దసరా... నోరూరా..!

ABN , First Publish Date - 2021-10-09T06:25:09+05:30 IST

పండుగ అంటే ఇంట్లో వంటల ఘుమఘుమలు ఉంటాయి. ముఖ్యంగా దసరా పండుగ అంటే స్వీటు, హాటు రెండూ ఉండాల్సిందే.

దసరా... నోరూరా..!

పండుగ అంటే ఇంట్లో వంటల ఘుమఘుమలు ఉంటాయి. ముఖ్యంగా దసరా పండుగ అంటే స్వీటు, హాటు రెండూ ఉండాల్సిందే. క్యారెట్‌ బొబ్బట్లు, స్వీట్‌ పనియారం, చిత్రాన్నం... ఈ వంటలను దుర్గామాతకు నైవేద్యంగా సమర్పించడంతో పాటు, ఇంటిల్లిపాది కమ్మని రుచులు ఆస్వాదించవచ్చు.  పండుగ వేళ ఈ రెసిపీలను మీరూ ట్రై చేయండి. 


స్వీట్‌ పనియారం

కావలసినవి

బియ్యప్పిండి - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, బెల్లం - అరకప్పు, అరటిపండు ముక్కలు - అర కప్పు, యాలకులు - రెండు, నెయ్యి - కొద్దిగా, ఉప్పు - తగినంత.

తయారీ విధానం

ఒక బౌల్‌లో కొబ్బరి తురుము, అరటిపండు ముక్కలు, యాలకులు తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. అవసరమైతే ఒకటి రెండు చెంచాల నీళ్లు వేసుకోవచ్చు.

తరువాత బెల్లం వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకుని బౌల్‌లోకి మార్చుకోవాలి.

ఇందులో తగినంత ఉప్పు వేసి, బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పనియారం పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి మిశ్రమం వేసుకోవాలి.

చిన్నమంటపై మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత పనియారంలు తిప్పి మరికాసేపు ఉడికించాలి. చట్నీతో తింటే ఇవి రుచిగా ఉంటాయి.

పండుగ రోజున పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు






క్యారెట్‌ బొబ్బట్లు

కావలసినవి

గోధుమపిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌ తురుము - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, బాదం - నాలుగైదు, కొబ్బరి తురుము - పావుకప్పు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, యాలకులు - ఒక టీస్పూన్‌.

తయారీ విధానం

ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చపాతీ పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఒక టీస్పూన్‌ నెయ్యి వేసి మళ్లీ ఒకసారి కలుపుకొని పావుగంట పక్కన పెట్టుకోవాలి.

బాదం, జీడిపప్పును మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. 

స్టవ్‌పై వెడల్పాటి ఒక పాత్రను పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక క్యారెట్‌ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. 

తరువాత బెల్లం వేసి కలియబెట్టాలి. బెల్లం కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్‌ పొడి, పావు కప్పు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత యాలకుల పొడి వేయాలి. స్టవ్‌ పై నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి. 

మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి.

ఇప్పుడు గోధుమపిండి కొద్దిగా తీసుకుని అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తి, మధ్యలో క్యారెట్‌ ఉండ పెట్టి చుట్టూ చివర్లు దగ్గరకు ఒత్తాలి.

ఒక పాలిథీన్‌ పేపర్‌పై నెయ్యి వేసి చేత్తో ఒత్తుకుంటూ బొబ్బట్లు తయారుచేసుకోవాలి. ఈ బొబ్బట్లను నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా తింటూ పండుగ మజాను ఆస్వాదించవచ్చు.


చిత్రాన్నం

కావలసినవి

బియ్యం - ఒకకప్పు, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, శనగపప్పు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - మూడు, ఎండుమిర్చి - మూడు, నూనె - ఐదు టీస్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత, పల్లీలు - ఒక టీస్పూన్‌. 

తయారీ

ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.

ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేగించాలి. 

తరువాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి, పసుపు వేసి మరికాసేపు వేగించాలి.

ఇప్పుడు అన్నం వేసి, నిమ్మరసం పోసి సమంగా కలిసేలా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని దింపుకోవాలి. 

దుర్గాష్టమి రోజున చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించాలి.

Updated Date - 2021-10-09T06:25:09+05:30 IST