Abn logo
Oct 14 2021 @ 02:31AM

దసరా తర్వాత హుజూరాబాద్‌ పోరు ఉధృతం

  • పోటీ నుంచి తప్పుకున్న మెజార్టీ రెబల్స్‌
  • వ్యూహాలకు పదునుపెడుతున్న మూడు పార్టీలు
  • పోటీ నుంచి తప్పుకున్న మెజార్టీ రెబల్స్‌
  • వ్యూహాలకు పదునుపెడుతున్న మూడు పార్టీలు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టమూ ముగిసిపోయింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కొందరు రెబల్‌ అభ్యర్థులతో ఆయా పార్టీల నాయకత్వం చర్చలు జరిపి నామినేషన్లు ఉపసంహరింపచేసింది. ఆయా పార్టీల తరఫున డమ్మీ నామినేషన్లు దాఖలు చేసిన వారూ ఉపసంహరించుకోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులే రేసులో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 30 మంది అభ్యర్థులు మిగిలినా పోటీ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ల మధ్యేనన్నది స్పష్టత వచ్చేసింది. అయితే హుజూరాబాద్‌ కదనరంగంలో పోరును దసరా తర్వాత ఉధృతం చేసేందుకు మూడు పార్టీలూ సన్నద్ధమవుతున్నాయి. టీఆర్‌ఎ్‌సకు సంబంధించి ఇప్పటిదాకా మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, స్థానిక పార్టీ నాయ కులు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు.


అయితే దసరా తర్వాత పార్టీ రాష్ట్ర నాయకులూ రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా కులాలు, వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమూ చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీ అభ్యర్థి గెలవాల్సిన ఆవశ్యకత ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి తొలగింపుతో ఏర్పడిన సానుభూతి, బీజేపీ అండదండలతోనూ ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఉప ఎన్నిక జరగడంలో జాప్యం కారణంగా సానుభూతి ప్రభావం కొంత మేరకు తగ్గే అవకాశమూ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాంటి లోటును దసరా తర్వాత ఎన్నికకు మిగిలి ఉన్న పక్షం రోజుల్లో భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థి నిర్ణయంలో తీవ్ర జాప్యం చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. చివరకు విద్యార్థి నాయకునికే ఓటు వేసింది. ఈ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు వచ్చిన ఓట్లను నిలబెట్టుకుంటే.. రేసులో ముందుకు వెళ్లవచ్చన్న అంచనాలో ఆ పార్టీ ఉంది. ఇందుకుగాను మండలాలు, గ్రామాల వారీగా ఇన్‌చార్జీల నియాకాన్నీ పూర్తిచేసి పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధమైంది. దసరా తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. 


ఈ నెల 18న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. హుజూరాబాద్‌కు వెళ్లి పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఉప ఎన్నిక లోపు కరీంనగర్‌లో విద్యార్థి, నిరుద్యోగ సైరన్‌ కార్యక్రమాన్నీ నిర్వహించాలన్న ఆలోచన టీపీసీసీ చేస్తోంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరల పెరుగుదల తదితర అంశాలను ప్రచారంలో తెరపైకి తెచ్చి బీజేపీ, టీఆర్‌ఎ్‌సలను ఇరుకున పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఇవే అంశాలపై ఇటీవలి కాలంలో ఉద్యమానికి కలిసి వచ్చిన వామపక్షాలు, ఇతర పార్టీల మద్దతును కూడగట్టడంలో మాత్రం కాంగ్రెస్‌ అవసరమైన మేరకు చొరవ చూపడంలేదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 

తెలంగాణ మరిన్ని...