దసరా పూట.. అశ్వాల పారు వేట

ABN , First Publish Date - 2022-10-02T05:23:09+05:30 IST

మద్దికెరలో విజయదశమి రోజున రాజవంశీకులు అశ్వాల పారు వేట నిర్వహిస్తున్నారు.

దసరా పూట.. అశ్వాల పారు వేట
అశ్వాలపై వెళ్లుతున్న యాదవరాజులు

  1. ఈ నెల 5న గుర్రాలపై యాదవజారుల స్వారీ
  2. నేటికీ కొనసాగుతున్న రాచరిక సాంప్రదాయం

మద్దికెర, అక్టోబరు 1: మద్దికెరలో విజయదశమి రోజున రాజవంశీకులు అశ్వాల పారు వేట నిర్వహిస్తున్నారు. ఒక రోజు రాజులుగా ఉంటూ పెద్దనగిరి, చిన్ననగిరి, యమననగిరి అనే మూడు కుటుంబాల వారు నేటికి రాచరికపు సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వం రాజుల కాలంలో ఈ మూడు కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న పాత ఆచార సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అందులో అశ్వాల పారువేట ఒకటి. యాదవరాజుల వంశీకులు దసరా పండుగ రోజున గుర్రాలపై కూర్చుని తలపాగా ధరించి రాచరికపు వస్తువులతో ఖడ్గ మేళతాళాలతో, సైనికులతో మద్దికెరకు మూడు కిలోమీటర్ల దూరంలోని నాటి యాదవరాజు నిర్మించిన బొజ్జనాయనపేటలోని బోగేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి తిరిగి మద్దికెరకు చేరుకుంటారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉంటారు. యాదవరాజులు గ్రామం నుంచి బయలుదేరేటప్పుడు మద్ది కులస్తులు సైన్యం వల్లే ఆయుధాలు ధరించి అంగరక్షకులుగా గ్రామ శివారుల వరకు వెళతారు. బొజ్జనాయనపేటలోని బోగేశ్వరస్వామి ఆలయంలో ఈ మూడు కుటుంబాల వారు పూజలు నిర్వహించిన అనంతరం మద్దికెరకు గుర్రాలపై స్వారీ చేసుకుంటూ వస్తారు. ఈ పోటీల్లో మొదటిగా వచ్చిన వారు విజయం సాధించినట్లుగా పరిగణలోకి తీసుకొని వేడుకలు చేసుకుంటారు. పూర్వం నుంచి యాదవరాజులుగా పిలువబడి పాలేగాళ్లుగా వ్యవహరించిన వాళ్లకు ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం. 

ఫ 5న అశ్వాల పారువేట ః 

అక్టోబరు 5వ తేదీన సాయంత్రం మద్దికెరలో దేశంలో ఎక్కడా లేని విధంగా గుర్రాల పారువేట జరుగుతుంది. సాంప్రదాయ ప్రకారం సాయంత్రం గుర్రాల పారువేట ఉంటుందని యాదవరాజులు తెలిపారు. 

ఫ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాంః బోజరాజు, యమన్ననగిరి, మద్దికెర

శతాబ్దాల నుంచి పెద్దలు పాటించిన సాంప్రదాయాన్నే మేము కొనసాగిస్తున్నాం. విజయ దశమి రోజున ఈ అశ్వాలపారువేట మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. 

ఫ ఇది పెద్ద పండుగ ః జయరామరాజు, పెద్ద నగిరి

మూడు దశాబ్దాలుగా యాదవరాజుల మూడు కుటుంబాలు విజయ దశమి రోజున నిర్వహించే అశ్వాల పారువేట పెద్దపండుగ లాంటిది. అందులో మాది ఒక కుటుంబం. సాంప్రదాయాన్ని మాత్రం మరువకూడదని నిర్వహిస్తున్నాం.

ఫ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నం ః నీలకంఠరాయుడు, మాజీ ఎంపీపీ, చిన్ననగిరి, మద్దికెర 

గ్రామంలో మా పూర్వీకుల వల్ల వచ్చిన ఈ వేడుకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకుంటున్నాం. మూడు వర్గాల వారికి ఈ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకం. ఇలాంటి వేడుక రాష్ట్రంలో మరెక్కడా లేదు. ఇదే సమయంలో మైసూరులో రాజవంశీయులు ఏనుగుపై ఊరేగితే ఇక్కడ గుర్రాలపై వెళ్లడం ఆనవాయితీ. ఈ వేడుక మా ప్రాంత ప్రజలకు ప్రత్యేకం.


Updated Date - 2022-10-02T05:23:09+05:30 IST