కొవిడ్‌ కాలంలో..

ABN , First Publish Date - 2020-09-19T06:05:20+05:30 IST

ఆరునెలలుగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు మనుషులను ఒక్కో విధంగా బాధిస్తున్నాయి.

కొవిడ్‌ కాలంలో..

ఆరునెలలుగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు మనుషులను ఒక్కో విధంగా బాధిస్తున్నాయి. ఉపాధి ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద పడిన దెబ్బలు ఒక ఎత్తు. మనుషుల సంచారం మీద, మానవ సంబంధాల మీద, అభిరుచుల మీద, మొత్తంగా జీవనసరళి మీద కనిపిస్తున్న ప్రభావం మరొక ఎత్తు. ఒక రకమైన జీవితానికి అలవాటు పడినవారు అకస్మాత్తుగా కొత్త ఆపదలకు, కొత్త పరిస్థితులకు సిద్ధపడవలసి వచ్చింది. ఒక వైరస్‌ కారణంగా ఏర్పడిన ఈ సన్నివేశాన్ని దాటుకున్న తరువాత మనుషులు మళ్లీ మునుపటిలాగా మారిపోతారా? స్థితిగతులు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటాయా?


సినిమాహాళ్లు మూతపడడంతో, ఆధునిక భారతీయ జీవనసరళిలో ఒక ముఖ్యమైన అంశం మాయమైనట్టు అయింది. సినిమాహాల్‌కు వెళ్లడమంటే, కేవలం సినిమా చూడడమే కాదు, అదొక విహారం. కుటుంబంతో వెళ్లే వాళ్లకయినా, స్నేహితులతో వెళ్లే వాళ్లకయినా అది వినోదంలో భాగం. దాని చుట్టూ అనేక ఇతర ఉప అంశాలు ముడిపడి ఉంటాయి. ఆ సమయంలో మనుషులు తాము పని చేస్తున్నామనో కష్టపడుతున్నామనో కాక, జీవితాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటారు. ఇప్పుడు సినిమాలను మరో రూపంలో చూస్తూ ఉండవచ్చు. కలిగిన వారు పెద్దపెద్ద తెరలు కలిగిన స్మార్ట్‌ టీవీలలో హోమ్‌ థియేటర్‌ హంగులతో ఓటీటీ వేదికల మీద చూస్తూ ఉంటారు. మధ్యతరగతి వారు కేబుల్‌ టీవీ, డిటిహెచ్‌ వేదికలను ఆనందించగలుగుతారు. అధిక సంఖ్యాకులు, తమ ఇరుకు నివాసాలలోనే, చిన్న తెరల టీవీల మీదికే ఉన్నత స్థాయి పరికరాలను జోడించి, వినోదాన్ని చూడడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటికప్పుడు తాజాగా కొత్తకొత్త వినోదాలను అందించే పరిశ్రమ కూడా మూతపడడం వల్ల, కొత్త సినిమాలు లేక, కొత్త సీరియళ్లు రాక కొంత ఇబ్బంది కలిగింది. అప్పుడిక, తప్పనిసరిగా వినోదాన్ని వెదుక్కోవలసి వచ్చింది. ఇంగ్లీషు సినిమాలు, మలయాళ సినిమాలు, తమిళ సినిమాలు వెదుక్కుని వెదుక్కుని మరీ చూశారు. వాట్సప్‌లలో, ఫేస్‌బుక్‌లలో తాము చూసిన సినిమాల సంగతులను షేర్‌ చేసుకుని, వాటికి ప్రచారం కల్పించారు. 


రేపు, మళ్లీ సినిమాహాళ్లు తెరుచుకుంటే, కొత్త సినిమాలు వస్తే, ఈ మధ్యకాలంలో అలవాటు తప్పిన, అభిరుచి పెరిగిన ప్రేక్షకులు ఈ హీరోలను, ఈ కథలను, ఈ సినిమాలను ఇష్టపడతారా? వైరస్‌ భయం ఇంకా మిగిలి ఉంటే, దాని గురించి భయపడడం కాక, నాణ్యతా కారణాలతో మన సినిమా ఉత్పత్తులను, వినోద చానెళ్ల ఉత్పత్తులను ఇష్టపడకపోతే? అదే జరగాలి. అప్పుడే మన వినోద కార్యక్రమాల స్థాయి పెరిగే అవకాశం ఉన్నది. మూస, వెకిలి, నీచ, హీన అభిరుచులు మాయమయ్యే అవకాశమూ ఉన్నది. 


