కార్మిక శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి

ABN , First Publish Date - 2021-03-04T05:30:00+05:30 IST

ఏలూరులోని కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు.

కార్మిక శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి

అర్హత లేకున్నా... నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

కార్మికులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం

నివేదిక తయారు చేస్తున్న ఏసీబీ

ఏలూరు క్రైం, మార్చి 4 : ఏలూరులోని కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు సంబంధించి కార్మికశాఖ జాయింట్‌ కమిషన్‌ శాఖ కార్యాలయంలో ఏలూరులోని అశోక్‌నగర్‌లో ఉంది. ఆ శాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో జిల్లా ఎసీబీ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు కె శ్రీనివాసరావు, రవీంద్రలు వారి సిబ్బందితో గురువారం దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఆ కార్యాలయ పరిధి లోని విజయవాడ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కార్యా లయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెలగల పల్లి శ్రీకాంత్‌ కారుణ్య నియామకంలో ఉద్యోగాన్ని 2014లో పొందారు. అతని విద్యార్హత ధ్రువపత్రంగా బీబీఎం కోర్సును చెన్నైలో ఉన్న సత్యభామ యూని వర్శిటీలో చదివినట్లుగా సర్టిఫికెట్‌ పెట్టారు. ఆ సర్టిఫికెట్‌ తాము జారీ చేయలేదని అది నకిలీ సర్టిఫికెట్‌ అని ధ్రువీకరించారు. శ్రీకాంత్‌పై రెండేళ్ళుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాయింట్‌ కమిషనర్‌ రామారావు వ్యవహరించారు. అంతేకాకుండా రాజమండ్రిలోని ఆఫీ సర్‌ సబ్‌ ఆర్డినేట్‌గా పనిచేస్తున్న బి.ప్రవీణ్‌ కుమార్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌గా అర్హత కల్పించారు. అతనికి ఎలాంటి విద్యార్హత లేకపోయినప్పటికీ పదోన్నతి కల్పించారు. ఈవిషయంపై ఫిర్యాదు వచ్చినప్పటికీ జాయింట్‌ కమిషనర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీలలో జరిగిన ప్రమా దాలకు కార్మికులకు యాజమాన్యం డిపాజిట్‌ చేసిన నష్టపరిహార సొమ్మును సకాలంలో విడుదల చేయ కుండా వారిని ఇబ్బంది పెడుతూ ఆ సొమ్మును అలానే ఉంచేశారు. ఇలాంటి సొమ్ముకు సంబంధించిన మూడు కోట్ల రూపాయల డిపాజిట్‌ ధ్రువపత్రాలు కార్యాల యంలో వెలుగులోకి వచ్చాయి. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ ఫ్యాక్టరీలకు విధించిన జరిమానా సొమ్ము రూ.79 కోట్లు వసూలు చేయలేదని గుర్తించారు. అంతేకాకుండా బాధితులకు నష్టపరి హారంగా ఇవ్వాలని కార్మికశాఖ విధించిన సొమ్మును సంబంధిత ఫ్యాక్టరీ యజమానుల చేత కట్టించడంలో కూడా విఫలమయ్యారని దీనివల్ల బాధితులకు సొమ్ములు సకాలంలో అందాల్సి ఉన్నా అందడం లేదని గుర్తించారు. సొమ్ములిస్తేనే ఫైళ్ళు కదులుతున్నాయి అన్న విమర్శలు ఉండడంతో ఆ దిశగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.  ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఏసీబీ డీఎస్పీ ఎస్‌ వెంకటేశ్వరరావు చెప్పారు.

Updated Date - 2021-03-04T05:30:00+05:30 IST