వైభవంగా దసరా

ABN , First Publish Date - 2020-10-27T11:16:25+05:30 IST

చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని ఆదివారం ఆమనగల్లు పట్టణంతో పాటు ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి , మాడ్గుల మండలాల పరిధిలోని అన్ని

వైభవంగా దసరా

గ్రామాల్లో జోరుగా దసరా వేడుకలు...


ఆమనగల్లు/కడ్తాల్‌/ఇబ్రహీంపట్నం/యాచారం : చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని ఆదివారం ఆమనగల్లు పట్టణంతో పాటు ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి , మాడ్గుల మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో  ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిదిరోజులపాటు వివిధ రూపాల్లో పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలను ఊరేగించి సమీప చెరువుకుంటల్లో నిమజ్జనం చేశారు. ఆయా గ్రామాల్లో జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించి ప్రజలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకు ముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ భీమనపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ బీసీ   కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక గాంధీచౌక్‌ వద్ద ఆయుధ పూజలు నిర్వహించి అనంతరం బ్యాండు వాయిద్యాలతో మాడ్గుల రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు బేతాళుడి, అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు చేపట్టారు. ర్యాలీలో పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం రావణాసురుని దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


రాజమండ్రి కళాకారుల బృందం నిర్వహించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకాలు, కళాప్రదర్శనలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ ధర్మేశ్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైసిగండి మైసమ్మ దేవాలయంలో పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఆమనగల్లులోనికన్యకాపరమేశ్వరీ ఆలయంలో సోమవారం  అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిదంగా ఆలయంలో హోమం,  పూజలు , అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం  అమ్మవారి ఊరేగింపు, ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 


మైసిగండిలో ముగిసిన వేడుకలు

కడ్తాల్‌ మండలం మైసిగండి శివరామాలయంలో దసరా ముగింపు ఉత్సవాల్లో భాగంగా  అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి  అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించారు. ఇబ్రహీంపట్నంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వగ్రామమైన ఎలిమినేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యువ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం తులేకలాన్‌ గ్రామంలో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగటి నాగమణి, ఉప సర్పంచ్‌ బాసాని రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా యాచారం మండల కేంద్రానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. సయ్యద్‌జావేద్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు.  నందివనపర్తి గ్రామంలోని జ్ఞానసరస్వతీ మాత ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 


కందుకూరులో పూజల్లో ప్రజాప్రతినిధులు

కందుకూరు మండల పరిధి దెబ్బడగూడ గ్రామంలో మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, కొత్తగూడ గ్రామంలో సర్పంచ్‌ మల్లారెడ్డిలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి జమ్మిచెట్టుకు పూజలు చేశారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎస్‌.వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, బాచులపల్లిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డిని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మీర్కాన్‌పేట, కందుకూరు, దాసర్లపల్లి, బాచుపల్లి, కందుకూరు చౌరస్తా,  లేమూరు తదితర గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. 


ఆకట్టుకున్న కోలాటాలు 

షాద్‌నగర్‌ అర్బన్‌/కేశంపేట/కొందుర్గు: దసరా ఉత్సవాల్లో భాగంగా నిత్యపూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాలను సోమవారం నిమజ్జనం చేశారు. షాద్‌నగర్‌ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మలిపెద్ది శ్రీనివా్‌సగుప్తా ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపును నిర్వహించారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మధురాపురం గ్రామంలో మల్కయ్యగారి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సర్పంచ్‌ ఎల్‌.శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. వందలాది మంది భక్తులు నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. చౌదరిగూడ మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో కోలాటాలు, బతుకమ్మ ఆటపాటల నడుమ అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. షాద్‌నగర్‌ పట్టణానికి ముఖద్వారంగా వెలిసిన లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో కల్యాణోత్సవం, పల్లకీ సేవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కేశంపేట మండలం ఎక్లా్‌సఖాన్‌పేట గ్రామంలో నిర్వహించిన శమిపూజల్లో ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌, షాద్‌నగర్‌లో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ పాల్గొని ప్రజలకు దసరా శుభాక్షాంక్షలు తెలిపారు. కొందుర్గు మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఉరేగించారు. ఈ సందర్భంగా చెక్కభజన, కోలాటం, సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. 


మహేశ్వరం, తుక్కుగూడలో ఘనంగా వేడుకలు

మహేశ్వరం : మండల పరిధిలోని  ఆయా గ్రామాలతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు. మహేశ్వరం, మన్సాన్‌పల్లి గ్రామాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు జడ్పీచైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 


ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్రముఖ దేవీ ఉపాసకులు వాసగోని కృష్ణ పూజలు నిర్వహించగా, భక్తులంతా కలశాల ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. మధురానగర్‌, ఆర్బీనగర్‌, ఆదర్శ్‌ నగర్‌ బస్తీలో జమ్మిచెట్లుకు పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-10-27T11:16:25+05:30 IST