స్వాతంత్య్ర పోరాటంలో దుర్గం యోధులు

ABN , First Publish Date - 2022-08-12T05:45:33+05:30 IST

దేశ స్వాతంత్య్ర పోరాటంలో నియోజకవర్గంలోని కొందరు యోధులు ప్రధాన భూమిక పోషించారు. వారు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో అమరులుగా నిలిచిపోయారు.

స్వాతంత్య్ర పోరాటంలో దుర్గం యోధులు
స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకం

  రాయదుర్గం, ఆగస్టు 9: దేశ స్వాతంత్య్ర పోరాటంలో నియోజకవర్గంలోని కొందరు యోధులు ప్రధాన భూమిక పోషించారు. వారు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో అమరులుగా నిలిచిపోయారు.  స్వాతంత్రోద్యమంలో పోరాడి కారాగారాల్లో గడిపి చరిత్ర పుటల్లో నిలిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన వరదా చెన్నప్ప, తిప్పయ్య జాతిపిత మహాత్మాగాంధీ వెంట నడిచి కర్ణాటకలోని కార్వార్‌ జైలులో శిక్ష అనుభవించారు. రాయదుర్గంకు చెందిన ఆర్‌ నాగన్నగౌడ్‌ 1941లో వ్యక్తిగత సత్యాగ్రహం చేసి తమిళనాడులోని తిరుచానూరులో ఏడాదిపాటు కారాగారంలో గడిపినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం అప్పట్లోనే రూ. 400 మేర జరిమానా విధించింది. రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో  స్వాతంత్య్ర సమరయోధుల పోరాటానికి గుర్తుగా 1972లో  ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ప్రముఖ గాంధేయవాది, తొలి ఎమ్మెల్యే జీఎస్‌ నాగభూషణం 1941లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని బెంగళూరు కేంద్ర కారాగారంలో మూడు నెలల జైలుశిక్షను అనుభవించారు. గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన సత్యభామదేవి కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1942లో శ్రీకాకుళం కోర్టు మేజిస్ర్టేట్‌ ఈమెకు రెండు నెలల జైలుశిక్ష విధించడంతో రాయవేలూరు, కడనూరు కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవించారు. ఈమె భర్త వైహెచ్‌ సుబ్బారావు కూడా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో మూడు నెలల కారాగార శిక్షను అనుభవించారు. వీరిద్దరూ స్వాతంత్య్ర సమరయోధులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఓబుళాచారి పేరును ఒక కాలనీకి పెట్టి గౌరవించారు. గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన దామోదర్‌సింగ్‌, రాయదుర్గం మండలం కాశీపురానికి చెందిన జగన్నాథసింగ్‌, ఎం వీరయ్య, రాయంపల్లికు చెంది న ఎన్‌సీ శేషాద్రి నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్టా రామప్ప, వైహెచ్‌ సుబ్బారావులు సైతం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 


21 ఏళ్ల ప్రాయంలోనే పోరుబాట పట్టిన బాబాసాబ్‌

కణేకల్లుకు చెందిన యు బాబాసాబ్‌ 21 ఏళ్ల ప్రాయంలోనే తాను చేస్తున్న గోల్డ్‌స్మిత్‌ పనిని వదిలిపెట్టి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. సహాయ నిరాకరణోద్యమం, సైమన కమిషనకు వ్యతిరేకంగా పోరాటం, ఉప్పు సత్యా గ్రహం వంటి ఉద్యమాల్లో తన వంతు పాత్రను పోషించాడు. ఇక బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారనే ఉద్దేశంతో 1941లో బాబాసాబ్‌ను అరెస్టు చేసి బళ్లారి సెంట్రల్‌ జైలులో ఏడు నెలలు పాటు ఉంచారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన బాబాసాబ్‌ 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలోను పాల్గొన్నారు. ఈ విధంగా దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన బాబాసాబ్‌ 1989 అక్టోబర్‌ మాసంలో తుది శ్వాసను విడిచారు.  ఉరవకొండకు చెందిన జీసీ చంద్రన్న, మాజీ ఎమ్మెల్యే బుక్కిట్ల బసప్పతో పాటు నాగిరెడ్డిపల్లికి చెందిన కట్టా రామప్పలు ఈయన సమకాలీనులుగా దేశం కోసం పోరాడి జైలు జీవనం గడిపారు. అలాగే ప్రభుత్వం ఈయనకు తామ్ర పత్రాన్ని కూడా అందజేసింది. ఉంతకల్లు బాబాసాబ్‌ భార్య హుస్సేన్‌బీతో పాటు ముగ్గురు కుమారులు ఉండగా అందులో పెద్ద కుమారుడైన వాహబ్‌ సాబ్‌ వ్యవసాయాధికారిగా పనిచేసి  ఉద్యోగ విరమణ పొందారు.  


