ఆర్టీసీకి దసరా కాసులు

ABN , First Publish Date - 2021-10-20T05:55:19+05:30 IST

ఈ యేడు ఆర్టీసీకి దసరా పండుగ కాసులు కురిపించింది. గతంలో కరోనా కారణంగా పూర్తిగా ఆదరణ తగ్గి ఆదాయం కోల్పోయి ఇప్పుడిప్పుడే గాడిలోపడుతున్న ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు యాజమాన్యం పలురకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఆర్టీసీకి దసరా కాసులు

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఆర్టీసీ ఆదాయం

ప్రత్యేక సర్వీసులతో రూ.58లక్షల కలెక్షన్‌ 

టాప్‌లో నిలిచిన నిర్మల్‌ డిపో

స్పెషల్‌ చార్జీల రద్దుతో సంస్థకు పెరిగిన ఆదరణ

ఆదిలాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఈ యేడు ఆర్టీసీకి దసరా పండుగ కాసులు కురిపించింది. గతంలో కరోనా కారణంగా పూర్తిగా ఆదరణ తగ్గి ఆదాయం కోల్పోయి  ఇప్పుడిప్పుడే గాడిలోపడుతున్న ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు యాజమాన్యం పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. గత యేడాదికి పైగా కార్గొ సేవలను అందిస్తూ అదనంగా ఆదాయాన్ని అర్జీ స్తోంది. పండుగల సమయాల్లో ప్రత్యేకంగా నిలుస్తూ ప్ర యాణికుల ఆదరణ పొందుతోంది. దసరా, బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడంతో భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్‌, ఉట్నూర్‌, భైంసా డిపోల పరిధిలో దసరా పండుగకు అదనంగా రూ.57లక్షల 99వేల 563 ఆదాయం వచ్చింది. గతేడుతో పోల్చుకుంటే ఈ సారి దసరా పండుగకు రెండింతల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల ఆదారణ కనిపిస్తోంది.

403 ప్రత్యేక సర్వీసులు..

కరోనాతో కష్టాల్లో పడిన ఆర్టీసీ ఆదాయ మార్గాలను అన్వేశిస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి దసరా పండుగకు ప్రత్యేక సర్వీసులను నడపడంతో అదనంగా ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌ డిపో పరిధిలో 88 బస్సు సర్వీసులు, నిర్మల్‌లో 112, ఉట్నూర్‌లో 8, భైంసాలో 41, ఆసిఫాబాద్‌లో 58, మంచిర్యాలలో 102 ప్రత్యేక బస్సు సర్వీసులను దసరా పండుగకు నడిపింది. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు మొత్తం 25వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. ప్రైవేట్‌కు దీటుగా సర్వీసులను నడపడంతోనే అనుకున్నంత ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌ రూట్లలోనే ఎక్కువగా ఆదాయం వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఆదాయంలో నిర్మల్‌ టాప్‌..

గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి దసరా పండుగకు స్పెషల్‌ చార్జీలను రద్దు చేయడంతో ఆదాయం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల్లోనే నిర్మల్‌ డిపో ఆదాయంలో ముందు వరుసలో నిలిచింది. 112 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడం ద్వారా ఈ నెల 7 నుంచి 15 తేదీ వరకు రూ.14లక్షల 96వేల ఆదాయం వచ్చింది. అలాగే ఆదిలాబాద్‌ డిపో పరిధిలో రూ.12లక్షల 88వేలు, మంచిర్యాల డిపో పరిధిలో రూ.13లక్షల 76వేలు, ఆసిఫాబాద్‌ డిపో పరిధిలో రూ.9లక్షల 51వేలు, ఉట్నూర్‌ డిపో పరిధిలో రూ.91వేలు, భైంసా డిపో పరిధిలో రూ.5లక్షల 97వేలు ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు నిర్మల్‌ కేంద్రంగా ఉండడంతోనే అధికంగా ఆదాయం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

  ప్రజల ఆదరణ పెరుగుతోంది..

: కృష్ణమూర్తి 

(రీజినల్‌ మేనేజర్‌, ఆదిలాబాద్‌)

ఆర్టీసీపై ప్రజల ఆదారణ పెరుగుతోంది. కరోనా పరిస్థితులతో పోల్చుకుంటే ప్రస్తుతం కొంత మెరుగ్గానే కనిపిస్తోంది. దసరా పండుగకు అదనంగా రూ.58లక్షల ఆదాయం వచ్చింది. నిత్యం తిరిగే బస్సులకు అదనంగా వారం రోజులుగా 403 ప్రత్యేక సర్వీసులను నడపడం జరుగుతోంది. మరో మూడు రోజుల వరకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది. దీంతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీని బట్టి అన్ని రూట్లలో బస్సుసర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నాం.

Updated Date - 2021-10-20T05:55:19+05:30 IST