48 గంటలైనా..

ABN , First Publish Date - 2022-05-12T06:04:53+05:30 IST

48 గంటలైనా..

48 గంటలైనా..

దుర్గగుడిలో బంగారం దొంగిలించిన కేసులో పురోగతి నిల్‌

ఇంటి దొంగలను పట్టుకోలేని అధికారులు, పోలీసులు

గతంలో చాలా ఘటనల్లోనూ ఇంతే..

అందుకే ప్రతిసారీ హుండీల లెక్కింపులో చోరీలు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై హుండీల లెక్కింపు సమయంలో బాత్‌రూమ్‌లో రెండు ప్లాస్టిక్‌ కవర్లలో బంగారం దొరికి 48 గంటలైనా అధికారులు ఇంటిదొంగలను పట్టుకోలేకపోయారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని చూసి మంగళవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవస్థానం అధికారులు దొంగను పట్టుకునేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. వన్‌టౌన్‌ పోలీసుల దర్యాప్తులోనూ ఎలాంటి పురోగతి లేదు. ఈ విషయంపై పోలీసులు గానీ, ఆలయ అధికారులు గానీ మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. అంతా గప్‌చుప్‌గా ఉండటంలో అసలు దొంగలు ఎవరనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గతంలోనూ ఇంతే.. 

రెండేళ్ల క్రితం మహామండపం ఆరో అంతస్థులో హుండీలు లెక్కిస్తుండగా, పారిశుధ్య కార్మికురాలి కుటుంబ సభ్యులు రూ.లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను చాకచక్యంగా కాజేశారు. నిఘా అధికారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అంతకుముందు రెండేళ్ల క్రితం కేశఖండనశాల ఉద్యోగి, అతని భార్య కలిసి బంగారు ఉంగరాన్ని కాజేసి భద్రతా సిబ్బందికి దొరికిపోయారు. ఆ తర్వాత మరోసారి హుండీల ఆదాయం లెక్కింపునకు సేవకురాలిగా వచ్చిన ఇద్దరు మహిళలు రూ.60 వేలతో పాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన చిన్నచిన్న బంగారు ఆభరణాలను చోరీ చేసి భద్రతా సిబ్బందికి దొరికిపోయారు. అలాగే, కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలు చోరీకి గురైన ఘటనలోనూ ఇదే జరిగింది. అప్పటి దుర్గగుడి ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఆరోపణలు వెల్లువెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫిర్యాదు చేశారు. ఇలా అమ్మవారి ఆలయంలో తరచూ దొంగతనాలు వెలుగుచూస్తున్నా దుర్గగుడి అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, దొంగలను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా దొంగలను వదిలేస్తుండటం వల్లే అమ్మవారి సొమ్మును ఇంటిదొంగలే కాజేసేందుకు రకరకాల అడ్డదారులు వెతుకుతున్నారు. 

Read more