దసరా సందడి

ABN , First Publish Date - 2022-10-01T05:38:38+05:30 IST

జిల్లాలో దసరా పండుగ సందడి నెలకొంది. కొవిడ్‌ మహమ్మారితో రెండేళ్లపాటు పండుగలు, సంబరాలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఈసారి పూర్తస్థాయిలో పండుగలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

దసరా సందడి
సిరిసిల్ల షాపింగ్‌మాల్‌లో కొనుగోళ్ల సందడి

 - రేండేళ్లకు కళకళలాడుతున్న వాణిజ్య సంస్థలు 

- కిటకిటలాడుతున్న వస్త్ర దుకాణాలు 

- ఆఫర్లతో ఆకర్షిస్తున్న వ్యాపారులు 

- ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల జోరు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో దసరా పండుగ సందడి నెలకొంది. కొవిడ్‌ మహమ్మారితో రెండేళ్లపాటు పండుగలు, సంబరాలకు  ప్రజలు దూరంగా ఉన్నారు. ఈసారి పూర్తస్థాయిలో పండుగలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెల రోజుల ముందు నుంచే దసరా వేడుకలకు ఉత్సాహం చూపుతున్నారు.  గతంలో సాదాసీదాగా సాగిన పండుగలతో వ్యాపార సంస్థలు వెలవెలబోయాయి. ఈ సారి సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ మున్సిపల్‌ కేంద్రాల్లోని షాపింగ్‌మాల్‌లు, చిన్నతరహా వస్త్ర పరిశ్రమ కేంద్రాలు కొనుగోళ్లతో సందడిగా మారాయి. మండల కేంద్రాల్లో కూడా రెడీమేడ్‌ దుకాణాల్లో కొనుగోళ్ల జోరుగా సాగు తున్నాయి.  వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. గిఫ్ట్‌ ఆఫర్లు, డిస్కౌంట్‌లను అందిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగకు కొత్త బట్టల కొనుగోళ్లతో దుకాణాలు కిక్కిరిసి పోతున్నాయి. రెడిమేడ్‌, కిడ్స్‌వేర్‌లలో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలో బ్రాండెండ్‌ షోరూంలతోపాటు షాపింగ్‌మాల్‌లు వెలిశాయి. గతంలో కరీంనగర్‌ హైదరాబాద్‌కు వెళ్లి కొత్త దుస్తులు కొనుగోలు చేసేవారు. ఈ సారి స్థానికంగానే బ్రాండెడ్‌ షోరూంలు నెలకొల్పడంతో వినియోగదారులకు దూర భారం తప్పింది.  బ్రాండెడ్‌ షోరూంల నిర్వాహకులు లక్కీ, డిస్కౌంట్‌ కూపన్లు అందిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి ఇన్‌స్టంట్‌ బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. 

ఆన్‌లైన్‌ కొనుగోళ్లపైనా ఆసక్తి 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు కూడా జనం ఆసక్తి చూపుతున్నారు.   పండుగలకు అనుగుణంగానే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, మైత్ర, టాటా, జియో వంటి  సంస్థలు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో జిల్లావాసులు ఆన్‌లైన్‌  కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, సులభ వాయిదాలతో వినియోగదారులు వివిధ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా దుస్తులు, మొబైల్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. గతంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ సౌకర్యం ఇప్పుడు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలకు విస్తరించింది. దీంతో ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. అంతేకాకుండా నచ్చని వస్తువులను వారం రోజుల్లో తిరిగి వాపస్‌ చేసే అవకాశం ఉండడంతో  మరింత ఆసక్తి పెరిగింది. 

జ్యువెల్లరీ మెరుపులు 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జ్యువెల్లరీ దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. వన్‌గ్రామ్‌ గోల్డ్‌తోపాటు ఇతర ఇమిటేషన్‌ నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై కూడా ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. దీంతో రోడ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. 


వ్యాపారాలు పుంజుకున్నాయి 

- రాజూరి వంశీశోభన్‌, షాపింగ్‌ మాల్‌ యజమాని

కొవిడ్‌ కారణంగా గతంలో వ్యాపారాలు కొనసాగక ఇబ్బందులు పడ్డాం. కొవిడ్‌ భయం తొలగడంతో ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు మళ్లీ కొనుగోళ్లు పుంజుకున్నాయి. కొత్త డిజైన్లు,  వెరైటీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 



 పెరిగిన కొనుగోళ్లు 

- మంతెన సతీష్‌,  రెడీమేడ్‌ యజమాని

బతుకమ్మ, దసరా పండుగ కొనుగోళ్ల వ్యాపారం పెరిగింది.  రెండేళ్ల కంటే ఈ సారి అన్ని వర్గాల ప్రజలు కొత్త బట్టలు కొనుగోలు చేస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే కొత్త డిజైన్ల బట్టలు అందుబాటులోకి రెడీమేడ్‌ వస్త్రాలు ఇప్పుడు సిరిసిల్లలోనే లభిస్తున్నాయి. 


Updated Date - 2022-10-01T05:38:38+05:30 IST