దుర్గమ్మ నిమజ్జనంలో అపశృతులు

ABN , First Publish Date - 2020-10-28T09:49:29+05:30 IST

దుర్గామాతను నిమజ్జనం చేయడానికి మేడారం జంపన్న వాగుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదశాత్తు మృతి చెందాడు

దుర్గమ్మ నిమజ్జనంలో అపశృతులు

ఇద్దరు యువకుల మృతి


బౌద్ధనగర్‌, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): దుర్గామాతను నిమజ్జనం చేయడానికి మేడారం జంపన్న వాగుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. ఒగ్గు కథలు చెప్పే పి.నరహరియాదవ్‌ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా అంబర్‌నగర్‌లో ఇంట్లోనే దుర్గామాత విగ్రహానికి పూజలు చేస్తాడు. ఈ ఏడాది కూడా పది రోజుల పాటు పూజల తర్వాత నిమజ్జనం చేయటానికి రెండు కార్లతో పాటు టాటా ఏస్‌ వాహనంలో నరహరి యాదవ్‌తో పాటు 20 మంది సోమవారం సాయంత్రం మేడారం జంపన్నవాగుకు బయలుదేరారు. వీరిలో అంబర్‌నగర్‌కు చెందిన విజయేందర్‌, సుగుణ దంపతుల కుమారుడు నలం యశ్వంత్‌(17) కూడా ఉన్నాడు. 


అందరూ మంగళవారం ఉదయం ఏడు గంటలకు అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి జంపనవాగుకు చేరుకున్నారు. ముందుగా అందరూ స్నానం చేసిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయాలనుకున్నారు. యశ్వంత్‌ జంపన్నవాగులోకి దిగగానే సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఉదయం 9 గంటలకు ఈతగాళ్లు యశ్వంత్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. తాడ్వాయి పోలీసులు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించి మంగళవారం సాయంత్రం బంధువులకు యశ్వంత్‌ మృతదేహాన్ని అప్పగించారు.

Updated Date - 2020-10-28T09:49:29+05:30 IST