‘చెత్త’ రాజకీయం

ABN , First Publish Date - 2021-10-26T07:39:44+05:30 IST

పుదిపట్ల పంచాయతీపై వివక్ష కొనసాగుతూనే వుంది.

‘చెత్త’ రాజకీయం

పుదిపట్ల పంచాయతీపై వివక్ష కొనసాగుతూనే వుంది. లక్షలాది రూపాయల నిధులు పంచాయతీలో మూలుగుతున్నా ఖర్చు పెట్టడానికి అధికారులకు మనసు రావడం లేదు.చాలా రోజులుగా వీధుల్లో చెత్త మురిగిపోతున్నా పట్టించుకోవడం లేదు.ఈ విషయమై సర్పంచ్‌ బడి సుధా యాదవ్‌ ఇప్పటికే పలు రూపాల్లో నిరసన తెలియజేసినా ఫలితం రాలేదు.ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ట్రాక్టర్‌ నడుపుతూ ఇంటింటికీ వెళ్ళి చెత్తను సేకరించారు.చెత్త తీసుకువెళ్లడానికి తానే ఒక ట్రాక్టరును ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు.చాలా రోజులుగా గ్రామంలో చెత్త సేకరించకపోవడం వల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారని, సమస్యను అనేకసార్లు పంచాయతీ అధికారులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్ళానని చెప్పారు. అయినా అధికారులు ఏ మాత్రం స్పందించలేదని వాపోయారు.వీధి లైట్లు వేయడం, తాగునీటి మోటర్లను రిపేరు చేయడంతో పాటు మంచినీటి పైపు లైన్ల మరమ్మతులకు సొంత డబ్బులు వెచ్చించానని వివరించారు.చివరకు చెత్త ట్రాక్టర్‌కు డీజల్‌ కూడా పట్టించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేయడమే తాను చేసిన తప్పా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పుదిపట్ల సమస్యలపై ఇప్పటికైనా కలెక్టర్‌ దృష్టి సారించాలని కోరారు. సింగిల్‌విండో మాజీ డైరెక్టర్‌ మునిరాజమ్మ, ఉప సర్పంచ్‌ రేవతి, వార్డు సభ్యులు సిద్ధయ్య యాదవ్‌, ఈశ్వరయ్య యాదవ్‌, రాజశేఖర్‌, మునిశంకర్‌, హేమభూషణ్‌, మాధవి, శివ రాయల్‌ తదితరులు పాల్గొన్నారు. 

- తిరుపతి రూరల్‌



Updated Date - 2021-10-26T07:39:44+05:30 IST