త్యాగాలకు గుర్తుగా శిలాఫలకం ఏర్పాటు 

కణేకల్లులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో స్వాంతంత్య్ర సమర యోధుల త్యాగాలకు గుర్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా 1972 ఆగస్టు 15న ప్రభుత్వం  ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేసింది. కణేకల్లు పంచాయతీ సమితిలో ఉంటూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఏ నారాయణప్ప, రాకెట్ల హనుమంతరావు, ఉంతకల్లు బాబాసాబ్‌, మోదుపల్లి వెంకటరమణప్ప, కల్లూరు ఓబుళరెడ్డి, కట్టా రామప్ప, కొండారెడ్డి తదితరుల పేర్లను శిలాఫలకంపై చెక్కారు. 1972లో ఏర్పాటు చేసిన శిలాఫలకం నేటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉండటం గమనార్హం. ఈ శిలాఫలకాన్ని కాపాడుతూ భవిష్యత తరాలు వారి త్యాగాలను గుర్తించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


 

వీరులారా... మీరెక్కడ..? 

స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల కోసం వెతుకులాట 

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న దశలో దేశమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన మహాత్ములను స్మరించుకునేందుకు వీలుగా వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కానీ నియోజక వర్గంలో మహాత్ముల విగ్రహాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్ర మంలో భాగంగా 15 రోజుల పాటు డ్వామా ఆధ్వర్యంలో రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 11వ రోజైన గురువారం మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాల్సి ఉంది. కాగా మూడు రోజుల నుంచి విగ్రహాల కోసం ఆరా తీసిన అధికారులకు ఆరు చోట్ల మాత్రమే గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలు కనిపించాయి. 2.4 లక్షల ఓటర్లు, 115 గ్రామా లు, 5 మండలాలతో పాటు రాయదుర్గం పురపాలక సంఘం ఉన్న నియోజకవర్గంలో కేవలం ఆరు చోట్ల మహాత్ముల విగ్రహాలు ఉండటం బాధాకరం. అదికూడా కూడళ్లలో కాకుండా ఎక్కడో పాఠశాలల్లో ఉన్నట్లు గుర్తించారు. రాయదుర్గంలో ఉన్న అంబేడ్కర్‌, మహాత్మా గాంధీ విగ్రహాలను రోడ్డు విస్తరణలో తొలగించి మూలన పడేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని మొలకాల్మూరు రోడ్డులోని ఎస్సీ కాలనీ వద్ద, గాంధీ విగ్రహాన్ని పాత మున్సిపల్‌ కార్యాలయంలో ఉంచారు.  ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ లబ్ధి కోసం పార్టీలు వారి నేతల విగ్రహాలను గ్రామాలలో ప్రతిష్ఠించి నిత్యం నివాళులర్పిస్తూ స్మరించుకుంటున్నారు. కానీ స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల కోసం  వెతుక్కోవాల్సి రావడం ఎంత దయానీయం. 


Updated Date - 2022-08-12T05:45:33+05:30 IST