దసరా విన్యాసం

ABN , First Publish Date - 2021-10-17T06:24:15+05:30 IST

మండల పరిధిలోని గుడికల్లు గ్రామంలో యువకుల సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి.

దసరా విన్యాసం

ఎమ్మిగనూరు, అక్టోబరు 16: మండల పరిధిలోని గుడికల్లు గ్రామంలో యువకుల సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. దసరా సందర్భంగా శుక్ర, శనివారాల్లో ఈ వేడుకలు జరిగాయి. ఏటా జరిగే ఈ ఉత్సవాలు గత ఏడాది కొవిడ్‌ కారణంగా రద్దు అయ్యాయి. ఈ ఏడాది జరిగిన విన్యాసాలను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. గ్రామ పెద్దలు రుద్రగౌడు, పురుషోత్తంగౌడు ఆధ్వర్యంలో చింత మాను గల్డి, రామమ్మ గల్డి, గచ్చిని గల్డి యువ కులు విన్యాసాలను ప్రదర్శించారు. కొందరు యువకులు చెవులకు ఇనుప కడ్డీలను గుచ్చుకొని తలకిందులుగా వేలాడుతూ గ్యాస్‌ సిలిండర్‌ను పైకిలాగారు. మరికొందరు ఎదకు, వీపుకు ఇనుప చువ్వలను గుచ్చుకొని పది అడుగులకు పైగా ఎత్తులో నిచ్చెనపై నిలబడి ఇద్దరు యువకులను  పైకి లాగారు. కట్టెల మధ్య వరుసగా పెట్టిన అద్దాలను వేగాంగా పరిగెడుతూ పగులగొట్టారు. అడ్డంగా పెట్టిన 20 ట్యూబులను బైక్‌పై వస్తూ పగులగొట్టారు. ముక్కుకు ఇనుప చువ్వలను గుచ్చుకొని వాటికి తాడుకట్టి మోటారు బైక్‌ను లాగారు. కొన్ని విన్యాసాలు చూడటానికి ఒళ్లు గగుర్పొడిచింది. రూరల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు డాక్టర్‌ గౌడప్ప గౌడు, కుమార్‌ గౌడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:24:15+05:30 IST