రోజూ 10వేల మందికే దర్శనం

ABN , First Publish Date - 2020-10-17T09:06:04+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ..

రోజూ 10వేల మందికే దర్శనం

ఆన్‌లైన్‌ టికెట్‌ ఉన్న వారికే అనుమతి

నేటి ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం

రేపటి నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు..


విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రోజుకు కేవలం పదివేల మందినే దర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు నెల రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 73,769 మంది భక్తులు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు దుర్గగుడి అధికారులు ప్రకటించారు. వారిలో ఉచిత దర్శనానికి 29,710 మంది, రూ.100 దర్శనానికి 24,834 మంది, రూ.300 దర్శనానికి 19,225 మంది బుక్‌ చేసుకున్నారని, ఆన్‌లైన్‌ టికెట్లు ఉన్నవారినే టైమ్‌స్లాట్‌ ప్రకారం అనుమతిస్తామని దుర్గగుడి అధికారులు స్పష్టం చేశారు.


ఉత్సవాల్లో మొదటిరోజు అంటే శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు, తరువాత రోజు నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. మూలానక్షత్రం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 13వేల మందికి పైగా భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.


ఆన్‌లైన్‌ టికెట్లు లేని భక్తులకు ఆరోజు టైం స్లాట్‌ ప్రకారం ఖాళీ ఉంటే సీతమ్మవారి పాదాలు వద్ద ఏర్పాటుచేసిన దేవస్థాన కౌంటర్‌ వద్ద అప్పటికప్పుడు టికెట్లు విక్రయిస్తారు. కొండ దిగువన కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి, అటు కుమ్మరిపాలెం వైపు నుంచి దర్శనానికి అనుమతించేందుకు క్యూలైన్లు నిర్మించారు.


తలనీలాలు, పుణ్యస్నానాలు రద్దు 

దసరా ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుని, కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించాక దుర్గమ్మను దర్శించుకుంటారు. కానీ, కరోనా వల్ల ఈ ఏడాది వాటిని రద్దు చేశారు. ప్రత్యేక కేశన ఖండనశాల ఏర్పాట్లు ఏమీ చేయలేదు. పుణ్యస్నానాలు చేసే ఘాట్లను మూసివేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. 


ప్రసాదాలు పరిమితమే.. 

దసరా ఉత్సవాల్లో భక్తులకు అమ్మవారి ప్రసాదాలను ఎన్ని కావాలంటే అన్ని విక్రయించేవారు. ఈ ఏడాది కేవలం లడ్డూ ప్రసాదాలే. అవికూడా పరిమిత సంఖ్యలోనే విక్రయించనున్నారు. ఉత్సవాల్లో రోజూ 50వేల లడ్డూలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆరోజు 2 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచాలని, తర్వాత రోజు నుంచి రోజుకు లక్ష లడ్డూలు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత అన్నదానాన్ని రద్దు చేశారు. రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పులిహోర, దద్ద్యోజనం ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. భక్తులు తాగునీరు కూడా సొంతంగా తెచ్చుకోవాలి. 


నేటి నుంచి మల్లేశ్వరస్వామి దర్శనం

ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి పనుల కారణంగా దాదాపు ఏడాది నుంచి దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనులు ఇటీవలే పూర్తికావడంతో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం 9 గంటల నుంచి మల్లేశ్వరస్వామి దర్శనాలకు కూడా అనుమతిస్తారు. 

Updated Date - 2020-10-17T09:06:04+05:30 IST