కేక్‌ రభస

ABN , First Publish Date - 2020-11-30T06:48:01+05:30 IST

ఇంద్రకీలాద్రిపై పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు పుట్టినరోజు వేడుకలను కొంతమంది వైసీపీ నాయకులు నిర్వహించడం, పవిత్రమైన ప్రాంగణంలో కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్‌ను కట్‌చేసి, అందరికీ పంచడం వివాదాస్పదమైంది.

కేక్‌ రభస
దుర్గగుడిలోని తన చాంబర్‌లో కేక్‌ కట్‌ చేసి, అందరికీ తినిపిస్తున్న పాలకమండలి చైర్మన్‌ సోమినాయుడు

ఇంద్రకీలాద్రిపై పాలకమండలి చైర్మన్‌ పుట్టినరోజు వేడుకలు 

కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్‌ను 

కట్‌ చేశారని భక్తుల ఆగ్రహం

 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు పుట్టినరోజు వేడుకలను కొంతమంది వైసీపీ నాయకులు కొండపై నిర్వహించడం, పవిత్రమైన ప్రాంగణంలో కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్‌ను కట్‌చేసి, అందరికీ పంచడం వివాదాస్పదమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. 


ప్రభుత్వం గత ఫిబ్రవరిలో దుర్గగుడికి నూతన పాలకమండలిని నియమించిన సంగతి తెలిసిందే. పాలక మండలి సభ్యుల కోసం ఆలయ అధికారులు మహామండపం ఏడో అంతస్థుపై మహాగోపురానికి కుడివైపున ఇంతకు ముందు ఈవో కార్యాలయంగా వినియోగించిన గదిని కేటాయించారు. పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు ఆ గదిని తన వ్యక్తిగత, రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన పుట్టినరోజు వేడుకలను కొంతమంది వైసీపీ నాయకులు ఆలయంలోని చైర్మన్‌ చాంబర్‌లోనే నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్‌ను చైౖర్మన్‌ సోమినాయుడు కట్‌ చేసి అందరికీ తినిపించారు. ఇంద్రకీలాద్రిపై కాఫీ, టీ, పాలు విక్రయించుకునే కాంట్రాక్టుతో పాటు, అదనంగా వాటర్‌ బాటిల్స్‌, కూల్‌డ్రింకులు, టెట్రాప్యాకెట్లను విక్రయించుకునేందుకు పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయించి, అనుమతులు ఇప్పించినందుకు కృతజ్ఞతగా సదరు కాంట్రాక్టరు పైలా పుట్టినరోజు వేడుకలను నిర్వహించినట్లు ఆలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈవో సమక్షంలోనే ఇదంతా జరగడంతో భక్తులు మండిపడుతున్నారు.  

Updated Date - 2020-11-30T06:48:01+05:30 IST