ఖైదీల చేతుల్లో మన్నికైన మాస్క్‌లు

ABN , First Publish Date - 2020-04-02T10:50:31+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వైద్యులు, పోలీసులు, మునిసిపా లిటీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

ఖైదీల చేతుల్లో మన్నికైన మాస్క్‌లు

నల్లగొండ క్రైం, ఏప్రిల్‌ 1 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వైద్యులు, పోలీసులు, మునిసిపా లిటీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా జైలు సిబ్బంది సైతం కరోనా వ్యాప్తిని అడ్డు కోవడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న మాస్క్‌లను తయారు చేస్తూ తమవంతు తోడ్పాటునందిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్ర కారాగారంలో ఖైదీలు మాస్కులు, ఫినాయిల్‌ తయారీలో నిమగ్నమ య్యారు. 15 రోజులుగా జైలులో ఖైదీలు మాస్కులను ముమ్మరంగా తయారు చేస్తున్నారు.


నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశాల మేరకు ఇక్కడ తయారు చేసిన వాటిని ప్రభుత్వసంస్థలకు అందజేస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 15మంది ఖైదీలు మాస్కులు, ఫినాయిల్‌ను తయారు ఉంటున్నారు. ఇప్పటివరకు 5వేలకు పైగా మాస్కులను తయారు చేసి సప్లయి చేశారు. మరో 10 వేలకు పైగా మాస్కులు ఆర్డర్‌ ఉన్నాయని వాటిని అతి త్వరలో అందించేందుకు శ్రమిస్తున్నారు. ఇకపోతే జిల్లాలో శానిటైజర్లు కావాల్సి ఉండి ఆర్డర్‌ ఇచ్చి న వారికి హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఖైదీలు తయారు చేసిన శానిటైజర్లను ఆర్డర్‌పై తెప్పించి సరఫరా చేస్తున్నారు. 


ప్రభుత్వ సంస్థలకు పంపిణీ

నల్లగొండ జిల్లా కారాగారంలో తయారుచేస్తున్న మాస్కులు, ఫినాయిల్‌ను కలెక్టర్‌ కార్యాలయం, జడ్పీ కార్యాలయం, అగ్నిమాపక శాఖ, జిల్లా కోర్టుతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. జైలులో ప్రతి రోజూ నలుగురు ఖైదీలు మాస్కులను, ఎనిమిది మందికి పైగా ఖైదీలు ఫినాయిల్‌ను తయారు చేస్తుండగా కొన్నింటినీ జిల్లా జైలు పరిసరాల్లో ఉన్న పెట్రోలు బంకు వద్ద విక్రయిస్తున్నారు. 


ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపార సంస్థలు అన్నీ మూసివేయడంతో మాస్కులు తయారు చేసేందుకు క్లాత్‌ దొరకడం ఇబ్బందిగా మారినా జైలు అధికారులు తమ పరిచయాలతో క్లాత్‌ను సమకూర్చుకుని మాస్కులను తయారు చేయిస్తున్నారు. 


నాణ్యతతో అందుబాటులోకి

మార్కెట్‌లో లభ్యమవుతున్న మాస్కుల కంటే ఖైదీలు తయారు చేస్తున్న మాస్కులు మంచి నాణ్యతతో ఉన్నాయి. ఒక్కో మాస్కు రూ.10కి విక్రయిస్తుండగా, ఫినాయిల్‌ ఒక లీటర్‌ను రూ.24కు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా జైలుకు కేసులు తగ్గినా మర్డర్‌ కేసులకు సంబంధించి అడ్మిషన్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 



Updated Date - 2020-04-02T10:50:31+05:30 IST