపాక సబ్‌స్టేషన్‌ పరిధిలో 20 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయినట్టు సిబ్బంది తెలిపారు. మునగపాకలో అకాల వర్షానికి వరి పంట కోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి పనలు నీట మునిగిపోవడంతో వాటిని ఒడ్డుకు చేర్చేందుకు అవస్థలు పడ్డారు. కోతకు వచ్చిన పొద్దు తిరుగుడు పంట పూర్తిగా నేలమట్టమైంది. మామిడికాయలు నేల రాలిపోయాయి.


Updated Date - 2022-05-26T06:47:02+05:30 IST