కొండంత భక్తితో..

ABN , First Publish Date - 2021-10-18T06:07:21+05:30 IST

దసరా ఉత్సవాలు ముగిసినా భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతూనే ఉంది.

కొండంత భక్తితో..
దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఉత్సవ సందడి

భారీగా తరలివచ్చిన భక్తులు 

భవానీ భక్తులకు ఉచిత దర్శనం 


దసరా ఉత్సవాలు ముగిసినా భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతూనే ఉంది. భవానీ మాల ధరించి, నలభై రోజులపాటు కఠోర నియమ నిష్టలతో దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు కొండంత భక్తితో తరలివస్తూనే ఉన్నారు. వారి రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కగా, పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూనే ఉన్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిసి మూడు రోజులవుతున్నా దుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తూనే ఉన్నారు. దీంతో దేవస్థానంలో ఉత్సవ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. భవానీ మాల ధరించిన భక్తులు అమ్మ దర్శనం కోసం అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాధారణ భక్తులు కూడా ఎక్కువగానే వచ్చారు. దీంతో కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రూ.300, రూ.100 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, అందరికీ ఉచిత దర్శనం కల్పించారు. దసరా ఉత్సవాలు ముగిసిపోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఆలయ వేదపండితులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి స్నపనాభిషేకం, నిత్యార్చనలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నిజరూపమైన దుర్గాదేవి అలంకారం చేశారు. అనంతరం ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. 


కృష్ణమ్మ ఎరుపెక్కి..


దసరా ఉత్సవాలు ముగిసినా సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భవానీ భక్తులతో బెజవాడలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతూనే ఉంది. కృష్ణమ్మ పవిత్ర జలాలతో పుణ్య స్నానాలు చేసేందుకు వస్తున్న భవానీలతో కృష్ణాతీరం అరుణవర్ణం దాల్చింది. ఘాట్లు వారు వదిలేసిన వస్త్రాలతో ఎరుపెక్కాయి. ఉత్సవాల చివరి రెండు రోజుల్లో భారీగా తరలివచ్చిన భవానీ భక్తులు కొండ దిగువన సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి, సమీపంలోని ఘాట్లలో జల్లుస్నానాలు చేయడంతో స్నానఘాట్లలో ఆదివారం కూడా సందడి కనిపించింది. జల్లుస్నానాలు చేసిన భవానీ భక్తులు తాము ధరించిన ఎరుపు రంగు దుస్తులను ఘాట్లలోనే వదిలేయడంతో అక్కడ దుస్తులు గుట్టలుగా పేరుకుపోయాయి. ఘాట్లను పరిశీలించిన దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. 


లడ్డూ ప్రసాదాల కొరత 

భవానీ భక్తులు అమ్మవారి లడ్డూ ప్రసాదం దొరకక ఇబ్బందులు పడ్డారు. కొండ దిగువన కనకదుర్గానగర్‌లో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ల వద్ద ఆదివారం భవానీ భక్తులతోపాటు పలువురు సాధారణ భక్తులు ప్రసాదాల కోసం బారులు తీరడంతో అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులు దుర్గమ్మను దర్శించుకుని.. అమ్మవారి ప్రసాదాలను తీసుకువెళ్లి తమ ఇరుగు పొరుగు వారికి పంచిపెడతారు. అందుకోసమే వారంతా అమ్మవారి లడ్డూ ప్రసాదాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారి ప్రసాదాలను ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసేది భవానీ భక్తులే. అయితే వారు అడిగినన్ని లడ్డూలు లేవంటూ ఆలయ సిబ్బంది ఒక్కో భక్తునికి రెండు, మూడు లడ్డూలు మాత్రమే ఇవ్వడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆలయ అధికారులు ముందుచూపుతో వ్యవహరించనందునే ఈ సమస్య ఏర్పడుతోందని భక్తులు విమర్శిస్తున్నారు. 


నేటి నుంచి యథావిధిగా దర్శనాలు.. 

దసరా ఉత్సవాలు ముగిసినందున కనకదుర్గమ్మ సోమవారం నుంచి యఽథావిధిగా ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే ఆర్జిత సేవలు కూడా యథావిధిగా కొనసాగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల ఏడో తేదీ నుంచి దేవస్థానంలో ప్రతిరోజూ నిర్వహించే ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి హోమం తదితర ఆర్జిత సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2021-10-18T06:07:21+05:30 IST