Dussehra వేళ..Shopping‌ కళ

ABN , First Publish Date - 2021-10-13T17:20:03+05:30 IST

కరోనా మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యులు ఈ విజయదశమి తమ దశను మారుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నిత్యావసరాల ధరలు

Dussehra వేళ..Shopping‌ కళ

కళకళలాడుతున్న దుకాణాలు 

గతేడాదితో పోలిస్తే ఆశాజనకంగా అమ్మకాలు


పండుగంటే కొత్త దుస్తులుండాల్సిందే. ఇంటికి పండుగ కళ రావాలంటే కొత్త వస్తువులు కూడా కొనుక్కోవాల్సిందే. పండగ రోజు ఇంటికి వచ్చిన అతిథికి నోరైనా తీపి చేయాలిగా. అందుకే నగరవాసులు చలో షాపింగ్‌ అంటున్నారు. దీంతో దసరా నేపథ్యంలో దాదాపు సంవత్సరం తర్వాత దుకాణాలు కాస్త కళకళలాడుతున్నాయి.


హైదరాబాద్‌ సిటీ: కరోనా మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యులు ఈ విజయదశమి తమ దశను మారుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నిత్యావసరాల  ధరలు పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నా.. సెంటిమెంట్‌,  సరదా కోసం ఆందోళనను పక్కన పెడుతున్నారు. దీంతో దాదాపు సంవత్సరంన్నర తర్వాత మార్కెట్‌లలో కళ కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు జరుగుతున్నా, ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయంటున్నారు పలువురు వ్యాపారులు. 


గత సంవత్సరంతో పోలిస్తే ఈ దసరా అమ్మకాలలో 100 శాతం వృద్ధి కనిపిస్తోందని వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా బాగున్నాయని ఆటో రంగ ప్రతినిధులు అంటున్నారు. పండుగ సీజన్‌లో గణనీయమైన వేగం కనిపిస్తుండటం భవిష్యత్‌పై భరోసా కలిగిస్తుందని ఎక్కువ మంది వ్యాపారులు మరీ ముఖ్యంగా మల్టీ చైన్‌ స్టోర్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. అటు భారీ ఆఫర్లు ప్రకటించలేక, ఇటు మార్కెట్‌ పోటీ తట్టుకోలేక సతమతమవుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఎలకా్ట్రనిక్స్‌, వస్త్రాలు, హోమ్‌ నీడ్స్‌, ఫర్నిచర్‌.. ఆభరణాలు ఇది అది అనే తేడా లేకుండా ప్రతి వస్తువుపైనా రాయితీల వాన కురిపిస్తున్నారు కొందరు నిర్వాహకులు. దీంతో జనం దుకాణాల బాట పడుతున్నారు. 

అప్పెరల్స్‌తో పాటుగా మగువలు అమితంగా ఆదరించే బ్యూటీ రంగమూ ఇప్పుడు అమ్మకాల పరంగా ఆశాజనక ఫలితాలనే చూస్తున్నామని చెబుతోంది. స్కిన్‌క్రాఫ్ట్ లేబరేటరీస్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు చైతన్య నల్లన్‌ మాట్లాడుతూ స్ర్పే అండ్‌ ప్ర్పే బ్యూటీ కాలం కాదిది. శాస్త్ర ఆధారిత నిరూపణలు కోరుకుంటున్నారు. మరీ  ముఖ్యంగా చర్మం, జుట్టు, బాడీకేర్‌పరంగా ఈ ధోరణి చూస్తున్నామన్నారు.


దసరా వచ్చిందయ్యా.. 

వివాహ వేడుకల సీజన్‌ కూడా కలిసి రావడంతో షాపింగ్‌ చేసేవారు పెరిగారని వ్యాపారులు చెబుతున్నారు.  గత సంవత్సరం దసరా షాపింగ్‌ ఓ మోస్తరుగానే జరిగిందని, ఈ సారి కరోనా ముందు నాటి అమ్మకాలను చేరుకోగలమని ఆశిస్తున్నామని శ్రీ కృష్ణ సిల్క్‌ అధినేతలలో ఒకరైన వేణు చెప్పారు. ఈ పండుగ సీజన్‌లో నగరంలో కనీసం రూ. 500 కోట్లు, గరిష్ఠంగా రూ. 1000 కోట్ల వస్త్ర వ్యాపారం జరుగుతుంటుందని, ఈ ఏడాది ఆ టార్గెట్‌ పూర్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సంపన్న వర్గాలు మాత్రమే కాకుండా మధ్యతరగతి వారు కూడా నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇది వాస్తవమే అని అంటున్నారు ఓ  షాపింగ్‌ మాల్‌ అధినేత. నగరంలో  ఇప్పుడు వస్త్రవ్యాపారంలో  జరుగుతున్న బిల్‌ సైజ్‌ 2-3 వేల రూపాయల కంటే అధికంగా ఉండటం మధ్యతరగతి షాపింగ్‌ను సూచిస్తుందన్నారాయన. పేరొందిన వస్త్ర దుకాణాలలో జనం రద్దీ కనిపిస్తున్నా, ఇతర దుకాణాల్లో కొనేవాళ్లు తక్కువే ఉంటున్నారని మరికొందరు పేర్కొంటున్నారు. భారీ మాల్స్‌లో ఆఫర్లు ఇచ్చినంతగా తాము ఇవ్వలేకపోవడమూ తమ వద్ద అమ్మకాలు పెద్దగా లేకపోవడానికి కారణం బహుశా ఇదేనని అమీర్‌పేటలోని ఎల్‌ ఫ్యాషన్స్‌ అధినేత లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - 2021-10-13T17:20:03+05:30 IST