బురఖాతో దుర్గా మాత చిత్రం... కోల్‌కతాలో కలకలం...

ABN , First Publish Date - 2021-09-16T23:48:40+05:30 IST

నగరానికి చెందిన విజువల్ ఆర్టిస్ట్ సనాతన్ దిండా విడుదల

బురఖాతో దుర్గా మాత చిత్రం... కోల్‌కతాలో కలకలం...

కోల్‌కతా : నగరానికి చెందిన విజువల్ ఆర్టిస్ట్ సనాతన్ దిండా విడుదల చేసిన ఓ చిత్రంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తల్లి వస్తోంది’ అంటూ విడుదలైన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. 


ఓ మహిళకు మూడో కన్ను ఉన్నట్లు ఈ చిత్రంలో చూపించారు. తలపై నుంచి ఓ ముసుగు ఉంది. ముఖానికి ధరించిన తెల్లని మాస్క్‌  నుంచి ఆమె పెదవుల లిప్‌స్టిక్ చెదరినట్లుగా కనిపిస్తోంది. ఆమె కన్నీటిపర్యంతమైనట్లు కనిపిస్తోంది.


ఈ చిత్రాన్ని దుర్గా పూజలకు ముందు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సనాతన్ దిండాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బురఖాలో దుర్గా మాత’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు. 


సెక్యులర్ పెయింటింగ్ 

ఈ నేపథ్యంలో దిండా మీడియాతో మాట్లాడుతూ, తాను విడుదల చేసిన చిత్రంలోని మహిళ ధరించినది ‘హిజాబ్’ అని చెప్పబోనని తెలిపారు. తన దృష్టిలో ఆమె ఓ మహిళ అని, దుర్గ మాత్రమే కాదని అన్నారు. తాను హిజాబ్, బురఖా అనే పదాలను ఎక్కడా వాడలేదన్నారు. దురహంకార పురుష సమాజపు చూపుల నుంచి తన సొగసుదనాన్ని కాపాడుకునే మహిళ సాదాసీదా ప్రతిబింబమని తెలిపారు. ఓ సెక్యులర్ పెయింటింగ్ నుంచి మతపరమైన అశాంతిని సృష్టించాలనుకునే ఓ వర్గం దుష్ప్రచారం చేస్తోందన్నారు. మూడో కన్ను స్త్రీత్వం శక్తిని వెల్లడిస్తుందన్నారు. సమాజంలోని చెడుపై తన కన్ను ద్వారా మహిళ నిరసన తెలుపుతోందని, ఇది మహిళ నిరసన తెలిపే విధానమని అన్నారు. 


చెదరిన లిప్‌స్టిక్ 

కన్నీరు కారుస్తుండటం పురుషాధిక్య సమాజంలో మహిళ అణచివేతను సూచిస్తుందన్నారు. చెదరిన లిప్‌స్టిక్ మహిళలపై రోజూ జరుగుతున్న లైంగిక దాడులను స్పష్టంగా వివరిస్తుందని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పరిపాలనలో మహిళల హక్కులు ఏ విధంగా అణచివేతకు గురవుతున్నాయో చూడండన్నారు. ఈ చిత్రం కాలం, మతం, భౌగోళిక సరిహద్దులకు అతీతమైనదని తెలిపారు. స్త్రీత్వానికి ప్రతినిధులైన అందరు తల్లులు తమ పురుష భాగస్వాముల నుంచి కాపాడుకోవడానికి తమకు తాము ముసుగు వేసుకోవాలని ఈ చిత్రం చెప్తోందన్నారు. 


హిజాబ్‌ను పాజిటివ్‌గా చూస్తా

హిజాబ్‌లో తప్పు లేదన్నారు. హిజాబ్‌లో ఉన్న తప్పు ఏమిటని ప్రశ్నించారు. తాను హిజాబ్‌ను పాజిటివ్‌గా చూస్తానన్నారు. నిజానికి ఇది సాధికారత అన్నారు. పోకిరీలు, కామాతురులైన పురుషుల చూపుల నుంచి మహిళను హిజాబ్ కాపాడుతుందన్నారు. దానిని ఎందుకు ధరించకూడదన్నారు.


చిత్రాన్ని తొలగించిన దిండా

ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కేయ ఘోష్ ట్విటర్ వేదికగా వెల్లడించిన సమాచారం ప్రకారం, హిందువుల సమైక్య శక్తి కారణంగా దుర్గా మాతను కించపరుస్తూ దిండా రూపొందించిన ఈ చిత్రాన్ని ఫేస్‌బుక్‌ నుంచి ఆయన డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-09-16T23:48:40+05:30 IST