వార్తా పత్రికలకు కూడా కొంత ప్రమాదం ఏర్పడింది. కరోనా వచ్చిన కొత్తల్లో ఉన్న రకరకాల అపోహల వల్ల వార్తాపత్రికలను తెప్పించుకోవడానికి కొందరు భయపడ్డారు. బయటికే వెళ్లకుండా, తలుపులు మూసుకుని జీవించే రోజుల్లో, పత్రికలు మాత్రం అవసరమా అనిపించడం సహజమే. కానీ, ఏం జరుగుతుందో తెలియాలి, ఎప్పటికి నిష్కృతో తెలియాలి, జబ్బు మనదాకా వస్తే ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో సమాచారం కావాలి కదా. వార్తాపత్రికలను దూరం చేసుకుంటే మరో ప్రత్యామ్నాయం ఉండాలి కదా? తెలుగు సినిమాలు ఆగిపోతే, మలయాళ సినిమాలు చూసి అభిరుచి పెంచుకున్నట్టు, పత్రికలకు బదులు మరో ఉన్నతాభిరుచి వేదిక కావాలి. దురదృష్టవశాత్తూ, అటువంటివేవీ లేవు. పత్రికల అదృష్టవశాత్తూ, టీవీ న్యూస్‌ చానెళ్లు, సామాజిక మాధ్యమాలు నమ్మకానికి బారెడు దూరంలో, అసత్యాలకు, ఆవేశాలకు వేదిక అవుతున్నాయి. అందువల్ల, దూరమైన పాఠకులు పత్రికలకు తిరిగి దగ్గర కాక తప్పలేదు. ప్రపంచాన్నంతా మన చేతుల్లోకి తీసుకోవడానికి, నిశితంగా విశ్లేషించే మనసుని సంతృప్తి పరచడానికి పత్రికను మించినది ఏమున్నది?


ఈ కరోనా కాలంలో పుస్తక ప్రచురణ కర్తలు, విక్రేతలు, ఆ రంగంలో ఉన్న సిబ్బంది అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్నవారు ఎలక్ట్రానిక్‌ పఠన ఉపకరణాలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మనుషుల మధ్య చర్చలకైనా, సమావేశాలకైనా, చివరకు చదువుకోవడానికైనా స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లే ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితిని దాటాకా, తిరిగి మనుషులు మామూలు భౌతిక సమావేశాలు పెట్టుకుంటారా? తిరిగి భౌతికమయిన పుస్తకాలు చదువుతారా? కరోనా కాలంలో, ఆన్‌లైన్‌లో పుస్తకాలు తెప్పించుకునే వారి సంఖ్య సంతృప్తికరంగానే ఉన్నదని వింటున్నాము. ఆశ్చర్యకరంగా, పుస్తకాల కోసం గూగుల్‌లో అన్వేషణలు ఈ మధ్య భారీగా పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగాను, అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలతోను పోల్చినప్పుడు, భారతదేశంలో పుస్తకాల కోసం గూగుల్‌ అన్వేషణలు చాలా తక్కువే. కానీ, కరోనాకాలంలో ఈ అన్వేషణ బాగా పెరిగింది. పుస్తక అన్వేషణలు భారతదేశంలో దక్షణాది రాష్ట్రాలలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఉత్తరాఖండ్‌లో ఎక్కువ. గూగుల్‌ ట్రెండ్స్‌ డేటా ప్రకారం, కాల్పనిక సాహిత్యంలో ప్రేమ, ఉత్కంఠ అంశాల కథలు, నవలలను, కాల్పనికేతర వచనంలో ఆత్మకథలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారట. భౌతిక పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవడం కంటే, ఇంటర్నెట్‌లో ఉచితంగా దొరికే డౌన్‌లోడ్స్‌ మీదనే ఆసక్తి ఎక్కువట. ఏమయితేనేం, పఠనం మీదకు దృష్టి మళ్లడం మంచిదే కదా? u

Updated Date - 2020-09-19T06:05:20+05:30 IST