పాపం పండింది..!

ABN , First Publish Date - 2021-04-08T06:27:49+05:30 IST

పాపం పండింది..

పాపం పండింది..!

అవినీతి ఈవోపై బదిలీ వేటు

రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు

కొత్త ఈవోగా భ్రమరాంబ నియామకం

ఈవో అక్రమాలపై ఆంధ్రజ్యోతి వరస కథనాలు

దుర్గగుడి ప్రతిష్ఠను కాపాడేందుకు రంగంలోకి ప్రభుత్వం

దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఏసీబీ, విజిలెన్స్‌తో తనిఖీలు

అక్రమాలు వాస్తవమేనని నిగ్గుతేల్చిన ఏసీబీ, విజిలెన్స్‌

ఈవోపై చర్యలకు మంత్రి అడ్డు చక్రం

15 మంది చిరుద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

దేవదాయ శాఖ తీరుపై వెల్లువెత్తిన విమర్శలు

ఎట్టకేలకు ఈవోపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): పాపం పండింది. ఇంద్రకీలాద్రిని అక్రమాల పుట్టగా మార్చిన ఈవో సురేశ్‌బాబుపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. కొత్త ఈవోగా భ్రమరాంబ నియమితులయ్యారు. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన సురేశ్‌బాబు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి అండదండలతో సుదీర్ఘకాలం ఈవోగా కొనసాగగలిగారు. 19 నెలలుగా పవిత్రమైన దుర్గమ్మ ఆలయం.. అక్రమాలకు, వివాదాలకు, అవాంఛనీయ ఘటనలన్నింటికీ కేంద్రంగా మారింది. 


దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అమ్మవారి ఉత్సవ రథానికి ఉండే నాలుగు వెండి సింహాల్లో మూడు మాయమైన ఘటనకు ఈవో నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తిన నాడే ఆయనపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ మంత్రి ఆయనపై ఈగ వాలకుండా చూశారు. వాస్తవానికి దుర్గగుడి ఈవోగా ఆర్‌జేసీ స్థాయి ఉన్నవారినే నియమించాలి. కానీ తాత్కాలిక పదోన్నతిపై డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సురేశ్‌బాబును అర్హత లేకున్నా ఆ పదవిలోకి వెలంపల్లి తీసుకొచ్చారన్న విమర్శలు వచ్చాయి. 


తొలి నుంచీ వివాదాలే.. 

సురేశ్‌బాబు ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంద్రకీలాద్రిని వివాదాలకు కేంద్రబిందువుగా మార్చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం దుర్గగుడి దత్తత ఆలయంలోనే ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్‌బాబు అక్రమమార్గంలో పదోన్నతులు దక్కించుకుంటూ అర్హతలు లేకపోయినా అనతి కాలంలోనే డిప్యూటీ కమిషనర్‌ స్థాయికి, ప్రస్తుతం ఆర్‌జేసీ స్థాయికి ఎదిగిపోయారని దేవదాయశాఖ ఉద్యోగులు చెబుతుంటారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమ్మవారి సన్నిధిలో రూ. కోట్ల విలువైన శానిటేషన్‌, సెక్యూరిటీ, ప్రొవిజన్స్‌ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 


మంత్రి అండదండలతోనే..

దేవదాయశాఖ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటంతో సురేశ్‌బాబు ఏడాదిన్నరగా ఇంద్రకీలాద్రిపై ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. భక్తులను పట్టించుకోకుండా వీవీఐపీలు, వీఐపీలు, అధికార పార్టీ నాయకుల సేవలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ముడుపుల సంస్కృతిని ప్రవేశపెట్టి అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి, రూ.కోట్లు వెనకేసుకున్నారని, నిర్మాణాలే చేయకుండా రూ.కోట్లలో బిల్లులు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టకుండా చేసినట్లు రూ.కోటి బిల్లు చేసుకున్నారు. చేసిన పనులను మళ్లీ చేసినట్టు చూపి బిల్లులు దండుకున్నారు. 


అడుగడుగునా ఆరోపణలే..

కరోనా సమయంలో ఆదాయం లేదని ఉద్యోగులను తొలగించేసిన ఈవో, దసరా ఉత్సవాల్లో కోట్లాది రూపాయల అమ్మ సొమ్మును వృథా చేశారు. చివరికి ఏసీబీ బృందాల తనిఖీల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూడగా, 15 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ఈవోపై చర్యలు తీసుకోలేదు. ఈవోనే అక్రమాలన్నింటికీ బాధ్యుడంటూ ఏసీబీ తుది నివేదికలో స్పష్టం చేయడంతో ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. అయితే రూ.కోట్లలో అవినీతికి పాల్పడిన వ్యక్తిపై బదిలీ వేటు వేసి సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయు. 


నూతన ఈవోగా భ్రమరాంబ

రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పనిచేస్తున్న డి.భ్రమరాంబను దుర్గగుడికి కొత్త ఈవోగా నియమించారు. ఈమేరకు దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జి.వాణీమోహన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్‌బాబు రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు. 


ఈవోను బదిలీతో కాపాడిందెవరు

దుర్గగుడిలో 19 నెలలుగా జరిగిన భారీ అవినీతిలో సూత్రధారి అయిన ఈవో సురేశ్‌బాబుపై ఎలాంటి చర్యలు లేకుండా బదిలీతో సరిపెట్టడం దారుణం. కోట్లాది రూపాయల అమ్మవారి సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలపై ఎందుకు సమగ్ర విచారణకు ఆదేశించలేదు? పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఈవో నిజంగా సచ్చీలుడైతే అదే ప్రజలకు తెలియజేయవచ్చు కదా..? రోజుల తరబడి ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేసి ఏ నిజాలు నిగ్గు తేల్చారో బహిరంగ పర్చాలి.. ఈవోపై చర్యలు తీసుకోకుండా కాపాడిన వ్యక్తి ఎవరో నిగ్గు తేల్చాలి..   

- పోతిన వెంకట మహేశ్‌, జనసేన నేత 

Updated Date - 2021-04-08T06:27:49+05:30 IST