వినూత్న దుర్గామండపం... మట్టిని కలుషితం కానీయవద్దంటూ ప్రచారం!

ABN , First Publish Date - 2022-10-03T15:11:43+05:30 IST

నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రదేశాలలో మండపాలు...

వినూత్న దుర్గామండపం... మట్టిని కలుషితం కానీయవద్దంటూ ప్రచారం!

నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రదేశాలలో మండపాలు ఏర్పాటు చేసి, దుర్గాదేవిని వైభవంగా అలంకరిస్తుంటారు. ఇక కోల్‌కతా విషయానికొస్తే అక్కడ జరిగే దుర్గాపూజల సంగతే వేరు. అయితే కోల్‌కతాలో ఏర్పాటుచేసిన ఒక దుర్గా మండపం భక్తులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా, చర్చల్లో నిలిచింది. ఈ దుర్గామండపానికి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం చేయించడమే కాకుండా, భూమిలో చోటుచేసుకుంటున్నరసాయన మార్పులు, వాటివల్ల కలిగే నష్టాలపై అక్కడి నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు. 




ఈ దుర్గామండపాన్ని బోస్‌లేన్ దుర్గా పూజా కమిటీ ఏర్పాటు చేసింది. ఒక థీమ్ ఆధారంగా ఈ మండపాన్ని అలంకరించారు. భూసార పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. ఈ ప్రత్యేక మండపాన్ని ఆర్కిటెక్ట్ అదితి చక్రవర్తి రూపొందించారు. మండపాన్ని వివిధ రంగుల మట్టితో అలంకరించారు. దీని థీమ్ 'అమ్మ'. ఈ ప్రత్యేక మండపం ద్వారా మట్టికి, అమ్మవారికి గల అన్యోన్య సంబంధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మానవ జీవితానికి మట్టితో దగ్గరి సంబంధం ఉంటుంది. ఉత్సవ కమిటీ నిర్వాహకుల్లో ఒకరైన సౌమెన్ దత్తా మాట్లాడుతూ.. ‘మట్టిని ఆధరంగా చేసుకుని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం.. చెట్లు నేలలో పెరుగుతాయి.. ఆ చెట్ల నుంచి ఆక్సిజన్‌ ​​అందుతుంది.. మనం మట్టిలో జీవిస్తున్నాం. మనకు మట్టితో ఉన్న సంబంధం చాలా లోతయినది, అందుకే భూమిని మాతృమూర్తిగా పూజిస్తుంటామన్నారు. ఈ దుర్గా మండపంలోకి రాగానే రకరకాల రంగుల మట్టి కనిపిస్తుంది. మండపంలో సంగీత వాయిద్య పరికరాలను అందంగా అలంకరించారు. మండపం నిర్మాణంలో పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2022-10-03T15:11:43+05:30 IST