పరువు తీస్తున్నారు! దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో మద్యం అక్రమ రవాణా

ABN , First Publish Date - 2020-10-01T16:14:35+05:30 IST

కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా కొలిచే దుర్గమ్మ దేవస్థానానికి పాలకమండలి..

పరువు తీస్తున్నారు! దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో మద్యం అక్రమ రవాణా

సభ్యురాలి భర్త, డ్రైవర్‌ను అరెస్టు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరో

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా వెనకేసుకొస్తున్న పాలకమండలి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా కొలిచే దుర్గమ్మ దేవస్థానానికి పాలకమండలి సభ్యులు వారు. ఆధ్యాత్మికత, సేవాభావం ఉన్న వారిని నియమించాల్సిన పదవుల్లో రాజకీయ నాయకుల అనుచరులు తిష్టవేస్తే పరిస్థితి ఏమిటో బుధవారం ఘటనతో తేటతెల్లమైంది. దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఉన్న చక్కా నాగవెంకట వరలక్ష్మికి చెందిన కారులో రూ.40వేల విలువ చేసే 283 మద్యం సీసాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరలక్ష్మి భర్త, కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తరచూ మద్యం తీసుకొచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం ఉండడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. రోజూ మాదిరే తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి కారును ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన కొద్దిసేపటికే పోలీసులు దాడి చేయడం గమనార్హం. 


గతంలో అలా.. ఇప్పుడిలా..

టీడీపీ హయాంలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలిగా ఉన్న ఒకరిపై చీరలు అపహరించారన్న ఆరోపణలు వచ్చాయి. సీసీ ఫుటేజీ పరిశీలించగా, ఆరోపణలు రుజువు కాలేదు. కానీ నాటి టీడీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యురాలిని పాలకమండలి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం దుర్గగుడి పవిత్రతకు భంగం వాటిల్లేలా సాక్షాత్తు ఈవో, పాలక మండలి సభ్యులే వ్యవహరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అమ్మవారి ఉత్సవ రథంపై మూడు సింహాల మాయం ఘటనను ఈవో ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా వ్యవహరించినా ఆయనపై చర్యల్లేవు.


దేవదాయ శాఖ మంత్రి అండ ఉండటం వల్లే ఈవో చర్యలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన ఉంది. తాజాగా పాలకమండలి సభ్యురాలి కారులో మద్యం అక్రమ రవాణా జరుగుతున్నా, ఘటనను ఖండించాల్సిన పాలకమండలి పెద్దలు సభ్యురాలిని వెనకేసుకొచ్చేలా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలకు ఉపక్రమించాలని భక్తులు కోరుతున్నారు. 




Updated Date - 2020-10-01T16:14:35+05:30 IST