జీఎన్‌ఎం ఉద్యోగాల్లో నకిలీలలు

ABN , First Publish Date - 2021-12-10T06:07:31+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో కొలువు ల కోసం అడ్డదారులు తొక్కిన అక్రమార్కులపై సంబంధిత అధికారులు ఉదాసీనత చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జీఎన్‌ఎం ఉద్యోగాల్లో నకిలీలలు

 అక్రమార్కులకు అందలం

 జీఎన్‌ఎం ఉద్యోగాల కోసం నకిలీ ధ్రువపత్రాలు

 చూసీ చూడనట్లు వ్యవహరిస్తోన్న అధికారులు 

 ఏఎన్‌ఎం మెరిట్‌ లిస్ట్‌పైనా అనుమానాలు 

వైద్య, ఆరోగ్య శాఖలో కొలువు ల కోసం అడ్డదారులు తొక్కిన అక్రమార్కులపై సంబంధిత అధికారులు ఉదాసీనత చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొలువుల కోసం ఏకం గా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిన వారిపై చర్య లు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

- నల్లగొండ అర్బన్‌

 నకిలీ ధ్రువపత్రాల వెనుక సంబంధితశాఖ ఉద్యోగాల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని జీఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ పరిధిలో 14జీఎన్‌ఎం పోస్టులకు అధికారులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సుమారు 350 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేసి వైద్య ఆరోగ్యశాఖ నోటీస్‌బోర్డుపై ప్రదర్శించారు. అయితే మెరిట్‌ లిస్ట్‌పైనే అసలు ఆరోపణలు వెల్లువెత్తాయి. 14పోస్టులకు మెరిట్‌ లిస్ట్‌లో తొమ్మిది మం ది ధ్రువపత్రాల మార్కులు 95శాతానికిపైగా ఉండటంతో తోటి దరఖాస్తు దారులకు అనుమానం వచ్చిం ది. సంబంధిత అధికారులకు విషయంపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. తొమ్మి ది మంది అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు పెట్టి మెరిట్‌ లిస్ట్‌లో పేరు వచ్చే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయంపై సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలను పొందేందుకు అక్రమాలకు పాల్పడిన వారిని చూసీచూడనట్లు వదిలేయడం పట్ల అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి అసలైన అభ్యర్థులను మోసం చేశారంటూ దరఖాస్తుదారులు వాపోతున్నారు. 


96 ఏఎన్‌ఎం పోస్టుల మెరిట్‌పై అనుమానాలు 

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మరో 96 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ కూడా నోటీ్‌సబోర్డులో ప్రదర్శించా రు. ఈమెరిట్‌ లిస్ట్‌లో కూడా నకిలీ ధ్రువపత్రాలు ఉన్నాయని తోటి దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నా రు. పెద్దఎత్తున ఈ మెరిట్‌ లిస్ట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొలువులు పొం దేందుకు కొందరు ఇదే అదునుగా భావించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా కొలువులు పొందాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకొని అసలైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మెరిట్‌ లిస్ట్‌ జాబితా క్షుణ్నంగా పరిశీలించాలని, ధృవపత్రాలను తనిఖీచేసి మరోమారు మెరిట్‌ లిస్ట్‌ పెట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.  


ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు

జీఎన్‌ఎం పోస్టులకు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ధ్రువపత్రాలు జారీచేసిన కళాశాలల పేర్లను, అక్రమాలకు పాల్పడిన వారిని అధికారులు వెనుకేసుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెరిట్‌ లిస్ట్‌పై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెరిట్‌ లిస్ట్‌ జాబితా తయారు చేసేటప్పుడు గుర్తించాల్సిన అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారో తెలియాల్సి ఉంది. నోటీ్‌సబోర్డుపై ప్రదర్శించడం, తోటి అభ్యర్థులు గమనించి అధికారులకు ఫిర్యాదు చేసే వరకూ తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

 

Updated Date - 2021-12-10T06:07:31+05:30 IST