మహాలక్ష్మీ నమోస్తుతే!!

ABN , First Publish Date - 2020-10-23T05:43:31+05:30 IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు...

మహాలక్ష్మీ నమోస్తుతే!!

  • దుర్గా నవరాత్రులు


నేటి అలంకరణ - శ్రీమహాలక్ష్మీదేవి


అశ్వయుజ శుద్ధ సప్తమి- శుక్రవారం


నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే!

శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!!


విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి ఆదిపరాశక్తి దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందంటారు పెద్దలు. మహాలక్ష్మి సర్వ మంగళకారిణి. పురాణ కథల ప్రకారం, సృష్టి ప్రారంభంలో వటపత్రశాయిగా ఉన్న శ్రీమహావిష్ణువు సన్నిధికి ‘పరాశక్తి’ తన అంశయైున లక్ష్మీదేవిని పంపగా ఆమె శ్రీమహాష్ణువును వరించింది.


ప్రపంచ సంరక్షణలో పాలు పంచుకొనే శక్తిగా విష్ణువు సన్నిధిలో నిలిచిపోయింది. తిరిగి పాల సముద్ర మధన సమయంలో ఆవిర్భవించి శ్రీమహావిష్ణువును లీలా కళ్యాణమాడి, దేవతలకు సామ్రాజ్యాన్ని ప్రసాదించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. మహా లక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం సంపత్ప్రదం. ఈ రూపంలో ఆమెను అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దర్శించడం వల్ల భక్తులకు ఐశ్వర్యం, విజయం లభిస్తాయనీ, పూజించడం వల్ల దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయన్నది భక్తుల నమ్మిక. 


నైవేద్యం: రవ్వ కేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం

అలంకరించే చీర రంగు: గులాబీ (పింక్‌)

అర్చించే పూలు: తామర పుష్పాలు

పారాయణ: చెయ్యాల్సింది: లక్ష్మీ స్తోత్రాలు

Updated Date - 2020-10-23T05:43:31+05:30 IST