Abn logo
Apr 13 2021 @ 01:00AM

గోదావరి గట్టుపై చెత్తకుప్ప

కొవ్వూరులో డంపింగ్‌ యార్డు లేదు..

చెత్త అంతా ఏటిగట్టు పక్కనే..


కొవ్వూరు ఆధ్యాత్మిక పట్టణం.. అఖండ గోదావరి తీరంలో గోష్పాద క్షేత్రం విశిష్టమైనది. గోష్పాదక్షేత్రం దాటి కొద్దిగా ముందుకు వెళితే గట్టుపై కాటన్‌ విగ్రహం సమీపంలో భరించలేని దుర్గంధం. ఏమిటని చూస్తే చెత్తకుప్ప పెద్ద కొండలా దర్శనమిస్తుంది. పట్టణంలో సేకరించిన చెత్త కాటన్‌ విగ్రహం సమీపంలోని మున్సిపల్‌ స్థలంలో డంప్‌ చేస్తున్నారు. ఎదురుగా పవిత్ర గోదావరి కలుషితమయ్యే పరిస్థితిని పాలకులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాధారణ రోజుల్లోనే దుర్గంధం, చెత్త తగలబెట్టినపుడు పొగతో స్థానికులు, వాహనదారుల ఇబ్బందులు పడాల్సిందే.. ఇక వర్షాకాలం చెత్త కుప్ప నుంచి వర్షపు నీరు గోదావరిలో కలుస్తుంది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు సైతం కలుషిత గోదావరిలో మునకలెయ్యాల్సిందే. పట్టణంలో ప్రధాన సమస్య డంపింగ్‌ యార్డు. చెత్త వేయడానికి స్థల సేకరణ ఇప్పటికీ సాధ్యం కాలేదు.. ఎప్పటికి సాధ్యమవుతుందో తెలియదు..


కొవ్వూరు, ఏప్రిల్‌ 12 : ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కొవ్వూరు పట్టణాన్ని డంపింగ్‌ యార్డు తీరని సమస్యగా మారింది. పట్టణంలో చెత్తనంతా పవిత్ర గోదావరి ఒడ్డునే డంప్‌ చేస్తున్నారు. ప్రసిద్ధి చెందిన గోష్పాద క్షేత్రం దాటి కొంచె ముందుకు వెళితే భరించలేని దుర్గంధం ముక్కుపుటాలను   అదరగొడుతుంది. చెత్తను తగలబెడితే పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. వాహనదారులు ముక్కు, కళ్లు మూసుకుని ప్రమాదాల బారిన పడాల్సిందే. దశాబ్దాలుగా చెత్త సమస్య పట్టణానికి పట్టి పీడిస్తోంది.

పురపాలక సంఘం ఏర్పడి ఐదున్నర దశాబ్దాలు గడిచినా పట్టణంలో ఇప్పటికి వరకు డంపింగ్‌ యార్డు లేదు. ఇంటింటా సేకరించిన చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డుకు స్థల సేకరణ చేయడంలో అధికారులు, నాయకులు విఫలమవుతున్నారు. 16.23 కిలోమీటర్లు విస్తరించి ఉన్న కొవ్వూరు పట్టణంలో 23 వార్డులు 40 వేలకు పైగా జనాభా ఉన్నారు. 13వేల నివాసాలు ఉన్నాయి. 23 వార్డుల నుంచి ప్రతిరోజు 23 టన్నులు చెత్త వచ్చి పడుతుంది. గతంలో ఒకటో వార్డు రాజీవ్‌కాలనీలోని నివాసాలను ఆనుకుని ఉన్న మున్సిపల్‌ చెర్వు మూసివేసి అక్కడ చెత్తను డంపింగ్‌ చేసేవారు. వర్షాకాలంలో చెత్త రోడ్డుపై పారవేయడంతో దుర్గంధం వెదజల్లుతుందని కాలనీవాసులు ఆందోళన చేపట్లారు. డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడానికి నందమూరు రోడ్‌లో సుమారు 2 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమాని కోర్టును ఆశ్రయించడంతో డంపింగ్‌యార్డు సమస్య మళ్లా మొదటికి వచ్చింది. దీంతో ఇంటింటా సేకరించిన చెత్త వేయడానికి స్థలం లేకపోవడంతో గోష్పాద క్షేత్రానికి సమీపంలోని గోదావరి గట్టుపై కాటన్‌ విగ్రహం వద్ద మున్సిపల్‌ ఖాళీ స్థలంలో పారవేస్తున్నారు. ప్రఽదాన రహదారి పక్కనే చెత్తవేసి తగలబెట్టడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు, గుండుగొలను, కొవ్వూరు రహదారిపై ప్రయాణించే వాహనదారులతో పాటు, రైలు ప్రయాణికులు వర్షాకాలంలో దుర్వాసన భరించలేక నానాఅవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్‌ యార్డు సమస్యను నూతన పాలకవర్గం పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

చెత్త డంప్‌ చేస్తున్న వాహనం

స్థల సేకరణ ప్రతిపాదనలు పంపించాం

పట్టణంలో సేకరించిన చెత్తను తరలించడానికి మండలంలోని ఐ.పంగిడిలో 7 ఎకరాల జడ్పీ స్థలాన్ని డంపింగ్‌ యార్డుకు కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాం. డంపింగ్‌ యార్డుకు తరలిం చే చెత్తను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తడి, పొడి చెత్తగా వేరుచేసి అందించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. తడిచెత్తను హోం కంపోస్టు తయారుచేసి మొక్కలకు వేసుకునే విధంగా మహిళల కు అవగాహన కల్పిస్తున్నాం. చెట్ల ఆకులను తగలబెట్టకుండా పట్టణం లో కంపోస్టు తయారుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

కేటీ.సుధాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
Advertisement
Advertisement