మాస్క్‌తో ఇబ్బంది లేకుండా...

ABN , First Publish Date - 2020-06-22T05:30:00+05:30 IST

బయటకు వెళ్లినప్పుడల్లా కరోనా సోకకుండా మాస్క్‌ ధరించడం తప్పనిసరి అయింది. అయితే ఎక్కువ సమయం మాస్క్‌ పెట్టుకోవడం వల్ల చెవుల వెనుక భాగం నొప్పి పుట్టడం అందరికీ అనుభవమే...

మాస్క్‌తో ఇబ్బంది లేకుండా...

బయటకు వెళ్లినప్పుడల్లా కరోనా సోకకుండా మాస్క్‌ ధరించడం తప్పనిసరి అయింది. అయితే ఎక్కువ సమయం మాస్క్‌ పెట్టుకోవడం వల్ల చెవుల వెనుక భాగం నొప్పి పుట్టడం అందరికీ అనుభవమే. చెన్నైకి చెందిన రతీశ్‌ ఎస్‌ అనే కుర్రాడికి కూడా ఇదే సమస్య ఎదురైంది. తన ఒక్కడి కోసమే కాదు చాలామందికి ఉపయోగపడేలా కాటన్‌ వస్త్రంతో తేలికైన పరిష్కారం చూపాడు రతీశ్‌. కాటన్‌ వస్త్రం తీసుకొని దాని రెండు వైపులా గుండీలు కుట్టాడు. దాంతో మాస్క్‌ ఎలాస్టిక్‌ లూప్‌ను కాటన్‌ వస్త్రానికి ఉన్న గుండీలకు తగిలించి తల వెనుక నుంచి ధరించాలి. 


‘‘బయటకు వెళ్లినప్పుడు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌ పెట్టుకోవడం తప్ప వేరే దారి లేదు. మాస్క్‌ ఎక్కువ సమయం పెట్టుకున్నప్పుడు నాకు చెవులు నొప్పిపుట్టాయి. అలాంటిది రోజంతా మాస్క్‌తో ఉంటున్న వైద్య సిబ్బంది ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఊహించుకున్నా. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇంటర్నెట్‌లో వెతికాను. అప్పుడు ప్లాస్టిక్‌, నూలుతో చేసిన మాస్క్‌లు చూశాను. అయితే వాటిని ధరించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అవి మన దగ్గర అందుబాటులో లేవు. మా సంస్థ ‘ప్రకృతి ఉత్పత్తులు’ నినాదం ప్రకారం పర్యావరణహితంగా ఉండే పరిష్కారం చూపాలనుకున్నా. మేము తయారుచేసిన కాటన్‌ స్ర్టిప్‌ జోడించిన మాస్క్‌ ధరిస్తే చెవులు నొప్పి పెట్టవు. ఎంచక్కా పనిచేసుకోవచ్చు’’అని చెబుతాడీ పర్యావరణ ప్రేమికుడు.  


Updated Date - 2020-06-22T05:30:00+05:30 IST