దసరా వచ్చిందయా..

ABN , First Publish Date - 2020-10-25T05:43:47+05:30 IST

శరన్నవరాత్రుల మరుసటి రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ నమవి నాటి ముహూర్తం ప్రాశస్త్య మైంది. అందుకే ఈ రోజును విజయదశమి అంటారు

దసరా వచ్చిందయా..

విజయాన్ని అందించే విజయదశమి పండుగ నేడు

శమీ వృక్షాన్ని పూజించే రోజు.. నవరాత్రి ఉత్సవాలకు ముగింపు

కొవిడ్‌ ఆంక్షలతో రద్దయిన పారువేట ఉత్సవాలు

ఆలయాల్లో ఏకాంతంగా పూజలు


ఖమ్మం సాంస్కృతికం, అక్టోబరు 24:  శరన్నవరాత్రుల మరుసటి రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ నమవి నాటి ముహూర్తం ప్రాశస్త్య మైంది. అందుకే ఈ రోజును విజయదశమి అంటారు. ఈ విజయ ముహూర్తంలోనే శ్రీరామచంద్రుడు యుద్ధానికి బయలుదేరినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది. విజయుడు(అర్జునుడు) ఈ విజయ ముహూర్తంలోనే శమీవృం మీద తమ ఆయుధాలను తెచ్చి ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవుల మీద యుద్ధం సాధించినట్లు మహాహారత గాథలో  ఉంది. అతి ప్రాచీన కాలం నుంచి అనేక ఘన కార్యాలు ఈ విజయ ముహూర్తంలోనే సాధించినట్లు వాగ్మయంలో కనబడుతోంది. ప్రతిదినం కూడా ఎనిమిదవ మూహూర్తాన్ని విజయముహూర్తం అంటారు. శరన్నవరాత్రుల్లో చివరి రోజైన దశమి రోజున దసరా పండుగ జరుపుకొంటారు. తొమ్మిది రోజుల పాటు నరకాసుడిపై పోరాటం చేసిన అమ్మవారు దశమినాడు విజయం సాధించడంతో ఆ రోజును విజయదశమిగా జరుపుకోవడం ఆనవాయితీ.


చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకొనే విజయదశమి  పండుగ నేడు. తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగను ఈ సంవత్సరం కొవిడ్‌-19 నిబంధనల నడుమ ఆదివారం జరుపుకొనేందుకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రజసలు సిద్ధమయ్యారు. సాయంత్రం వేళలో శమీ పూజలు జరిపి ఆలయాల్లో ఇష్టదైవాలను దర్శించుకోనున్నారు.


పారువేట ఉత్సవాలు రద్దు

ఖమ్మం నగరంలోని జమ్మిబండపై దసరా సందర్భంగా ఆదివారం నిర్వహించాల్సిన పారువేట ఉత్సవాన్ని కొవిడ్‌ వ ల్ల రద్దు చేసినట్లు స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈవో మోత్కూరి జగన్మోహన్‌రావు శనివారం తెలిపారు. ప్రతీ సంవత్సరం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాల్లో భాగంగా జమ్మిబండపై భక్తులకు దర్శనం ఇస్తుండగా ఈసారి దర్శనాన్ని రద్దు చేశామని, గుట్ట ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహిస్తామని తెలిపారు.  


ప్రజలకు మంత్రి పువ్వాడ దసరా శుభాకాంక్షలు

ఖమ్మం కలెక్టరేట్‌: జిల్లా ప్రజలు దసరా పండుగ  పర్వదినాన్ని ఆనందదాయకంగా జరపుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగను జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ లింగాల కమల్‌రాజ్‌ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.  ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలను తెలిపారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి,  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్‌ బచ్చువిజయ్‌కుమార్‌, నగర మేయర్‌ డాక్టర్‌ జి. పాపాలాల్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు  జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  


చెడుపై మంచి సాధించిన విజయం: సింగరేణి సీఎండీ

 కొత్తగూడెం: విజయ దశమి పండగను చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రజలంతా ఎంతో గొప్పగా జరుపుకొంటారని సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  సూపర్‌వైజరీ సిబ్బంది, అధికారులు, కార్మిక నాయకులు, సింగరేణి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కాగా సింగరేణీకులు  26వ తేదీన దసరా జరుపుకోవాలని  జీఎం (పర్సనల్‌) ఆనందరావు తెలిపారు.  

Updated Date - 2020-10-25T05:43:47+05:30 IST