కొన్ని సార్లు భయమేస్తుంది

ABN , First Publish Date - 2020-09-20T05:35:41+05:30 IST

ఒక్క సారి ఫోన్‌ నెంబర్‌ బయటకు వచ్చిందా? ఎదురయ్యే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సామాన్య ప్రజలకే కాదు... సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇంతే! మనకు స్పామ్‌ కాల్స్‌ నుంచి రక్షణ కల్పించటానికి దూస్రా అనే యాప్‌ను తాజాగా విడుదల చేశారు...

కొన్ని సార్లు భయమేస్తుంది

ఒక్క సారి ఫోన్‌ నెంబర్‌ బయటకు వచ్చిందా? ఎదురయ్యే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సామాన్య ప్రజలకే కాదు... సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇంతే! మనకు స్పామ్‌ కాల్స్‌ నుంచి రక్షణ కల్పించటానికి దూస్రా అనే   యాప్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సమంత ఆన్‌లైన్‌ భద్రత గురించి తన ఆలోచనలను, అనుభవాలను నవ్యతో పంచుకున్నారు. ఆ విశేషాలివి..


ప్రతి సైట్‌ ‘మీ ఫొటోలు యాక్సెస్‌ చేయొచ్చా, మైక్రోఫోన్‌ , మెసేజ్‌లు, గ్యాలరీ యాక్సెస్‌ చేయొచ్చా!’ అని అడగగానే అన్నింటికీ ‘ఎస్‌’ ‘ఎస్‌’ అని చెప్పేస్తాం. దాని వల్ల వచ్చే సమస్యలెన్నో. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్‌ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు నా ఫోన్‌ నెంబర్‌కు-  ‘‘మీ అకౌంట్‌లో లాగిన్‌ అవటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు.. అది మీరేనా?’’ అనే సందేశం వస్తుంది. అప్పుడు చాలా భయమేస్తుంది. 


‘‘నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మధ్య సోషల్‌ డైలమా అనే ఒక డాక్యుమెంటరీ విడుదలయింది. దాన్ని చూస్తే భయమేస్తుంది. కానీ అందులో చూపించిందంతా నిజమే!  ప్రస్తుతం మన జీవితాలను ‘డేటా’ శాసిస్తోంది. చాలా మంది ‘ ‘మేము ప్రైవేట్‌ లైఫ్‌ జీవిస్తున్నాం’ అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఒక్క ఫోన్‌ నెంబర్‌ మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎవరికైనా ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామా.. మన వ్యక్తిగత సమాచారాన్ని బయట వ్యక్తుల చేతుల్లో పెట్టినట్టే. గతంలో నేను  యాప్స్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పుడు నా ఒరిజినల్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చేసేదాన్ని. ఆ తర్వాత నాకు రకరకాల ఫోన్‌కాల్స్‌ వచ్చేవి. 


‘మీరు నిజమైన సమంతనా’ అని అడిగేవారు. యాప్స్‌ మాత్రమే కాదు. ఒక రెస్టారెంట్‌కు ఫోన్‌ చేసి టేబుల్‌ బుక్‌ చేస్తే- పది రెస్టారెంట్ల నుంచి ఫోన్లు వచ్చేవి. ఇది కేవలం నా సమస్య మాత్రమే కాదు. బయటకు వెళ్లే ప్రతి అమ్మాయిది.. క్యాబ్‌ కావాలంటే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.. ఫుడ్‌ కావాలంటే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.. షాపింగ్‌కు వెళ్తే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.. ఇలా ఎక్కడైనా ఒక చోట నెంబర్‌ ఇస్తే చాలు.. తర్వాత పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. 




భయమేస్తుంది..

సోషల్‌ మీడియా వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి విషయానికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే దీనికీ మంచి, చెడు ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కోవిడ్‌ను తీసుకుందాం.  ప్లాస్మా దాతలను.. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను కలిపే వేదిక ఇదే కదా. ఇది మంచి కోణం. ఇక దీనిలో వచ్చే వార్తలు రకరకాలుగా ఉంటాయి. వాటిలో నిజానిజాలు నిర్ధారించుకోకుండా స్పందిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. మొదట్లో కేవలం తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్‌ చేసేదాన్ని కాదు. అయినా రకరకాల నెంబర్ల నుంచి కాల్స్‌ వచ్చేవి. చాలా చిరాకుపడేదాన్ని. ఇప్పుడు కాల్స్‌ తీయటం మానేసా. మా కుటుంబ సభ్యులు కూడా అవసరమైతే మెసేజ్‌ చేస్తారు. అప్పుడు వారికి నేనే కాల్‌ చేస్తా. 

Updated Date - 2020-09-20T05:35:41+05:30 IST