నిద్రాహారాలు లేని నిరాశ్రయులు

ABN , First Publish Date - 2022-05-20T06:13:56+05:30 IST

నిద్రాహారాలు లేని నిరాశ్రయులు

నిద్రాహారాలు లేని నిరాశ్రయులు
అర్జునవీధిలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న భక్తులు

ఆంధ్రజ్యోతి విజిట్‌

ఇంద్రకీలాద్రిపై వసతి లేక భక్తుల అవస్థలు

తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు

దూరప్రాంతాల భక్తులకు సదుపాయాలు కల్పించలేని దుస్థితి

రాత్రిపూట ఉచిత ప్రసాదం సైతం నిలిపివేత

ఆలయ ప్రాంగణాలు, షెడ్లలో కునుకుపాట్లు

ఓవైపు ఉక్కపోత.. మరోవైపు దోమల బెడద

ఏళ్లు గడుస్తున్నా మొద్దునిద్ర వీడని అధికారులు


ఆకలేస్తే కడుపు నిండదు.. నిద్రవస్తే నీడ దొరకదు.. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు అంతా రోతరోత.. ఆవలిస్తే దోమల బెడద.. ఆదమరిస్తే ఏమవుతుందోననే భయం.. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న, రెండో అతిపెద్ద ఆలయమైన ఇంద్రకీలాద్రిపై రాత్రిపూట భక్తులు పడే అవస్థలివి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి.. దుర్గమ్మను దర్శించి.. మొక్కులు చెల్లించి.. తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నిద్రించడానికి సరైన జాగాలేక, ఆకలి తీరే దారిలేక వేలమంది భక్తులు పడుతున్న ఇబ్బందులు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో బయటపడ్డాయి. అధికారులు మారుతున్నా.. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు నిధులు విడుదల చేసినట్టు చెబుతున్నా.. ఏళ్ల తరబడి దుర్గమ్మ భక్తుల ఇబ్బందులు తీరిందీ లేదు.. నిద్రాహారాలు దొరికిందీ లేదు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమనే పేరున్న దుర్గగుడిలో భక్తులకు కడుపు నిండా భోజనం, కంటినిండా నిద్ర కరువైంది. ఒక రాత్రి నిద్రచేసి మొక్కులు చెల్లించుకునేందుకు దూరప్రాంతాల నుంచి రోజూ వేలసంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి వస్తున్నారు. కానీ, ఇక్కడ సరైన ఏర్పాట్లు లేక అవస్థలు పడుతున్నారు. నిద్రించడానికి సరైన వసతి లేకపోవడంతో మహామండపం ఎదురుగా, కనకదుర్గానగర్‌లో దాతలు నిర్మించిన షెడ్లలోనో, పెర్గోలాలు, ఆరుబయట కటిక నేలపైనో నిద్రించాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండటం, దోమల బెడద కారణంగా ఆరుబయట కూడా కునుకురాని దుస్థితి ఎదురైంది. 

ఎక్కడ నిద్రించాలి..?

ఇంద్రకీలాద్రిపై రాత్రి బస చేయడానికి ఎలాంటి కాటేజీలు లేవు. దీంతో భక్తుల కోసం గతంలో మల్లికార్జున మహామండపంలోని ఒకటి, నాల్గో అంతస్థుల్లో సేదతీరే అవకాశం కల్పించేవారు. మూడేళ్ల క్రితం కరోనా విజృంభించడంతో ఆలయంలో దాదాపు రెండేళ్లపాటు రాత్రిపూట నిద్ర చేసేందుకు అనుమతి నిరాకరించారు. ఆరు నెలలుగా కరోనా ప్రభావం తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భక్తులకు వసతి, కనీస సౌకర్యాల కల్పన గురించి అధికారులు పట్టించుకోవడమే మానేశారు. ఆలయ పరిపాలన కార్యాలయాన్ని మహామండపం నాల్గో అంతస్థులోకి మార్చడంతో భక్తులు నిద్ర చేయడానికి ఒకటో అంతస్థు ఒక్కటే మిగిలింది. ఈ హాల్లో ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు. పక్కనే ఉన్న మరుగుదొడ్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. కటిక నేలపై నిద్రపోలేక, ఫ్యాన్లు తిరగక, దోమల బెడదను తట్టుకోలేక భక్తులు తెల్లవార్లూ నరకయాతన అనుభవిస్తున్నారు. వివాహాలు చేసుకోవడానికి కూడా ఈ అంతస్థులోనే అవకాశం కల్పిస్తుండటంతో రాత్రిపూట భక్తుల నిద్రకు భంగం కలుగుతోంది. దీంతో భక్తులు ఆలయం బయట షెడ్ల కింద, పెర్గోలాల కింద, ఆరుబయట కటిక నేలపై కూర్చోలేక, పడుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. 

రాత్రిపూట భోజనం పెట్టరా?

ఇంద్రకీలాద్రిపై ఎలాంటి హోటళ్లు లేవు. గతంలో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రిపూట మహారాజగోపురం ఎదురుగా ఉచిత ప్రసాదంగా కదంబం (సాంబారన్నం), దద్ద్యోజనం (పెరుగన్నం) పంపిణీ చేసేవారు. ఆ ప్రసాదాన్ని ఆరగించి భక్తులు హాయిగా నిద్రపోయేవారు. ఈ ఉచిత ప్రసాదాలను పునరుద్ధరించకపోవడంతో భక్తులు ఖాళీ కడుపుతోనే ఉంటున్నారు. రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొండపై అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలు భారీఎత్తున విరాళాలు ఇస్తున్నారు. 

అన్నదాన పథకానికి చెందిన రూ.90 కోట్లకు పైగా డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. వాటిపై వచ్చే వడ్డీతో రోజూ ఆలయంలో పదివేల మందికి పైగా భక్తులకు అన్నదానం చేసే అవకాశం ఉన్నప్పటికీ స్థలాభావం పేరుతో రోజుకు 2 వేల నుంచి 3 వేల మందికే ప్రసాదాలు పెడుతున్నారు. ఆలయంలో నిద్రచేసి మొక్కులు, ముడుపులు చెల్లించుకోవడానికి చంటిపిల్లలు, కుటుంబ సభ్యుల సహా సుదూరప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు కాసింత ప్రసాదమైనా అందని దుస్థితి కొండపై ఉంది. ఈ దయనీయ పరిస్థితులను చూసైనా ఆలయ అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి రాత్రిపూట ఉచిత ప్రసాద పంపిణీని పునరుద్ధరించాలని, కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. 











Updated Date - 2022-05-20T06:13:56+05:30 IST