నకిలీ బంగారం తాకట్టు.. 47 లక్షలకు టోపీ

ABN , First Publish Date - 2022-01-29T06:50:33+05:30 IST

నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.47.40 లక్షలు కాజేసిన ఘటన ఇది.

నకిలీ బంగారం తాకట్టు.. 47 లక్షలకు టోపీ

  • కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ తిలక్‌ రోడ్డు బ్రాంచ్‌లో ఘటన 
  • కేసు నమోదు చేసిన ప్రకాష్‌నగర్‌ పోలీసులు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 28: నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.47.40 లక్షలు కాజేసిన ఘటన ఇది. రాజమహేంద్రవరం  కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ తిలక్‌ రోడ్డు బ్రాంచ్‌లో 2021 అక్టోబరు, నవంబరు నెలల్లో రాజమహేంద్రవరానికి చెందిన దేవీప్రసన్న, ప్రవీణ్‌కుమార్‌, వై వెంకటేశ్వరరావు, గుడివాడ కామేశ్వరరావులు బంగారం తాకట్టు పెట్టి తొలిదఫాగా రూ.19 లక్షలు, రెండో దఫా రూ.15 లక్షలు, మూడో దఫా రూ.13.40 లక్షలు రుణం తీసుకున్నారు. వీరిని బ్యాంక్‌లో పనిచేస్తున్న అప్రైజర్‌ రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన రత్న జయరామకిరణ్‌ తీసుకువచ్చి వారి బంగారాన్ని అతనే తనిఖీ చేసి రుణం ఇప్పించాడు. అయితే బ్యాంక్‌ వారు ఈ బంగారాన్ని శుక్రవారం తనిఖీ చేయించగా అది నకిలీదని తేలింది. దీంతో బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌.. ప్రకాష్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే తప్పుడు చిరునామాలతో నకిలీ బంగారంపై జయరామకిరణ్‌ రుణం తీసుకున్నట్టుగా బ్యాంక్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-29T06:50:33+05:30 IST